నిఖిల్ తో మరో పెళ్లిచూపులుకు రెడీ..!

టాలీవుడ్ లో ఏడాది క్రితం సంచలనం సృష్టించిన చిన్న సినిమా ‘పెళ్లిచూపులు’ గురించి ఇప్పుడు ఎంత పెద్దగా చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అంతలా మార్క్ సెట్ చేసిన పెళ్లిచూపులు తెలుగులో చిన్న సినిమాలకు ఊపిరి పోయడమే కాకుండా ఓ కొత్తదారిని చూపించిందనే అనాలి.

అటువంటి సినిమాను తెరకెక్కించిన యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ తన తొలి ప్రయత్నంలోనే ఇలా టాలీవుడ్ లో చెరగని ముద్ర వేయడం విశేషం అనే అనాలి. అయితే, ఇంత పెద్ద ట్రెండ్ సెట్టింగ్ హిట్ సినిమాను తీశాక ఏ దర్శకుడికైనా అవకాశాలు వచ్చిపడటమే కాకుండా క్రేజీ కాంబినేషన్ లు సెట్ అవుతూ ఉంటాయి.

దాంతో వెంటనే తమ రెండో సినిమాను అనౌన్స్ చేసేసే అవకాశాలు కనిపిస్తాయి. కానీ తరుణ్ భాస్కర్ మాత్రం భిన్నంగా పెళ్లిచూపులు వచ్చి ఏడాది  దాటిపోయినా తన కొత్త సినిమాను సెట్ చేయకపోవడం గమనార్హం.

ఈ విషయంలో మొదట పెళ్లిచూపులు సినిమాను రిలీజ్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్ బేనర్ కు తరుణ్ భాస్కర్ తన రెండో సినిమాను చేసేలా కమిట్మెంట్ ఇవ్వడం ఓ కారణం అయితే.. స్క్రిప్ట్ విషయంలో ఈ యువ దర్శకుడు ఎంత ఆలస్యమైనా పక్కాగా ఉండాలనుకునే టైపు కావడం కూడా ఓ కారణం అని తెలుస్తోంది.

 అంతేకాకుండా ఈ మధ్య విక్టరీ వెంకటేష్ తో ఓ ప్రాజెక్టును సెట్ చేసేలా తరుణ్ భాస్కర్ రెడీ అయితే, ఎందుకో అది మెటీరియలైజ్ కాకపోవడం కూడా ఓ కారణం అని సమాచారం.

ఇక ఇప్పుడేమో ఎట్టకేలకు తన స్క్రిప్ట్ ను పక్కాగా పూర్తి చేసి ఓ యంగ్ టాలెంటెడ్ హీరోతో సినిమాను పట్టాలెక్కించడానికి తరుణ్ భాస్కర్ సిద్ధంగా ఉన్నాడని తెలియడం విశేషం.

ఆ స్టోరీలోకి వెళితే, గత ఆరు నెలలుగా తన కొత్త సినిమా స్క్రిప్ట్ మీద కూర్చున్న తరుణ్ భాస్కర్ చివరకు దానిని పూర్తి చేసి.. తాజాగా యంగ్ టాలెంటెడ్ నిఖిల్ కు వినిపించడమే కాకుండా ఓకే కూడా చేయించేసుకున్నాడట.

దీంతో ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళే నిఖిల్ తో మరో పెళ్లిచూపులు లాంటి హిట్ సినిమాకు రెడీ అయిపోతున్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో నిఖిల్ కూడా ఓ పెద్ద బ్యానర్ లో సినిమా కమిట్ అయ్యానని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తానని చెప్పడం కూడా ఈ ప్రాజెక్టుపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

 మరి ఇదే నిజమై, నిఖిల్ – తరుణ్ భాస్కర్ లాంటి టాలెంటెడ్ కాంబినేషన్లో సురేష్ ప్రొడక్షన్స్ సినిమా అంటే.. అది నిజంగా స్పెషల్ అవుతుందనే అనాలి.

Follow US