చిరుకి కొత్త తలనొప్పి

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `ఆచార్య`కి ఆది నుంచీ సమస్యలే. ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికే బోలెడంత సమయం పట్టింది. కొరటాల ఎప్పట్నుంచో కథకి మెరుగులు దిద్దుతూ ఉన్నాడు. కథానాయిక ఎంపిక గురించైతే ఓ పెద్ద ప్రయత్నమే చేశారు. చాలా మందిని పరిశీలించాక ఆఖరికి త్రిషని ఎంపిక చేసుకుని బండిని ముందుకు నడిపించారు. ఇంతలోనే ఇందులోకీలక పాత్ర పోషించాల్సిన చరణ్ నుంచి సమస్య వచ్చిపడింది. ఆయన నటిస్తున్న `ఆర్.ఆర్.ఆర్` పూర్తి కాకపోవడంతో మరో కథానాయకుడిని వెదికి పట్టుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది.

మహేష్‌తో మంతనాలు జరుపుతున్నారు. అవి కొలిక్కి రాకముందే త్రిష సినిమా నుంచి తప్పుకున్నట్టు ప్రకటించింది. దాంతో గోరు చుట్టుపై రోకటి పోటులా మారింది వ్యవహారం. ఇప్పుడు చిరు సరసన నటించే ఆ కథానాయిక ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇన్ని తలనొప్పులతో సతమతమవుతున్న ఈ సినిమా గురించి ఇటీవలే ఓ గుడ్ న్యూస్ వినిపించింది. మహేష్ ఈప్రాజెక్టులోకి ఎంటర్ అవుతున్నాడనే ప్రచారంతో సినిమా బిజినెస్ స్థాయి పెరిగిందనేది ఆ న్యూస్. ఆ గుడ్ న్యూస్‌కి సంబంధించిన ఆశలు ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. త్రిష తప్పుకోవడంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్టైంది.