కృష్ణుడు.. అర్జునుడు… రెండూ నానీనేనా?

Nani next film titled
యేడాదికి మూడు నాలుగు సినిమాల్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాడు నాని. రెస్ట్ కూడా తీసుకోరేంట‌ని అడిగితే… ప‌నిలోనే నాకు రెస్ట్ అంటుంటాడాయ‌న‌. అందుకే ఒక‌దాని వెంట మ‌రొక‌టి వ‌రుస‌గా ఆయ‌న సినిమాలు పట్టాలెక్కుతుంటాయి. తాజాగా `ఎమ్‌సీఎ`లో న‌టిస్తున్న ఆయ‌న త్వ‌ర‌లోనే మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న మ‌రో సినిమాని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. ఆ సినిమా టైటిల్ తాజాగా బ‌య‌టికొచ్చింది.
వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌రాజా చిత్రాల‌తో ఫేమ‌స్ అయిపోయిన మేర్ల‌పాక గాంధీ నాని కోసం ఓ ఇంట్ర‌స్టింగ్ స్క్రిప్టుని సిద్ధం చేశాడ‌ట‌. ఆ స్క్రిప్టే  `కృష్ణార్జున యుద్ధం` పేరుతో తెర‌కెక్క‌బోతోంది. పేరును బ‌ట్టి ఇందులో కృష్ణుడు, అర్జునుడు ఉంటాడ‌న్న విష‌యం అర్థ‌మ‌వుతోంది. ఆ పేరునుబ‌ట్టే ఇందులో నాని ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ని, కృష్ణుడు, అర్జునుడుగా ఆయ‌నే తెర‌పై ద‌ర్శ‌న‌మిస్తాడ‌ని ప్ర‌చారం సాగుతోంది.
అదేగ‌న‌క నిజ‌మైతే నానిని మ‌రోసారి రెండు కోణాల్లో చూసే అవ‌కాశం ల‌భిస్తుంద‌న్న‌మాట‌. పేరు పాత‌దే అయినా… జ‌నాల్లో మాత్రం బోలెడంత ఇంట్ర‌స్ట్‌ని క్రియేట్ చేస్తోంది. నానిలాంటి ఓ యంగ్ హీరో సినిమాకి ఆ పేరు ఫిక్స్ అవ్వ‌డం కాస్త ప్ర‌త్యేకంగానే ఉంది. మ‌రి పేరుకు త‌గ్గ‌ట్టుగానే సినిమా కూడా చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని ఆ చిత్ర‌బృందం చెబుతోంది.