పవన్ ను అధిగమించిన నాని..!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్ లో ఉందనే విషయం అందరికీ తెలుసు. ఈ క్రమంలో సినిమా సినిమాకూ నాని తన మార్కెట్ ను పెంచుకుంటూ, తన పెర్ఫార్మెన్స్ తో అభిమానులను సంపాదించుకుంటూ ఎదుగుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. రీసెంట్ గా అయితే ‘నేను లోకల్’ లాంటి ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమా కూడా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది అంటేనే నాని రేంజ్ ఏంటో అర్థమవుతుంది. ఇక ఇప్పుడేమో క్లాస్ టచ్ ఉన్న లవ్ స్టోరీ ‘నిన్ను కోరి’ తో నాని మరో పెద్ద హిట్ కొట్టడం విశేషం.
ముఖ్యంగా ఓవర్సీస్ లో ‘నిన్ను కోరి’ రెండో వీకెండ్ కంటే ముందే మిలియన్ డాలర్ మార్క్ ను అందుకోవడం చూస్తుంటే.. నేచురల్ స్టార్ టాలీవుడ్ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తున్నాడో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కూడా ఓ విషయంలో నాని అధిగమించడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది. ఆ స్టోరీలోకి వెళితే, అమెరికాలో అత్యధిక మిలియన్ డాలర్ మూవీస్ ఉన్న హీరోల్లో నాని మొన్నటివరకు పవన్ తో కలిసి మూడో స్థానంలో ఉంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ తో సమానంగా రెండో స్థానానికి చేరుకొని సత్తా చాటాడు.
ముందుగా దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 1 నేనొక్కడినే, ఆగడు, శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం సినిమాలతో మహేష్ అగ్రస్థానంలో ఉంటే.. ఎన్టీఆర్ బాద్ షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ రూపంలో నాలుగు సినిమాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఇప్పుడు నాని కూడా నాలుగు మిలియన్ డాలర్ మూవీస్ తో ఎన్టీఆర్ సరసన చేరడం గమనార్హం. మొదట ఈగ, భలే భలే మగాడివోయ్, నేను లోకల్ సినిమాలతో మిలియన్ క్లబ్ ను అందుకున్న నాని.. తాజాగా నిన్ను కోరి సినిమాతో నాలుగోసారి ఆ మార్క్ ను టచ్ చేశాడు. దీంతో అత్తారింటికి దారేది, గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ మూడు మిలియన్ డాలర్ సినిమాలతో మూడో స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ ను తాజాగా నాని అధిగమించినట్లు అయింది. ఇది పెద్ద రికార్డు కాదని మనం అనుకున్నా.. ఓ మామూలు హీరో స్టేజ్ నుంచి మహేష్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లతో సమానంగా సత్తా చాటే రేంజ్ కు వచ్చాడంటే.. నాని కి విజిల్ కొట్టకుండా ఉండలేం.