`మా`లో మ‌ళ్లీ కుమ్ములాట‌లు?

Last Updated on by

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) లో కుమ్ములాట‌ల గురించి తెలిసిందే. గ‌త ఏడాది ఆద్యంతం మా అసోసియేష‌న్ ప‌రువును దిగ‌జార్చిన స‌న్నివేశం క‌ళ్ల ముందే ఉంది. మూవీ ఆర్టిస్టుల సంఘంలో నిధుల గోల్ మాల్ జ‌రిగింద‌ని, దీనిపై నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ వేయాల‌ని మా జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ సీనియ‌ర్ న‌రేష్ మీడియా ముఖంగా ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ర‌చ్చ ర‌చ్చ అయ్యింది. మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్య‌క్షుడు శివాజీరాజా ఈ గోల్ మాల్ చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై మా క‌మిటీ రెండుగా చీలిపోయింది. అయితే ఆ త‌ర్వాత ఆ ఇద్ద‌రినీ క‌లిపి ప‌రువు నిల‌బెట్టేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. గొడ‌వ‌ను ఏదోలా స‌ద్ధుమ‌ణిగేలా చేసి ఇద్ద‌రినీ క‌లిపారు. ఆ త‌ర్వాత 2019 మా డైరీని ఆ ఇద్ద‌రూ ఒకే వేదిక‌పైకి వ‌చ్చి ఆవిష్కరించారు.

క‌లిసిపోయారు అనుకుంటుండ‌గానే, మ‌ళ్లీ `మా`లో లుక‌లుక‌లు బ‌య‌టికి వ‌చ్చాయి. ప్ర‌స్తుతం మా అసోసియేష‌న్ లో మ‌రోసారి క‌ల‌త‌లు త‌ప్పేలా లేవ‌న్న వాద‌నా వినిపిస్తోంది. ఎలానూ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డింది కాబ‌ట్టి, అధ్య‌క్ష ప‌ద‌వి కోసం పోటీ పెరిగింది. మ‌రోసారి శివాజీరాజా మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్య‌క్షుడిగా పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి శివాజీరాజాకు వ్య‌తిరేకంగా అపోజిష‌న్ లో అధ్య‌క్ష ప‌ద‌వి కోసం సీనియ‌ర్ న‌రేష్ పోటీప‌డేందుకు సిద్ధ‌మ‌వుతున్నారట‌. ప్ర‌స్తుతం జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఉన్న న‌రేష్ ఈసారి ఎన్నిక‌ల్లో శివాజీ రాజాపై కాలు దువ్వేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. 2019 ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతున్న వేళ దీనిపై వాడి వేడిగా ఇంట‌ర్న‌ల్ గా చ‌ర్చా సాగుతోంది. అయితే ఎవ‌రు ఏ ర‌కంగా పోటీప‌డినా మా అసోసియేష‌న్ ప‌రువు తీయ‌కుండా, అలాగే సొంత భ‌వంతి నిర్మాణానికి నిజాయితీగా ప‌ని చేయాల‌ని అంతా కోరుతున్నారు.


Related Posts