38 మంది డీఎస్పీలకు పోస్టింగ్‌

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన నెలన్నర తర్వాత సబ్‌ డివిజన్లకు అధికారుల నియామకం జరిగింది. 38 మంది డీఎస్పీలను రాష్ట్రంలోని పోలీసు సబ్‌ డివిజన్లలో నియమిస్తూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సుమారు 70సబ్‌ డివిజన్లకుపైగా ఎస్‌డీపీవోలు మారుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా.. 38 మందిని మాత్రమే నియమించారు. అయితే ఈ నియామకాలపై పోలీసుశాఖలో కొందరు పెదవి విరుస్తున్నారు. జిల్లాల ఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐల పోస్టింగ్‌ల ప్రక్రియను వారం రోజుల్లోనే పూర్తి చేశారు.. డీఎస్పీల పోస్టింగ్‌లపై ఏడు వారాల కసరత్తు తర్వాత కూడా ఇలా చేస్తారా? అంటూ సీనియర్‌ డీఎస్పీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాలుగైదేళ్లుగా సబ్‌ డివిజన్‌ కోసం ఎదురు చూస్తున్న వారిని కాదని సూపర్‌ న్యూమరీ వాళ్లకు ఇవ్వడం ఏమిటనే ప్రశ్న లేవనెత్తుతున్నారు.

ముఖ్యంగా రాజధాని జిల్లాల్లో రెండు సబ్‌ డివిజన్లలో పోస్టింగ్‌లపై బాగా చర్చ జరుగుతోంది. విజయవాడ సిటీలో సెటిల్‌మెంట్లు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఒక ఏసీపీని కమిషనర్‌ పంపేస్తే ఆయనకు కీలక సబ్‌డివిజన్‌ ఇప్పించడంలో పోలీసు శాఖలోని ఒక ఉద్యోగి చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఏసీబీ కేసులున్న మరో డీఎస్పీకి అత్యంత కీలకమైన ప్రాంతంలో పోస్టింగ్‌ ఇవ్వడం విశేషం. అలాగే పోస్టింగ్‌ ఇచ్చిన 38 మందిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన 16 మందికి కీలక సబ్‌ డివిజన్లు కేటాయించడం కూడా చర్చనీయాంశమైంది.