వైజాగ్ కాదు.. అమ‌రావ‌తిలోనే సినీప‌రిశ్ర‌మ‌!

బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలో కొత్త సినీప‌రిశ్ర‌మ ఏర్పాటు గురించి గ‌త కొంత‌కాలంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఏపీ, తెలంగాణ డివైడ్ త‌ర్వాత ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చిన అంశమిది. అయితే ఏపీ ప్ర‌భుత్వం రాజ‌ధాని నిర్మాణం హ‌డావుడిలో ఈ విష‌యానికి పెద్దంత‌గా ప్రాధాన్య‌త‌నివ్వ‌లేదు. అయితే ఇటీవ‌లే కొంద‌రు సినీపెద్ద‌లు వెళ్లి నేరుగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడునే సంప్ర‌దిస్తే ఒక కొత్త ప‌రిశ్ర‌మ నిర్మాణం మాత్రం ఖాయం అంటూ ప్ర‌క‌ట‌న చేశారు. ఆ సంగ‌తిని సినీపెద్ద‌లు సైతం మీడియా ముఖంగా తెలియ‌జేశారు. కానీ ఎందుక‌నో ఇంకా కొత్త ప‌రిశ్ర‌మ ఏర్పాటు విష‌యంలో అస్ప‌ష్ట‌త నెల‌కొంది. ఇలాంటి సందిగ్ధ స‌మ‌యంలోనే ఏపీఎఫ్‌డీసీ(విజ‌య‌వాడ‌) నుంచి ఓ అధికారిక ప్రెస్‌నోట్ అన్ని మీడియాల‌కు అందింది. దాని సారాంశం.. విశాఖ న‌గ‌రంలో కాపులుప్పాడ నుంచి భీమిలి ప‌రిస‌రాల్లో ఒక కొత్త సినీప‌రిశ్ర‌మ ఏర్పాటున‌కు చంద్ర‌బాబు సుముఖంగా ఉన్నారు. అక్క‌డ చెన్న‌య్ కి చెందిన ప్ర‌తిష్ఠాత్మ‌క ఏవీఎం స్టూడియోస్‌, న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ స్టూడియోలు నిర్మించేందుకు సుముఖంగా ఉన్నారు. వీరికి భూములు కేటాయింపు ఉంటుంద‌ని ఎఫ్‌డీసీ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇది సీఎం చంద్ర‌బాబు ఆజ్ఞల ప్ర‌కారం, ఎఫ్‌డీసీ అధ్య‌క్షుడు అంబికా కృష్ణ చేసిన ప్ర‌క‌ట‌న‌.

ఇదే విష‌యాన్ని నేడు ఏపీ ఫిలింఛాంబ‌ర్‌లో జ‌రిగిన ఓ స‌మావేశంలో ఎంపీ ముర‌ళిమోహ‌న్‌ని ప్ర‌శ్నిస్తే.. ప‌రిశ్ర‌మ త‌ర‌లింపు అని దీనిని అన‌లేను కానీ, ఓ కొత్త సినీప‌రిశ్ర‌మ ఏర్పాటు మాత్రం జ‌రుగుతుంది. ఆ మేర‌కు ప్ర‌భుత్వం స‌న్నాహ‌కాల్లో ఉంది. కానీ దీనిపై నాకు పూర్తి అవ‌గాహ‌న లేదు… అంటూ అస‌లు విష‌యం చెప్ప‌కుండా దాట‌వేశారు. వైజాగ్‌లోనే ప‌రిశ్ర‌మ నెల‌కొల్పుతారా? అన్న ప్ర‌శ్న‌కు.. ప‌రిశ్ర‌మ ఏర్పాటున‌కు ఎమినీటీస్ ముఖ్యం.. క్యాపిట‌ల్ సిటీ అమ‌రావ‌తిలోనే అయితే బావుంటుంద‌ని భావిస్తున్నార‌ని ఓ అసంపూర్ణ‌మైన స‌మాధానం ఇచ్చారు. మ‌రోవైపు వైజాగ్, అర‌కులో వాతావ‌ర‌ణం ఎంతో చ‌ల్ల‌గా ఉంటుంది. విజ‌య‌వాడ‌-అమరావ‌తితో పోలిస్తే బావుంటుంది. అందుకే ప‌రిశ్ర‌మ‌ను అక్క‌డ ఏర్పాటు చేయాల‌ని అనుకున్నారు.. అంటూ ముర‌ళి మోహ‌న్ నాన్ క్లారిటీ ఆన్స‌ర్ ఇవ్వ‌డం క్లారిటీ మిస్స‌య్యేలా చేసింది. దీన‌ర్థం ఇప్ప‌టికీ కొత్త పిలింఇండ‌స్ట్రీ ఏర్పాటు అమ‌రావ‌తిలోనా.. ? లేక విశాఖ న‌గ‌రంలోనా? అన్న దానిపై ఏపీ ప్ర‌భుత్వానికే పెద్దంత‌గా క్లారిటీ లేద‌ని అర్థ‌మ‌వుతోంది. లేదూ కొత్త ప‌రిశ్ర‌మ ఏర్పాటు గురించి కీల‌క‌మైన స‌మాచారాన్ని రివీల్ చేయ‌కుండా దాచేస్తున్నారా? అన్న‌ది అర్థం కాని గంద‌ర‌గోళం నెల‌కొంది. అస‌లింత‌కీ ప‌రిశ్ర‌మ వైజాగ్‌లోనా? లేక అమ‌రావ‌తిలోనా? అన్న‌ది తేలాల్సి ఉందింకా. అలాగే హైద‌రాబాద్ నుంచి ఒకేసారి ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ త‌ర‌లింపు అన్న‌ది క‌ష్ట‌మైన‌ది. పెద్ద పెద్ద వాళ్ల‌కు సులువే అయినా, చిన్న వాళ్లు కొత్త కార్యాల‌యాల‌కు, అద్దెల‌కు భారంగా మారుతుంద‌ని ముర‌ళీమోహ‌న్ అన్నారు. అంటే ప‌రిశ్ర‌మ ద‌ప‌ద‌ఫాలుగా క‌దిలేందుకు ఆస్కారం ఉంద‌ని అస్ప‌ష్ట‌మైన స‌మాధానం ఇచ్చారాయ‌న‌.