నాని.. వెంక‌టేష్.. బాల‌కృష్ణ‌.. ఏంటిది..?

Last Updated on by

ఏంటీ లెక్క‌.. అస‌లు ఓ హీరోతో మ‌రో హీరోకు ఏమైనా సంబంధం ఉందా..? ఒక‌రేమో కుర్ర హీరో.. మ‌రొక‌రు సీనియ‌ర్.. ఇంకొక‌రు ప‌క్కా మాస్ హీరో.. ఈ ముగ్గురికి సంబంధం ఎక్క‌డుంది..? అస‌లు ఎక్క‌డ పోలిక కుదిరింది అనుకుంటున్నారా..? ఉంది.. ఖచ్చితంగా ఈ ముగ్గురు హీరోల‌కు పొంత‌న ఉంది. ఈ మ‌ధ్య కాలంలో వీళ్లు చేసిన ప‌నులు ఒకేలా ఉన్నాయి. అదే సినిమాలు మొద‌లుపెట్టి ఆపేయడం. అవును.. వెంక‌టేష్ నే తీసుకోండి. తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న ఓ సినిమా చేయాలి. సినిమా మొద‌లైంది కూడా. షూటింగ్ కు వెళ్ల‌డ‌మే త‌రువాయి అనుకుంటున్న త‌రుణంలో ఈ సినిమా ఆగిపోయింద‌నే క‌బురు వ‌చ్చింది. గ‌తంలోనూ తేజ‌తో సావిత్రి అనే సినిమా మొద‌లుపెట్టి ఆపేసాడు వెంకీ. ఇక బాల‌య్య కూడా ఎన్టీఆర్ బ‌యోపిక్ ను ప్ర‌స్తుతానికి ప‌క్క‌న‌బెట్టిన‌ట్లు తెలుస్తుంది.

ఈ చిత్రం నుంచి ద‌ర్శ‌కుడు తేజ కూడా త‌ప్పుకున్నాడు. ఈయ‌న స్థానంలోకి ఇంకా ఏ ద‌ర్శ‌కుడు రాలేదు. ఇక నాని కూడా ఇదే చేసాడు. విక్ర‌మ్ కే కుమార్ తో ఈయ‌న ఓ సినిమా చేస్తాన‌ని గ‌తంలో చెప్పాడు. విక్ర‌మ్ కూడా ఈ కాంబినేష‌న్ పై క్లారిటీ ఇచ్చి త‌న ప‌ని తాను చేసుకుంటున్నాడు. ఇలాంటి టైమ్ లో కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ అయింద‌ని.. విక్ర‌మ్ సినిమాపై ఆలోచ‌న‌లో ప‌డ్డాడు న్యాచుర‌ల్ స్టార్. ఇప్పుడు కానీ ఏదైనా అర్థం కాని సినిమా చేస్తే ప్రేక్ష‌కులు మ‌రో షాక్ ఇస్తార‌ని విక్ర‌మ్ సినిమాను ఆదిలోనే ఆపేసాడు నాని. ప్ర‌స్తుతం నాగార్జున హీరోగా మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాడు నాని. శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. ఇది విడుద‌లైన త‌ర్వాత కానీ నెక్ట్స్ సినిమాపై క్లారిటీ ఇచ్చేలా లేడు ఈ హీరో. మొత్తానికి ఇలా ఈ ముగ్గురు హీరోలు ఇప్పుడు ఒకేదారిలో వెళ్తున్నారు.

User Comments