నంది అంతా నాట‌క‌మేన‌న్న బాయిలింగ్ స్టార్..

ఇండ‌స్ట్రీలో ఒక్కోసారి ప్ర‌తిభ ఉన్న వాళ్ల‌కు కూడా అవార్డులు రావు. అలాగ‌ని అవార్డులు మాత్రమే వాళ్ల ప్ర‌తిభ‌కు కొల‌మానం కావు. కానీ ప్ర‌తిభ‌ను ప్ర‌భుత్వం గుర్తిస్తే వ‌చ్చే ఆనంద‌మే వేరు. ఎన్ని అవార్డులు వ‌చ్చినా కూడా ప్ర‌భుత్వం ఇచ్చే నంది వ‌స్తే ఆ న‌టుడికి ఉండే ఆనందం వేరు. కానీ ఆ ఆనందం కూడా కొంద‌రు కావాల‌నే దూరం చేస్తున్నారంటున్నాడు థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ. ఈయ‌నకు ఇంత క్రేజ్ రావ‌డానికి కార‌ణం ఏంటి..? 30 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలోనే ఉంటున్నా రాని గుర్తింపు.. ఒక్క సినిమాతో వ‌చ్చింది.. అదే లౌక్యం. అందులో ఈయ‌న చేసిన బాయిలింగ్ స్టార్ బ‌బ్లూ కారెక్ట‌ర్. లౌక్యం అంత పెద్ద హిట్ అయింది కేవ‌లం పృథ్వీ వ‌ల్లే అంటే అతిశ‌యోక్తి కాదేమో.. ఈ మ‌ధ్య చాలా సినిమాల్లో ఫుల్ లెంత్ రోల్స్ కూడా చేసి పేరు తెచ్చుకున్నాడు పృథ్వీ.

మూడేళ్ల‌ కింద ఈయ‌న కెరీర్ ను మ‌లుపు తిప్పిన సినిమా లౌక్యం. ఈ సినిమాలో చేసిన కామెడీకి చాలా అవార్డులు అందుకొన్నాడు బాయిలింగ్ స్టార్. నంది కూడా న‌డుచుకుంటూ వ‌స్తుంద‌ని ఊహించాడు కానీ ప్ర‌భుత్వం ఇచ్చే నంది మాత్రం మిస్ అయింది. ఆ ఏడాది త‌న‌కు నంది వ‌స్తుంద‌ని అంతా చెప్పార‌ని.. కానీ చివ‌రి నిమిషంలో అది రానందుకు చాలా బాధ ప‌డ్డాడ‌ని చెప్పాడు పృథ్వీ. అయితే అవార్డులు మాత్ర‌మే త‌న ప్ర‌తిభ‌కు కొల‌మానం కాదంటున్నాడు ఈ క‌మెడియ‌న్. నంది రాక‌పోయినా.. తానే ఓ నంది అవార్డ్ కొని.. ఇంట్లో పెట్టుకుంటాన‌ని.. అంతేకాదు దానికింద ఇది 2014లో రాని నంది అంటూ రాసుకుంటాన‌ని చెప్పాడు థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ.

2014కి గానూ ఉత్తమ క‌మెడియ‌న్ గా బ్ర‌హ్మానందానికి నంది ఇచ్చారు. అది కూడా రేసుగుర్రం సినిమాకు. కిల్ బిల్ పాండేగా ర‌ప్ఫాడించిన మాట వాస్త‌వ‌మే కానీ లౌక్యంలో బాయిలింగ్ స్టార్ కంటే అయితే కాదు. ఈ సినిమా ఎవ‌రి వ‌ల్ల అంత‌గా ఆడిందో అంద‌రికీ తెలిసిందే. అందులో 30 ఇయ‌ర్స్ పృథ్వీ ఏ రేంజ్ లో న‌వ్వించాడో కూడా అంద‌రికీ తెలిసిందే. కానీ ఆయ‌న్ని కాద‌ని బ్ర‌హ్మానందానికి నంది అవార్డ్ ఇచ్చారు. ఇది ఏ ప్రాతిప‌దిక‌న ఇచ్చారో జ్యూరికే తెలియాలి మ‌రి అని పృథ్వీ తన మనసులోని బాధను ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొన్నాడు. మొత్తానికి ఓ సీనియ‌ర్ క‌మెడియ‌న్ కు నంది అవార్డుల్లో అన్యాయం జ‌రిగింద‌నేది మాత్రం కాద‌న‌లేని వాస్త‌వం.