కొత్తగా.. అక్కినేని రంగుల రాట్నం..!

అక్కినేని యువ అందగాడు అఖిల్ సిల్వర్ స్క్రీన్ పై తొలి హిట్ కొట్టడానికి టైమ్ తీసుకుని మరీ బాగానే కష్టపడుతున్న విషయం తెలిసిందే. తన తొలి సినిమా ‘అఖిల్’ ఘోరంగా దెబ్బేయడంతో.. రెండో సినిమా విషయంలో అక్కినేని ఫ్యామిలీ చాలానే జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపించింది. ముఖ్యంగా కింగ్ నాగార్జున ఈ ప్రాజెక్టుకు అన్నీ తానై ముందుండి నడిపిస్తున్నారు. ఈ క్రమంలో మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో ఇటీవలే స్టార్ట్ అయిన అఖిల్ రెండో సినిమా భారీ బడ్జెట్ తో సాపీగానే షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ సినిమాకు ఈ టైటిల్ ఫిక్స్ చేశారంటూ తాజాగా మరో సరికొత్త టైటిల్ సినీ సర్కిల్ లో హల్ చల్ చేస్తుండటం విశేషం.
ఇప్పటికే జున్ను, ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక అంటూ కొన్ని టైటిల్స్ ప్రచారం కాగా, అవేమీ నిజం కావని నాగ్ తేల్చేశారు. ఇదే సమయంలో నాగ్ పాత సినిమాలోని ఓ పాటలో మొదలయ్యే పల్లవిలోని పదాన్ని కూడా ఈ సినిమాకు టైటిల్ గా అనుకుంటున్నారని ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడేమో అవేమీ నిజం కాకపోగా.. తాజాగా నాగ్ ఫిల్మ్ ఛాంబర్ లో ‘రంగుల రాట్నం’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్లు టాక్ బయటకొచ్చింది. అయితే, ఈ టైటిల్ అఖిల్ సినిమా కోసమేనా అనే విషయంపై మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇంకా ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంటివేమీ రిలీజ్ కాలేదు కాబట్టి.. స్వయంగా నాగ్ చెబితే గాని నమ్మలేం. ఇకపోతే, అఖిల్ సరసన కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను నాగ్ స్వయంగా నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. మరి ఎంతో నమ్మకంగా నాగ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు నిజంగానే రంగుల రాట్నం అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి.