అస‌లిది పాటేనా! ఏంటిది మ్యాస్ట్రో?

మ్యూజిక్ మ్యాస్ట్రో ఏ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అంటే చెవికోసుకునే వీరాభిమానులున్నారు. ఆయ‌న నుంచి ఓ ఆల్బ‌మ్ వ‌స్తోంది అంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తారు. అయితే ఇటీవ‌లి కాలంలో రెహ‌మాన్ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో అరుదుగానే సినిమాలు చేస్తున్నారు. ఏడాదికో ఆల్బ‌మ్ అయినా వినే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. అందునా సౌత్‌లో ఆయ‌న ప్రాభ‌వం అస‌లే లేదు. అడ‌పా ద‌డ‌పా మ‌ణిర‌త్నం, శంక‌ర్ లాంటి వాళ్లు త‌లుచుకుంటే త‌ప్ప ఆయ‌న సినిమాలే చేయ‌డం లేదు.

ఇలాంటి వేళ ఆయ‌నో సినిమా చేస్తున్నారు. అదే న‌వాబ్‌. మ‌ణిర‌త్నం ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. న‌వాబ్‌కి సంబంధించిన ప్ర‌చారం ప్ర‌స్తుతం హోరెత్తిపోతోంది. ఇదివ‌ర‌కూ రిలీజ్ చేసిన పోస్టర్లు, సింగిల్స్ కి చ‌క్క‌ని ప్ర‌చారం ద‌క్కింది. తాజాగా న‌వాబ్ నుంచి మ‌రో సాంగ్ లాంచ్ చేశారు. భ‌గ భ‌గ .. హృద‌య‌మా! అంటూ సాగే ఈ పాట అంతంత మాత్రంగానే ఉంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. టూమ‌చ్ పోయెటిక్ .. అర్థం కాని ప‌దాల‌తో గ‌మ‌కాల‌తో.. అంత ఇంపాక్ట్ లేదన్న విమ‌ర్శ త‌ప్ప‌లేదు. రెహ‌మాన్ ట్యూన్ గ‌తి త‌ప్పిందా? మునుప‌టి హోరు లేదేమిటో.. అంటూ పెద‌వి విరిచేస్తున్నారు. ఇక‌పోతే ఎంతో ఎమోష‌న‌ల్ గా సాగాల్సిన ఈ పాట ఏదో అయ్యిందే అన్న‌ట్టే ఉంద‌న్న క్రిటిసిజం ఎదుర‌వుతోంది. ఈ త‌ర‌హా పాట‌ల‌తోనే ఇదివ‌ర‌కూ విల‌న్ సినిమా మొహం మొత్తేసింది. అస‌లిది పాటేనా! ఏంటిది మ్యాస్ట్రో? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఆల్బ‌మ్ అంతా ప‌రిశీలిస్తే ఏదో ఒక మ‌చ్చు తున‌క దొర‌క్కుండా ఉండ‌దు. కాస్త వేచి చూడాలి.