అర్జున్ సుర‌వ‌రం.. నిఖిల్ బిగ్‌ ఛాలెంజ్‌

Last Updated on by

వెర్స‌టైల్ స్టార్ గా నిఖిల్ ప్ర‌యోగాల గురించి తెలిసిందే. ఎంచుకునే క‌థ ద‌గ్గ‌ర నుంచే అత‌డు కొత్త‌గా వెళ్ల‌డం అత‌డికి మాత్ర‌మే చెల్లిన స్టైల్. ఇమేజ్ గోల లేని హీరో. కొత్త క‌థ‌ల‌కు, న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలిచ్చి ప్రోత్స‌హించ‌డంలోనూ అత‌డు ముందు వ‌రుస‌లో ఉంటాడు. ప్ర‌యోగాల‌కు అత‌డు ఏమాత్రం వెర‌వ‌డు. అందుకే కెరీర్ లో న‌టించిన కొద్ది సినిమాలతోనే అత‌డిలో వైవిధ్యం తెలుగు ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మైంది.

నిఖిల్ కొంత గ్యాప్ త‌ర్వాత కొన్ని ప‌రాజ‌యాల త‌ర్వాత ఎంతో జాగ్ర‌త్త‌గా మ‌రో కొత్త‌ద‌నం నిండిన సినిమాతో అభిమానుల ముందుకు వ‌స్తున్నాడు. అర్జున్ సుర‌వరం అనే టైటిల్ తోనే మ్యాజిక్ చేశాడు. టైటిల్ ఇప్ప‌టికే జ‌నంలోకి దూసుకెళ్లింది. తొలుత ఇదేం టైటిల్ అన్న‌వాళ్లే ఇదే గొప్ప టైటిల్ అంటూ పొగిడేసేంత‌గా దూసుకెళ్లింది. ఈ చిత్రంలో నిఖిల్ ఓ జ‌ర్న‌లిస్టు పాత్ర‌లో న‌టించ‌డం ఆస‌క్తిక‌రం. మార్చి 29న ఈ చిత్రం రిలీజ‌వుతోంది. టి.ఎన్‌.సంతోష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వెన్నెల‌కిషోర్, పోసాని, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య త‌దిత‌రులు న‌టించారు. ఇక ఈ సినిమా పై ట్రేడ్ లోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాలు స‌హా ఓవ‌ర్సీస్ లోనూ భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని స‌మాచారం. ఓవ‌ర్సీస్ లో కంట్రీ సైడ్ పిక్చ‌ర్స్ సంస్థ అర్జున్ సుర‌వ‌రం రిలీజ్ హ‌క్కుల్ని చేజిక్కించుకుంది. దాదాపు 115 లొకేష‌న్ల‌లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఏపీ, నైజాం, సీడెడ్, ఉత్త‌రాంధ్ర‌లోనూ ఈ చిత్రాన్ని భారీగానే రిలీజ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్ ముద్ర వివాదం గురించి తెలిసిందే. ఆ టైటిల్ వేరొక బ్యాన‌ర్ లో రిజిష్ట‌ర్ చేయ‌డంతో ఆ త‌ర్వాత అర్జున్ సుర‌వ‌రం గా మార్చారు. నిఖిల్ కెరీర్ లో బిగ్ ఛాలెంజింగ్ మూవీ ఇద‌ని చెప్పొచ్చు. ఈ సినిమా విజ‌యంపై అత‌డు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు.