కిరాక్ పార్టీ.. కాక మీదున్నారు..!

Last Updated on by

కిరాక్ పార్టీ.. కొన్ని రోజులుగా తెలుగు ఇండ‌స్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. దానికి కార‌ణం ఈ చిత్రం క‌న్న‌డ‌లో ఏడాది పాటు ఆడ‌ట‌మే. ఈ రోజుల్లో ఓ సినిమా రెండు వారాలు ఆడ‌ట‌మే క‌ష్టం అనుకుంటే.. ఈ చిత్రం మాత్రం ఏకంగా 365 రోజులు ఆడేసింది. అంత‌గా ఈ చిత్రంలో ఏముందో తెలియ‌దు కానీ అందుకే ఇత‌ర ఇండ‌స్ట్రీలు కూడా కిరాక్ పార్టీపై క‌న్నేసాయి. ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో రీమేక్ అవుతుంది. కిరాక్ పార్టీ రీమేక్ లో నిఖిల్ న‌టిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. కాలేజ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో సాధార‌ణంగానే హ్యాపీడేస్ గుర్తొస్తుంది. అదే చిలిపి గొడ‌వ‌లు.. స్నేహాలు.. ప్రేమ‌లు అన్నీ ఈ ట్రైల‌ర్ లోనూ క‌నిపిస్తున్నాయి.

గ‌డ్డంతో ఉన్న నిఖిల్ లుక్ కూడా సినిమాపై అంచ‌నాలు పెంచేస్తుంది. ట్రైల‌ర్ లో క‌మింగ్ సూన్ అని వేసారు కానీ రిలీజ్ డేట్ మాత్రం చెప్ప‌లేదు. ఫిబ్ర‌వ‌రి 9న సినిమా వ‌స్తుంద‌ని ఇదివ‌ర‌కే చెప్పినా.. అదే రోజు మ‌రో మూడు సినిమాలు వ‌స్తుండ‌టంతో వెన‌క్కి త‌గ్గారేమో అనే అనుమానం వ‌స్తుంది. కిరాక్ పార్టీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు కొత్త కుర్రాడు శ‌ర‌ణ్ కొప్పిశెట్టి. ఈ చిత్రానికి డైలాగులు చందూ మొండేటి రాయ‌గా.. స్క్రీన్ ప్లే బాధ్య‌త‌ను సుధీర్ వ‌ర్మ తీసుకున్నాడు.

ఈ ఇద్ద‌రూ స‌క్సెస్ ఫుల్ ద‌ర్శ‌కులు అయి ఉండి కూడా నిఖిల్ కోసం త‌మ స్థాయి త‌గ్గించుకున్నారు. వీళ్లిద్ద‌రి నుంచి ఔట్ పుట్ తీసుకుని కిరాక్ పార్టీ తెర‌కెక్కించాడు శ‌ర‌ణ్. ఈ సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. బిజినెస్ కూడా 20 కోట్ల వ‌ర‌కు జ‌రుగుతుంది. పైగా ఇప్పుడు నిఖిల్ కూడా సూప‌ర్ ఫామ్ ఉన్నాడు. సంయుక్తా హెగ్డే, సిమ్రాన్ ప‌రీంజా ఇందులో హీరోయిన్లుగా న‌టించారు. ఈ చిత్రం క‌చ్చితంగా మ‌రో హ్యాపీడేస్ రేంజ్ లో హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాడు నిఖిల్. చూడాలిక‌.. కిరాక్ కుర్రాళ్లు ఎంత మాయ చేయ‌బోతున్నారో..?

User Comments