వర్సిటీలకు కొత్త చట్టం రెడీ

రాష్ట్రంలో కొత్త యూనివర్సిటీల చట్టం రాబోతోంది. యాక్ట్‌‌‌‌కు సంబంధించి డ్రాఫ్ట్‌‌‌‌ ఇప్పటికే సిద్ధమైంది. వారంలో సర్కారుకు అందనుంది. వీసీల నియామకానికి ఇప్పటికే నోటిఫికేషన్‌‌‌‌ ఇచ్చినందున ఈ నెలాఖరులోగా చట్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధాన చట్టంతో పాటు రెండు, మూడు ఉప చట్టాలూ చేర్చనున్నట్టు తెలిసింది.ఉమ్మడి రాష్ర్టంలో ఏపీ వర్సిటీ చట్టం-1991 ఉండేది. ఉస్మానియా వర్సిటీ ప్రత్యేక యాక్ట్‌‌‌‌-1959 నూ దీంట్లోనే కలిపారు. ఆరు సాంప్రదాయిక కోర్సులున్న ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ వర్సిటీలకు ఓ చట్టం.. బీఆర్‌‌‌‌ అంబేద్కర్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ వర్సిటీ, జేఎన్‌‌‌‌టీయూహెచ్‌‌‌‌, జవహర్‌‌‌‌లాల్‌‌‌‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌‌‌‌ అండ్‌‌‌‌ ఫైన్‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలకు ఒక్కో చట్టం ఉంది. రాజీవ్‌‌‌‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక వర్సిటీ (ఆర్‌‌‌‌జీయూకేటీ- బాసర) చట్టం లేకుండానే సాగుతోంది. రాష్ర్ట ఆవిర్భావం తర్వాత ఏపీ వర్సిటీ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అడాప్ట్‌‌‌‌ చేసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 15 వర్సిటీలున్నాయి. వీటిలో 11 విద్యా శాఖ, 3 వ్యవసాయ శాఖ, ఒకటి ఆరోగ్య శాఖ పరిధిలో నడుస్తున్నాయి. విద్యా శాఖ పరిధిలోని 11 వర్సిటీలకు ‘కామన్‌‌‌‌’ చట్టం తీసుకురావాలని సర్కారు భావిస్తోంది.

వర్సిటీలకు నిధుల విడుదల, నియామకాలు, పర్యవేక్షణలో ఇబ్బందులు వస్తుండటంతో రాష్ట్రంలోని వర్సిటీలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. కామన్‌‌‌‌ చట్టం కోసం కమిటీని నియమించాలని ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. దీంతో ప్రొఫెసర్లు సిద్ధిఖీ, జీబీరెడ్డి, గోపాల్‌‌‌‌రెడ్డి, రాంప్రసాద్‌‌‌‌లతో ఓ కమిటీని మండలి నియమించింది. ఆ కమిటీ అన్ని వర్సిటీలను సందర్శించి వీసీలు, ప్రొఫెసర్లతో మాట్లాడి సమాచారం సేకరించింది. అన్ని వర్సిటీలకు ఒకే చట్టం తెస్తే ఇబ్బందులొస్తాయని తెలుసుకుంది.సాంప్రదాయ కోర్సులున్న వర్సిటీలకు ఓ చట్టం తీసుకొచ్చి దానికి అనుబంధంగానే టెక్నికల్‌‌‌‌, కల్చరల్‌‌‌‌లతో సబ్‌‌‌‌ యాక్టులను తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు ఆర్‌‌‌‌జీయూకేటీని టెక్నికల్‌‌‌‌ విభాగంలో చేర్చి చాన్సలర్‌‌‌‌గా గవర్నర్‌‌‌‌ నియమిస్తూ వీసీనీ సర్కారు నియమించేలా చట్టంలో మార్పులు తీసుకొస్తున్నారు. ‘కేంద్ర జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా యూజీసీ నిబంధనలకు లోబడి కొత్త చట్టం రూపొందిస్తున్నామని, వారంలో నివేదిక ఇస్తామని కమిటీ సభ్యుడొకరు ‘వెలుగు’తో చెప్పారు.