నాగ్-వ‌ర్మ.. టూ మ‌చ్ ఎమోష‌న‌ల్..

వ‌ర్మకు ఎమోష‌న్స్ ఉండ‌వు.. ఆయ‌న మెకానిక‌ల్.. అస‌లు ఎవ‌ర్నీ ప‌ట్టించుకోడు.. సెంటిమెంట్లు కూడా లేవంటాడు అనుకుంటారు. కానీ ఇప్పుడు వ‌ర్మ చాలా మారిపోయాడు. నాగార్జున అత‌న్ని చాలా మార్చేసాడు. ఇప్పుడు మ‌నం చూస్తున్న‌ది నిజంగా వ‌ర్మ‌నేనా అనే అనుమానం కూడా వ‌స్తుంది. నాగార్జున‌తో కొత్త సినిమా మొద‌లుపెట్టాడు వ‌ర్మ‌. ఈ ఓపెనింగ్ లో ఆయ‌న్ని చూస్తే అబ్బా.. ఎంత మాయ అనుకోక త‌ప్ప‌దు. పెదరాయుడులో ఎమ్మెస్ నారాయ‌ణ చెప్పిన‌ట్లు.. మ‌నం ఎప్పుడూ వ‌ర్మ నోట్లోంచి రావు అనుకున్న మాట‌ల‌ను విన్నాం. త‌న‌కు నాగార్జున అంటే ఏంటో.. త‌న లైఫ్ లో ఎంత స్పెష‌ల్ అనేది చెప్పాడు వ‌ర్మ‌. అంతేకాదు.. త‌న‌ను పుట్టించింది అమ్మానాన్న‌లే అయినా.. అస‌లు జ‌న్మ ఇచ్చింది మాత్రం నాగార్జునే అంటూ ఎమోష‌న‌ల్ అయిపోయాడు. త‌న‌కు మెంట‌ల్ అని.. మైండ్ దొబ్బింది అంటూ చాలా అన్నార‌ని.. జ్యూస్ అయిపోయింది అని అంటూ వెక్కిరించార‌ని.. వాళ్లంద‌రికీ త‌ను ఈ చిత్రంతో స‌మాధానం చెప్తానంటున్నాడు వ‌ర్మ‌. మైండ్ దొబ్బిన మాట నిజ‌మే అయినా.. జ్యూస్ మాత్రం ఇంకా అయిపోలేదంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

ఇక నాగార్జున కూడా చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు. త‌ను వ‌ర్మ‌ను న‌మ్మ‌డం అనేది చాలా మందికి అంతుచిక్క‌ని విష‌యంగా ఉంద‌న్నాడు నాగ్. కానీ త‌న‌కు అత‌డిపై ఎంత న‌మ్మ‌కం ఉందో ఈ సినిమా చూసిన త‌ర్వాత అంద‌రికీ అర్థ‌మ‌వుతుందంటున్నాడు ఈ హీరో. త‌న‌కు వ‌ర్మ చెప్పిన కొన్ని సీన్లు విన్న త‌ర్వాత చాలా ఎగ్జైట్ అయ్యాయ‌ని.. ఎప్పుడెప్పుడు షూటింగ్ మొద‌లు పెడదామా అని వేచి చూసాన‌ని చెప్పాడు నాగార్జున‌. వ‌ర్మ త‌న‌కు శివ కంటే గొప్ప టెక్నిక‌ల్ సినిమా ఇస్తాన‌ని మాటిచ్చాడ‌ని చెప్పాడు నాగార్జున‌. అప్ప‌ట్లో శివ ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేసిందో.. ఇప్పుడు ఈ చిత్రం కూడా అంతే చేస్తది అని అంటున్నాడు నాగార్జున‌. నాగార్జున వర్మ సినిమా ఓపెనింగ్ లో ఫస్ట్ షాట్ లో నాగార్జున‌ చెప్పిన డైలాగ్ ఇదే. నేను నిన్న‌డిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పినా.. చెప్ప‌క‌పోయినా నిన్ను చంప‌డం గ్యారెంటీ.. నువ్వు ఎంత త్వ‌ర‌గా చెబితే అంత త్వ‌ర‌గా చ‌స్తావ్.. త‌క్కువ నొప్పితో ఛ‌స్తావా.. ఎక్కువ నొప్పితో ఛ‌స్తావా అనేది నీ చూజ్ అంటూ డైలాగ్ చెప్పాడు నాగార్జున‌. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు నాగ్. న‌వంబ‌ర్ లో ప‌ది రోజుల షెడ్యూల్ చేసి.. డిసెంబ‌ర్ 22న హ‌లో విడుద‌లైన త‌ర్వాత కంటిన్యూస్ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. 2018 ఏప్రిల్ 20న ఈ చిత్రం విడుద‌ల కానుంది.