సావిత్రిని కాను.. సూర్యకాంతాన్ని!!

మెగా ప్రిన్సెస్ నీహారిక కొణిదెల నాయికగా, రాహుల్ విజయ్ హీరోగా ప్రణీత్ బ్రామ్మడపల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సూర్యకాంతం’. మార్చి 29న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ మీడియాతో నీహారిక ముచ్చట్లు ఇవి..

‘సూర్యకాంతం’ అంటే? సినిమాకి ఆ పేరే ఎందుకు?
సినిమాలో నా పాత్ర పేరు ‘సూర్యకాంతం’. త‌న‌ గురించే చెబుతున్నాం కాబట్టి ఆ టైటిల్ పెట్టారు. సింపుల్ ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. అభి సూర్యకాంతం జర్నీ, డ్రామా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.

కాంతం గురించి?
ఎలాంటి బాధ భయం లేకుండా అలాగే ఎలాంటి దీర్ఘకాల లక్ష్యాలు లేకుండా.. ప్రతిక్షణాన్ని సంతోషంగా గడపటానికి ఇష్టపడే అమ్మాయే సూర్యకాంతం. తను స్వతంత్రంగా బతికే అమ్మాయి.

ముక్కోణపు ప్రేమకథా?
ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమీ కాదు గానీ, కథలో భాగంగా ఒక అబ్బాయి జీవితంలో ప్రవేశించిన ఇద్దరు అమ్మాయిలకు సంబంధించి కొంతభాగం ఉంటుంది. మూడు పాత్రల మధ్య వచ్చే డ్రామాకి బాగుంటుంది.

హీరో రాహుల్ గురించి?
రాహుల్ మంచి నటుడు. సౌకర్యవంతమైన సహ నటుడు. చ‌క్కని సహకారం అందిస్తాడు. చాలా కష్టపడతాడు. అతని కష్టం తెర మీద కనిపిస్తుంది.

‘సైరా’లో మీ పాత్ర?
సైరా గురించి ఇప్పుడు నేను చెప్పలేను. నాకు డైలాగులు ఉండవు. ఒకట్రెండు సీన్లలో కనిపిస్తా. కానీ తప్పకుండా గుర్తింపు దక్కుతుంది. నా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది.

సూర్యకాంతం అనే టైటిల్ కార‌ణం?
నేను మా నాన్న కలిసి ‘నాన్నకూచి’ అని ఓ వెబ్ సీరీస్ చేశాం. అందులో మా నాన్న నా గురించి ఆయన గర్ల్ ఫ్రెండ్‌కి వివరించే సీన్ ఉంటుంది. `మా అమ్మాయి సావిత్రి టైపు` అని ఆయనకు డైలాగ్ రాశారు. కానీ మా నాన్న “మా అమ్మాయి సూర్యకాంతం” అని అన్నారు. ఆ సమయంలో నేను, మా దర్శకుడు ప్రణీత్ కూడా అక్కడే ఉన్నాం. ఒకవేళ ప్రణీత్ ఆ అదే గుర్తు పెట్టుకున్నాడేమో!

సీనియర్ నటి సుహాసినితో అనుభవం?
సీనియర్లతో అంటే కాసేపు మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవాలనిపిస్తుంది నాకు. కానీ సుహాసిని బాగా కలిసిపోయారు. తను మణిరత్నంగారి గురించి చెప్పిన విషయాలు నన్ను కట్టిపడేశాయి. మా నాన్న తో ఆవిడ సినిమాలు చేశారట. ఆ విషయాలు చాలా బాగా చెప్పారు. మా అమ్మ కూడా సెట్స్‌కి వచ్చి తనను కలిశారు. నేను పుట్టకముందు విషయాలను వాళ్లు చాలానే మాట్లాడుకున్నారు.

మీ సినిమాలు సరిగా ఆడలేదనే బాధ?
సినిమా ఆడితే ఎగిరి గంతేసి, ఆడకపోతే విసుక్కునే రకాన్ని కాను. నా పనిని నేను సంపూర్ణంగా చేశానా లేదా అనేది కీలకం. మ‌న‌సు పెట్టి చేస్తాను. రెండు సినిమాల్లోనూ “నీహారిక బాగా చేయలేదు” అని ఎవరూ చెప్పలేదు. కనీసం నా వరకు రాలేదు. చిరంజీవి డాడీ నా స్ఫూర్తి. డూపులు కూడా లేకుండా ఆయన ఫైట్లు చేసి ఇంటికి వచ్చినప్పుడు సురేఖా మమ్మీ పడ్డ బాధ ఎలా ఉండేదో నాకు తెలుసు. అయినా కొన్ని సినిమాలు ఆడలేదు. ఫ్లాప్‌లకు ఎన్నో కారణాలు ఉంటాయి.

ఫిలిం మేకింగ్ బాగా ఇష్టమా?
అవును. నాన్న‌, అరవింద్ మామ మేకింగ్ చేస్తుంటే చూస్తూ పెరిగా. నేను ఏ విషయాలను గాలికి వదిలేయను. మేకింగ్ ప‌రంగా ఏదీ అంత‌ తేలిగ్గా అవతలివారిని నమ్మి వదిలేయను. అన్నిటినీ దగ్గరుండి చూసుకుంటాను. చక్కని ప్రణాళిక ఉంటుంది. అవన్నీ నాకు నిర్మాణానికి ఉపయోగపడుతున్నాయి. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యాన‌ర్ లో 100 ఎపిసోడ్ల‌తో ఓ కొత్త‌ వెబ్ సిరీస్ తీస్తున్నా.

పెళ్లెప్పుడు?
అమ్మ 30 వరకు చేసుకోవా అని చీవాట్లు పెట్టింది. ప్రస్తుతం నా దృష్టి నటనపైనే… కానీ 30లోపు పెళ్లాడేస్తాను.

నటనను సీరియస్‌గానే!?
– న‌టించాల‌నుకున్న‌ప్పుడే సీరియ‌స్ గా తీసుకున్న నిర్ణ‌యం. రావాలనుకున్నప్పుడు మా కుటుంబాన్ని ఇష్టపడే అభిమానులు అభ్యంతరం చెప్పారు. కానీ నా మనసులో ఉన్న విషయాన్ని క్లియర్‌గా చెప్పే సరికి అర్థం చేసుకున్నారు. ఊహించుకున్న‌వ‌న్నీ మానుకున్నారు.

‘కర్తవ్యం’ తరహా సినిమాలు చేయొచ్చు కదా?
– కోడి రామకృష్ణగారు బతికున్నప్పుడు అన్నారు.. ప‌రుచూరి వారు అలాంటి సినిమాలు చేయ‌మ‌ని అడిగారు. ‘సూర్యకాంతం’ విడుదలైన తర్వాత నన్ను దృష్టి లో పెట్టుకుని మరికొన్ని రకాల పాత్రలు రాసేవాళ్ల సంఖ్య పెరుగుతారేమో!

*రాజకీయాల్లో మీ వాళ్లని తిడుతుంటే హర్టవ్వరా?
-చాలా వరకు అలాంటి వీడియోల్ని అవాయిడ్ చేస్తాను. అయినా మనల్ని మనం ఆ స్థాయిలో పెట్టినప్పుడు ఎవరు ఏమన్నా వినడానికి సిద్ధంగా ఉండాలి. కాకపోతే నేను నన్ను ఎవరైనా ఏమైనా అన్నా వింటేనేమో కానీ, వాళ్లని ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేను.

Also Watch : Biscuit Song Promo-Suryakantam