నేల‌ టికెట్టు రివ్యూ

Last Updated on by

రివ్యూ: నేల‌ టికెట్టు
న‌టీన‌టులు: ర‌వితేజ‌, మాళ‌విక శ‌ర్మ‌, జ‌గ‌ప‌తిబాబు, కౌముది, శ‌ర‌త్ కుమార్, సంప‌త్..
సంగీతం: శ‌క్తికాంత్ కార్తిక్
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల‌

సోగ్గాడే చిన్నినాయ‌నా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి విజ‌యాల త‌ర్వాత క‌ళ్యాణ్ కృష్ణ నుంచి వ‌స్తోన్న సినిమా కంటే ఖచ్చితంగా అంచ‌నాలు భారీగానే ఉంటాయి. పైగా ర‌వితేజ హీరో కావ‌డంతో మ‌రింత ఆస‌క్తి రేగింది. మ‌రి ఈ అంచ‌నాల‌ను నేల‌టికెట్ అందుకుందా..? ర‌వితేజ కోరుకున్న హిట్ ఈ చిత్రం అందించిందా..?

క‌థ‌:
ర‌వితేజ ఓ అనాథ‌. చిన్న‌ప్ప‌ట్నుంచీ చుట్టూ జ‌నం.. మ‌ధ్య‌లో మ‌నం అనుకుంటాడు. ప‌దిమందికి సాయం చేయాల‌నుకుంటాడు. విశాఖ‌ప‌ట్నంలో అనుకోకుండా ఓ స‌మ‌స్య‌లో ఇరుక్కుని హైద్రాబాద్ కు వ‌స్తాడు. వ‌చ్చీ రాగానే డాక్ట‌ర్ మాళ‌విక‌(మాళ‌విక శ‌ర్మ‌)తో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత అనుకోకుండా హోమ్ మినిస్ట‌ర్ ఆదిత్య భూప‌తి(జ‌గ‌ప‌తిబాబు)తో గొడ‌వ‌ పెట్టుకుంటాడు. దానికి ముందే జ‌రిగిన సిఎం ఆనంద‌భూప‌తి(శ‌ర‌త్ కుమార్) హ‌త్య కేసులో ర‌వితేజ చెల్లి రిపోర్ట‌ర్ గౌత‌మి (కౌముది) కీల‌క సాక్ష్యంగా ఉంటుంది. అప్ప‌ట్నుంచీ క‌థ అస‌లు మ‌లుపు తిరుగుతుంది. అస‌లు ర‌వితేజ‌కు హోమ్ మినిస్ట‌ర్ తో సంబంధం ఏంటి..? ఏం జ‌రుగుతుంది అనేది అస‌లు క‌థ‌.

క‌థ‌నం:
మ‌న చుట్టూ ఉన్న పదిమందికి సాయం చేయాలి.. మ‌న సంతోషాన్ని ప‌దిమందితో పంచుకోవాలి అనుకునేది మంచి కాన్సెప్ట్. ఇలాంటి క‌థ‌లు తెలుగులో చాలా వ‌చ్చాయి. కానీ తీసే ప‌ద్ద‌తిలో తీస్తే ఎన్నిసార్లైనా ప్రేక్ష‌కులు చూస్తార‌ని ఇదివ‌ర‌కే ప్రూవ్ అయింది కూడా. కానీ క‌ళ్యాణ్ కృష్ణ మాత్రం ఈ విష‌యంలో ఎందుకో వెన‌క‌బ‌డిపోయాడు. తెలిసిన క‌థే కావ‌డంతో పాటు దానికి తోడు మ‌రింత రొటీన్ స్క్రీన్ ప్లేతో మొద‌టి సీన్ నుంచే నేల‌టికెట్ చాలా సాఫీగా సాగిపోతుంది. ఏ ట్విస్టులు లేకుండా(ద‌ర్శ‌కుడు ట్విస్టులు అనుకున్న‌వి కూడా ముందే రివీల్ అయిపోయేంత రొటీన్ స్క్రీన్ ప్లే) క‌థ ముందుకు వెళ్తుంటుంది. హీరో విశాఖ‌ప‌ట్నంలో దొంగ సాక్ష్యాలు చెప్ప‌డం.. గొడ‌వ‌తో హైద్రాబాద్ రావ‌డం.. ఇక్క‌డ గొడ‌వ‌ల‌కు దిగ‌డం.. ఆ క్ర‌మంలోనే హీరోయిన్ ను చూసి ఆమె ప్రేమ కోసం ప్ర‌ద‌క్ష‌ణ‌లు చేయ‌డం.. అంత‌లోనే హోమ్ మినిస్ట‌ర్ తో గొడ‌వ‌.. ఇలా ఊహించిన‌ట్లే క‌థ ముందుకు వెళ్తుంటుంది.

ఇంట‌ర్వెల్ లో వ‌చ్చే యాక్ష‌న్ సీక్వెన్స్ కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. హీరో, విల‌న్ ఎదురుప‌డ్డ సీన్ ను ఎంతో గొప్ప‌గా ఊహించుకునే ప్రేక్ష‌కుడికి చ‌ప్ప‌గా ఉండే సీక్వెన్సులు అందించాడు ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్. సెకండాఫ్ లో కూడా ఇదే సంగ‌తి. సందేశాన్ని మిక్స్ చేసినా కూడా తెలిసిన స్క్రీన్ ప్లే తేలిపోయేలా చేసింది. పోలీస్ సెలెక్ష‌న్ లో జ‌రుగుతున్న అన్యాయాలు.. జ‌నాల ద‌గ్గ‌ర రాజ‌కీయ నాయ‌కులు చేస్తున్న దోపిడీల‌ను చూపించే ప్ర‌య‌త్నం చేసాడు ద‌ర్శ‌కుడు. కానీ అవి స‌రైన ప‌ద్ద‌తిలో ప్ర‌జెంట్ చేయ‌లేద‌నిపించింది. దాంతో నేల‌టికెట్ ముందు నుంచి నాసీరకంగా అనిపిస్తుంది.

న‌టీన‌టులు:
ర‌వితేజ న‌ట‌న‌కు పేరు పెట్టాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ఎప్ప‌ట్లాగే చంపేసాడు. అనాధ‌గా మొద‌లై.. చుట్టూ ప‌దిమంది చేరిపోయే వ‌ర‌కు త‌న పాత్ర‌ను బాగానే ర‌క్తి క‌ట్టించాడు మాస్ రాజా. కానీ క‌థే ఆయ‌న‌కు స‌హ‌క‌రించలేదు. ఇక హీరోయిన్ మాళ‌విక అనుకున్న‌ట్లుగానే కేవ‌లం అందాల ఆర‌బోత‌తో పాటు పాట‌ల‌కు ప‌నికొచ్చింది. ర‌వితేజ చెల్లిగా కౌముది ప‌ర్లేదు. జ‌గ‌ప‌తిబాబు విల‌న్ గా రొటీన్ అనిపించాడు. కొత్త‌గా అయితే ఏం లేదు కానీ బాగానే చేసాడు. శ‌ర‌త్ కుమార్ గెస్ట్ అప్పియ‌రెన్స్ బాగుంది. హీరో ఫ్రెండ్స్ గా అలీ, ప్రియ‌ద‌ర్శి, ప్ర‌వీణ్ బాగా చేసారు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నిక‌ల్ టీం:
నేల‌టికెట్ కు అతిపెద్ద మైన‌స్ మ్యూజిక్. ఫిదాకు అదిరిపోయే సంగీతం అందించిన శ‌క్తికాంత్ కార్తిక్ ఈ సారి మాత్రం పూర్తిగా తేలిపోయాడు. పూర్తిగా మాస్ స‌బ్జెక్ట్ కావ‌డంతో త‌న మార్క్ చూపించ‌లేదు. సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. ఎడిటింగ్ వీక్.. ఎందుకంటే మూడు గంట‌ల సినిమా చూడ‌లేరు ప్రేక్ష‌కులు. మ‌ధ్య‌లో కొన్ని సీన్లు బోర్ కొట్టించేసాయి. అస‌లు బ్ర‌హ్మానందం ఎందుకున్నాడో ఎవ‌రికీ అర్థం కాదు. క‌థ మంచిదే కానీ క‌థ‌నం బాగోలేదు. తెలిసిన క‌థే కావ‌డంతో క‌ళ్యాణ్ కృష్ణ కొత్త ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది.. కానీ లేదు అందుకే సినిమా కూడా నేల‌టికెట్ మాదిరి నాసీరకంగానే ఉంది. ప్రొడ‌క్ష‌న్ వైజ్ గా మాత్రం సినిమా రిచ్ అనిపించింది.

చివ‌ర‌గా: నేల‌టికెట్.. నేల నాకించేస్తారు..!

రేటింగ్: 2/5

User Comments