ఎన్టీఆర్ సైడ్.. నాగార్జున ఎంట్రీ..

వ‌ర్మ ఏం చేసినా సంచ‌ల‌న‌మే. ఈయ‌న సినిమా అనౌన్స్ చేసినా.. అనౌన్స్ చేసిన సినిమా తీసినా.. అది విడుద‌లైనా.. ఒక్క మాట‌లో చెప్పాలంటే వ‌ర్మ అంటే సంచ‌ల‌నం. ఆయ‌న ఎక్క‌డుంటే సంచ‌ల‌నం అక్క‌డ ఉంటుందో లేదంటే సంచ‌ల‌నం ఉన్న చోటే కావాల‌ని తానుంటాడో తెలియ‌దు కానీ వ‌ర్మ మాత్రం సంచ‌ల‌నాల‌కు కేంద్ర‌బిందువు. ఇప్పుడు కూడా నాగార్జున‌తో సినిమా అనౌన్స్ చేసి మ‌రో సంచ‌ల‌నం సృష్టించాడు వ‌ర్మ‌. ఈయ‌న ఎన్టీఆర్ బ‌యోపిక్ చేస్తాడంటూ కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు స‌డ‌న్ గా ఎన్టీఆర్ బ‌యోపిక్ ను ప‌క్క‌న‌బెట్టేసాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.

నాగార్జున‌-వ‌ర్మ కాంబినేష‌న్ అంటేనే ఓ సంచ‌ల‌నం. తెలుగు ఇండ‌స్ట్రీని మార్చేసిన కాంబినేష‌న్ ఇది. 28 ఏళ్ల కింద శివ అనే క‌థ నాగార్జున న‌మ్మి ఉండ‌క‌పోయుంటే ఈ రోజు వ‌ర్మ అనే ద‌ర్శ‌కుడు మ‌న‌కు క‌నిపించే వాడు కాదు. అప్పుడు ఆయ‌న శివ చేసాడు కాబ‌ట్టే ఈ రోజు ఎంతో మంది ద‌ర్శ‌కులు వెలుగులోకి వ‌చ్చారు. ఈయ‌న చేసిన ఒక్క సినిమా ఇండ‌స్ట్రీనే మార్చేసింది. శివ‌కు ముందు.. త‌ర్వాత అనే స్థాయిలో ముద్ర వేసింది ఈ కాంబినేష‌న్. కానీ నాగ్-వ‌ర్మ త‌ర్వాత చేసిన అంతం, గోవిందా గోవిందా సినిమాలు అంచ‌నాలు అందుకోలేక‌పోయాయి. దాంతో త‌ర్వాత మ‌ళ్లీ ఈ ఇద్ద‌రూ క‌లిసి సినిమా చేయ‌లేదు. ఇన్నాళ్ళ‌కు మ‌ళ్లీ నాగార్జున‌కు క‌థ చెప్పాడు వ‌ర్మ‌.

అది త‌న‌ను ఎంతో ఇన్ స్పైర్ చేసిందంటున్నాడు నాగార్జున‌. శివ క‌థ విన్న‌పుడు ఎలా ఫీల్ అయ్యానో.. ఇప్పుడు కూడా వర్మ చెప్పిన స్టోరీ లైన్ కి అలాగే ఫీల్ అయ్యాను, అయితే ఫుల్ స్టోరీ డెవలప్ చేసి చెప్తే ఆలోచిస్తానన్నాడు నాగార్జున‌. నాగ్ పెట్టిన ప‌రీక్ష‌లో వ‌ర్మ నెగ్గిన‌ట్లే క‌నిపిస్తున్నాడు. అందుకే న‌వంబ‌ర్ లోనే త‌మ సినిమా ప‌ట్టాలెక్క‌నుంద‌ని అనౌన్స్ చేసాడు వ‌ర్మ‌. ఇప్ప‌టికే క‌థ కూడా రెడీ అయిపోయిందంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. శివ త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయి క‌థ ఇదే అంటున్నాడు నాగార్జున కూడా. వ‌చ్చే ఏడాది ఎప్రిల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఆ త‌ర్వాతే ఎన్టీఆర్ బ‌యోపిక్ ఉంటుందంటున్నాడు వ‌ర్మ‌. మ‌రి నాగ్-వ‌ర్మ కాంబినేష‌న్ ఈ జెనరేషన్ లో ఎలా ఉంటుందో చూడాలంటే మనం ఇంకొంతకాలం వెయిట్ చేయక తప్పదు మరి..!