అయ్యో నిఖిల్.. ఇలా చేస్తే వాళ్ళ గ‌తేంటి..?

అదేంటి.. నిఖిల్ ఏం చేసాడు..? ఈయ‌న చేసిన ప‌ని వ‌ల్ల ఎవ‌రి గ‌తి ఏమైంది అనుకుంటున్నారా..? అస‌లే తెలుగు ఇండ‌స్ట్రీలో కొత్త క‌థ‌లు రావ‌ట్లేద‌నే టాక్ ఉంది. ఇప్పుడు ఉన్న ఇండ‌స్ట్రీలో కాస్తోకూస్తో కొత్త క‌థ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ ఎవ‌రంటే క‌చ్చితంగా మ‌రో ఆలోచ‌న లేకుండా నిఖిల్ పేరే చెబుతారు. కొన్నేళ్లుగా ఈయ‌న చేస్తోన్న సినిమాలు అలాంటివి. క‌థ న‌చ్చితే ట్రాక్ రికార్డ్ తో ప‌నిలేకుండా సినిమా చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఈ మ‌ధ్యే కేశ‌వ‌తో మ‌రో హిట్ కొట్టాడు నిఖిల్. ఈ సినిమా కూడా కొత్త‌గానే ఉంది. ఇప్పుడిప్పుడే నిఖిల్ ను దృష్టిలో పెట్టుకుని క‌థ‌లు రాస్తోన్న ద‌ర్శ‌కుల‌కు షాకిస్తున్నాడు ఈ కుర్రాడు. కేశ‌వ త‌ర్వాత నిఖిల్ క‌మిటైన రెండు సినిమాలు రీమేక్ లే. క‌న్న‌డ‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన కిర్రాక్ పార్టీ రీమేక్ లో న‌టించ‌డానికి ఓకే చెప్పేసాడు నిఖిల్.

ఈ సినిమాను శ‌ర‌ణ్ కొప్పిశెట్టి అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌నున్నాడు. దీనికి మాట‌లు చందూ మొండేటి.. స్క్రీన్ ప్లే సుధీర్ వ‌ర్మ అందిస్తుండ‌టం విశేషం. ఇద్ద‌రూ స‌క్సెస్ ఫుల్ ద‌ర్శ‌కులుగా ఉన్నా కూడా స్నేహితుడి కోసం తామే ఓ మెట్టు దిగుతున్నారు. ఇక ఇప్పుడు మ‌రో రీమేక్ కు కూడా ఓకే చెప్పాడు ఈ హీరో. త‌మిళ హిట్ క‌ణిత‌న్ రీమేక్ లోనూ నిఖిల్ న‌టించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఇది ఫేక్ స‌ర్టిఫికేట్ల చుట్టూ సాగే థ్రిల్ల‌ర్. ర‌వితేజ‌తో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాల‌ని భావించాడు ద‌ర్శ‌కుడు సంతోష్. అయితే నిఖిల్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల‌తో పాటు దిల్ రాజు నిర్మాణంలో కార్తికేయ 2 చేయ‌డానికి ఫిక్స‌య్యాడు నిఖిల్. ఇలా వ‌ర‌స సినిమాల‌తో దున్నేస్తున్నాడు నిఖిల్. కానీ కొత్త క‌థ‌ల వైపు అడుగేస్తోన్న కుర్ర హీరో కూడా ఇలా రీమేక్ ల‌ను ఎంచుకోవ‌డ‌మే ఇక్క‌డి ద‌ర్శ‌కుల‌కు కొంచెం మింగుడు ప‌డ‌టం లేదు.