రివ్యూ: నీదినాది ఒకేక‌థ‌

రివ్యూ: నీదినాది ఒకేక‌థ‌
న‌టీన‌టులు: శ్రీ‌విష్ణు, స‌ప్న‌టైటిస్, దేవీ ప్ర‌సాద్, రూప‌ల‌క్ష్మి త‌దిత‌రులు
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: వేణు ఉడుగుల‌
నిర్మాత‌: కృష్ణవిజ‌య్, ప్ర‌శాంతి, నారా రోహిత్

నీదినాది ఒకేక‌థ‌.. విన‌డానికే ఆస‌క్తిక‌రంగా అనిపించే టైటిల్. ఈ టైటిల్ తోనే సినిమాపై అంచ‌నాలు కూడా పెరిగాయి. ఇక ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత క‌చ్చితంగా సినిమాలో ఏదో ఉండ‌బోతుంద‌నే విష‌యం అర్థ‌మైపోయింది. మ‌రి నిజంగానే నీదినాది ఒకేక‌థ‌లో అంత విష‌యం ఉందా..?

క‌థ‌: 
సాగ‌ర్(శ్రీ‌విష్ణు) మూడేళ్లుగా డిగ్రీ ప‌రీక్ష‌లు రాస్తున్నా పాస్ కాడు.. కాలేడ‌ని త‌న‌కు కూడా తెలుసు. ఇక సాగ‌ర్ తండ్రి దేవీప్ర‌సాద్(దేవీ ప్ర‌సాద్) ఓ టీచ‌ర్. ప‌దిమందికి పాఠాలు చెప్పే టీచ‌ర్ ఇంట్లోనే చ‌దువు రాకుండా ఉంటాడు సాగ‌ర్. అదే ఆయ‌న‌కు అవ‌మానంగా ఫీల్ అవుతుంటాడు. త‌న కొడుకు బాగా ఎద‌గాల‌ని అనుక్ష‌ణం ఆలోచిస్తుంటాడు. ఆ క్ర‌మంలో తండ్రికి న‌చ్చేలా మారిపోవాల‌ని ఏవేవో చేస్తుంటాడు సాగ‌ర్. ఈ స‌మ‌యంలో సాగ‌ర్ జీవితంలోకి వ‌స్తుంది ధార్మిక‌(స‌ప్న‌టైటిస్). ఏళ్లు గడుస్తున్నా ఏం చేయాలో తెలియ‌క మాన‌సిక రోగిలా మారిపోతుంటాడు సాగ‌ర్. చివ‌రికి ఇత‌ను ఏం అయ్యాడు..? త‌ండ్రి మెప్పు పొందాడా లేదా అనేది అస‌లు క‌థ‌.

క‌థ‌నం: 
నీదినాది ఒకేక‌థ‌.. టైటిల్ లోనే క‌థ చెప్పేసాడు ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల‌. ఇందులో మీకు తెలియ‌ని క‌థేమీ ఉండ‌దు.. ప్ర‌తీ ఇంట్లో జ‌రిగే క‌థ ఇక్క‌డ కూడా ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెప్పేసాడు. చూసినా కూడా ఇదే క‌నిపిస్తుంది కూడా. చ‌దువు రాని.. లేని ఓ కొడుకు క‌థ ఇది. స‌మాజంలో త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని.. మంచి పేరు తెచ్చుకున్న టీచ‌ర్ క‌థ ఇది. అలాంటి తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉండే మాన‌సిక సంఘ‌ర్ష‌ణే నీదినాది ఒకేక‌థ‌. కొడుకు బాగుప‌డ‌క‌పోతే త‌న ప‌రువు ఎక్క‌డ పోతుందో అని బాధ‌ప‌డే తండ్రి.. తండ్రికి న‌చ్చేలా ఎలా మారాలో తెలియ‌క త‌న‌లో త‌నే బాధ‌ప‌డే కొడుకు.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగే క‌థే నీదినాది ఒకేక‌థ‌. ద‌ర్శ‌కుడు దీన్నే కొంత ఎంట‌ర్ టైనింగ్ గా చెప్పాల‌ని చూసాడు. ఫ‌స్టాఫ్ లో చాలా వ‌ర‌కు సీన్స్ ఫ‌న్నీగా ఉన్నాయి. ఎంట‌ర్ టైనింగ్ గానే వెళ్లింది సినిమా. హీరో ఎంట్రీ నుంచి త‌ను చేసే ప్ర‌తీ ప‌ని కామెడీగానే చూపించాడు ద‌ర్శ‌కుడు. కానీ క‌థ‌లో సీరియ‌స్ నెస్ పెరిగిన త‌ర్వాత గాడిత‌ప్పింది. సెకండాఫ్ మొద‌లైన త‌ర్వాత తండ్రీ కొడుకుల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ క‌థ‌ను కాస్త ప‌క్క‌దారి ప‌ట్టించిన‌ట్లు అనిపించింది. ఏ తండ్రి కూడా త‌న కొడుకు మ‌రీ అంత‌గా దిగ‌జారిపోతుంటే చూడ‌లేడు.. అలాగ‌ని కొడుకు కూడా తండ్రిని బాధ పెట్టాల‌ని అనుకోడు.. ఈ బ్యాలెన్సింగ్ సీన్స్ ఇంకాస్త బాగా రాసుకునుంటే బాగుండేదేమో అనిపించింది. క్లైమాక్స్ మ‌రీ ఈజీగా తేల్చేసాడు ద‌ర్శ‌కుడు. న్యాచుర‌ల్ గా ఉంటుంద‌ని చెప్పాడో ఏమో కానీ ఇది చాలా మందికి న‌చ్చ‌క‌పోవ‌చ్చు. కానీ ప్ర‌శంస‌ల ద‌గ్గ‌ర మాత్రం ఆగే సినిమా అవుతుంది ఇది.

న‌టీన‌టులు: 
శ్రీ‌విష్ణు బాగా న‌టించాడు. ఈయ‌న సినిమా సినిమాకు మెరుగ‌వుతున్నాడు. గ‌త సినిమాల‌తో పోలిస్తే ఈ పాత్ర‌లో ఇంకా బాగా చేసాడు. ఇక హీరోయిన్ స‌ప్న‌టైటిస్ ప‌ర్లేదు. లిప్ సింక్ కాలేదు ఈ అమ్మాయికి. న‌ట‌న ప‌రంగా ఓకే. దేవీప్ర‌సాద్ కారెక్ట‌ర్ సినిమాకు బ‌లం. తండ్రి పాత్ర‌లో ఆయ‌న బాగా న‌టించాడు. తండ్రీ కొడుకుల మ‌ధ్య వ‌చ్చే సీన్స్ బాగున్నాయి. పోసాని ఉన్న‌ది రెండు సీన్లే అయినా బాగున్నాయి. ఇక మిగిలిన పాత్ర‌ల్లో ఎవ‌రి పాత్ర ప‌రిధి మేర‌కు వాళ్లు బాగానే న‌టించారు.

టెక్నిక‌ల్ టీం: 
సురేష్ బొబ్బిలి సంగీతం బాగుంది. ఆర్ఆర్ ప‌ర్లేదు కానీ మ‌రీ ఆఫ్ బీట్ సినిమాకు కొట్టిన‌ట్లుగా అనిపించింది. తోట రాజు ఎడిటింగ్ ఓకే. రెండు గంట‌ల సినిమానే ఉన్నా కూడా ఎందుకో కానీ సెకండాఫ్ కాస్త ల్యాగ్ అయిన‌ట్లు అనిపించింది. సినిమాటోగ్ర‌ఫీ గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు. అన్నీ న్యాచుర‌ల్ లొకేష‌న్లు కాబ‌ట్టి సింపుల్ గా బాగుంది. ఇక ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల తొలి సినిమాకే చాలా స్ట్రాంగ్ కంటెంట్ తీసుకున్నాడు. స‌మాజానికి ఏదో మెసేజ్ ఇద్దామ‌ని రాసుకున్న క‌థ ఇది. కానీ అది అంత బాగా వ‌ర్క‌వుట్ కాలేదు. కానీ ఈయ‌న చెప్పాల‌నుకున్న క‌థ మాత్రం ప్రేక్ష‌కుల‌కు రీచ్ అవుతుంది. తండ్రి కొడుకు.. ఇక్క‌డ ఎవ‌రూ త‌ప్పు కాదు.. అందుకే ఎవ‌ర్నీ త‌క్కువ చేయ‌కుండా చేసే బ్యాలెన్సింగ్ లో క‌థ‌లో బ్యాలెన్స్ త‌ప్పింది. ద‌ర్శ‌కుడిగా తొలి అడుగు ఆలోచింప‌చేసే సినిమాతో వేసాడు వేణు. దానికి అత‌డు అభినంద‌నీయుడు.

చివ‌ర‌గా: 
నీదినాది ఒకేక‌థ‌.. తండ్రి కొడుకుల మ‌ధ్య మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌..

రేటింగ్: 3.0/5