అ! అసలేంటి ఈ సినిమా..?

నాని నిర్మాత‌గా మారి సినిమా చేస్తున్నాడంటే ఏమో అనుకున్నారు కానీ ఇప్పుడు ఈయ‌న ఏం చేస్తున్నాడో ఎవ‌రికీ అర్థం కావ‌ట్లేదు. అస‌లు ఇది ఏ త‌ర‌హా సినిమా అనేది అస్స‌లు అంతు చిక్క‌డం లేదు. దీనికి ఓ కొత్త పేరు పెట్టాలేమో ఇప్పుడు. పైగా టైటిల్ కూడా విచిత్రంగా ఉంది. అ ప‌క్క‌న ! గుర్తు పెట్టారు. దీన్ని ఎలా ప‌ల‌కాలో కూడా తెలియ‌ట్లేదు. ఇంగ్లీష్ లో అవే అంటున్నారు కానీ తెలుగులో ఏం అనాలో అర్థం కావ‌ట్లేదు. వాల్ పోస్ట‌ర్ సినిమా అంటూ నాని నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇండ‌స్ట్రీలో ఇప్పుడు క్రేజ్ బాగానే ఉంది. ఇందులో చాలా మంది న‌టిస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క‌రి ఫ‌స్ట్ లుక్ విడుద‌లవుతూ వ‌స్తుంది. ఇప్ప‌టికే ముగ్గురి ఫ‌స్ట్ లుక్ వ‌చ్చింది. ఇప్పుడు రెజీనా లుక్ కూడా బ‌య‌టికి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన అన్ని లుక్స్ కంటే ఇది చాలా కొత్త‌గా ఉంది.

అవే పోస్ట‌ర్ లో భగవద్గీత.. పేప‌ర్లో చుట్టేసిన ఒక గన్.. ఆర్గాన్ డొనేషన్ (అవయవ దానం) కోసం సైన్ చేసే నో అబ్జెక్షన్ ఫామ్ ఇవ‌న్నీ చూస్తుంటే.. క‌చ్చితంగా నాని నిర్మించ‌బోయేది నార్మ‌ల్ సినిమా మాత్రం కాదు.. క‌చ్చితంగా ఏదో థ్రిల్ల‌ర్ అని తెలుస్తోంది. అవయవ దానం చుట్టూతా తిరిగే క‌థ‌లా అనిపిస్తుంది. అంత‌లోనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అనిపిస్తుంది.. కాదేమో సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ అనిపిస్తుంది. నిత్యా మీనన్.. శ్రీనివాస్ అవసరాల.. రెజీనా.. ఇషా రెబ్బా ఫ‌స్ట్ లుక్స్ సినిమాపై ఆస‌క్తి పెంచేసాయి. ఇంకా ప్రియదర్శి.. కాజల్ అగర్వాల్ లుక్స్ రావాలి. దానికి తోడు ర‌వితేజతో పాటు తాను కూడా వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్నాడు నాని. ఈ సెట‌ప్ అంతా చూస్తుంటే అవే.. అనేది చిన్న సినిమాలా అనిపించ‌ట్లేదిప్పుడు.