మ‌న కొండ‌కి బంగారుకొండ దొరికాడు

క‌న్న‌డ‌తో పాటు తెలుగులోనూ పాగా వేయాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు నిఖిల్ కుమార్ గౌడ‌. క‌ర్ణాట‌క మాజీ ముఖ్యమంత్రి కుమార‌స్వామి గౌడ కుమారుడే ఈ నిఖిల్‌. తెలుగులో `జాగ్వార్‌`తో ప‌రిచ‌య‌మ్యాడు. ఈయ‌న సినిమా అంటే ఒక రేంజ్‌లో ఉంటుంది. ఖ‌ర్చుకు ఏమాత్రం ఆలోచించ‌రు. `జాగ్వార్‌` చిత్రంతోనే ఆ విష‌యం రుజువైంది. కుమార‌స్వామి వెన‌క ఉంటూ త‌న త‌న‌యుడి సినిమాని ముందుకు న‌డిపిస్తుంటాడు.

భారీస్థాయిలో సినిమాలు తీయాల‌నుకునే ద‌ర్శ‌కుల‌కీ, సాంకేతిక నిపుణుల‌కి నిఖిల్ కుమార్ గౌడ ఒక బంగారు కొండే అని చెప్పొచ్చు. కోరినంత బ‌డ్జెట్ చేతిలో ఉంటుంది కాబ‌ట్టి ద‌ర్శ‌కులు తాము చేయాల‌నుకున్న‌దంతా చేయొచ్చ‌న్న‌మాట‌. జాగ్వార్ త‌ర్వాత మ‌రో ద్విభాషా చిత్రానికి శ్రీకారం చుట్టాడు నిఖిల్‌. ఈసారి ఆయ‌న చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించేది ఎవ‌రో కాదు… మ‌న విజ‌య్ కుమార్ కొండా. `గుండెజారి గ‌ల్లంతయ్యిందే`, `ఒక లైలా కోసం` చేసిన ద‌ర్శ‌కుడే ఈ కొండా. ప్ర‌స్తుతం `ఒరేయ్ బుజ్జిగా` అనే సినిమా చేస్తున్నాడు. అన్న‌ట్టు నిఖిల్ గ‌త చిత్రం `జాగ్వార్‌` తీసింది కూడా తెలుగు ద‌ర్శ‌కుడే. ఈసారి నిఖిల్ బాస్కెట్ బాల్ ప్లేయ‌ర్‌గా తెర‌పై క‌నిపించబోతున్నాడ‌ట‌. కొంచెం గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ రంగంలోకి దిగిన విజ‌య్ కుమార్ కొండా ఇక‌పై వ‌రుస‌గా సినిమాలు చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌న్న‌మాట‌.