కుర్రాళ్లు కుమ్మేసారుగా..!

కిరాక్ పార్టీ.. కొన్ని రోజులుగా తెలుగు ఇండ‌స్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. దానికి కార‌ణం ఈ చిత్రం క‌న్న‌డ‌లో ఏడాది పాటు ఆడ‌ట‌మే. ఈ రోజుల్లో ఓ సినిమా రెండు వారాలు ఆడ‌ట‌మే క‌ష్టం అనుకుంటే.. ఈ చిత్రం మాత్రం ఏకంగా 365 రోజులు ఆడేసింది. అంత‌గా ఈ చిత్రంలో ఏముందో తెలియ‌దు కానీ అందుకే ఇత‌ర ఇండ‌స్ట్రీలు కూడా కిరాక్ పార్టీపై క‌న్నేసాయి. ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో రీమేక్ అవుతుంది. కిరాక్ పార్టీ రీమేక్ లో నిఖిల్ న‌టిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. కాలేజ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో సాధార‌ణంగానే హ్యాపీడేస్ గుర్తుకు వ‌స్తుంది. దాంతో పాటు బోన‌స్ గా శివ కూడా ఉంది ఈ చిత్రంలో. సాక్షాత్తు హీరో నిఖిలే చెప్పాడు ఈ చిత్రంలో శివ‌తో పాటు హ్యాపీడేస్ కూడా ఉంటాయ‌ని. ఈ రెండు సినిమాల స్పూర్థితోనే కిరాక్ పార్టీ రెడీ అయింది. ట్రైల‌ర్ లో కామెడీకే పెద్ద‌పీట వేసాడు ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా ఎండ్ షాట్ లో చిన్న‌పిల్ల‌లం క‌దా హాస్ట‌ల్ లో బ‌య‌టికి పంప‌రంటూ సిగ‌రెట్ పఫ్ తాగే సీన్ హైలైట్ గా నిలిచింది.

అదే చిలిపి గొడ‌వ‌లు.. స్నేహాలు.. ప్రేమ‌లు అన్నీ ఈ ట్రైల‌ర్ లోనూ క‌నిపిస్తున్నాయి. గ‌డ్డంతో ఉన్న నిఖిల్ లుక్ కూడా సినిమాపై అంచ‌నాలు పెంచేస్తుంది. మార్చ్ 16న సినిమా విడుద‌ల కానుంది. కిరాక్ పార్టీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు కొత్త కుర్రాడు శ‌ర‌ణ్ కొప్పిశెట్టి. ఈ చిత్రానికి డైలాగులు చందూ మొండేటి రాయ‌గా.. స్క్రీన్ ప్లే బాధ్య‌త‌ను సుధీర్ వ‌ర్మ తీసుకున్నాడు. ఈ ఇద్ద‌రూ స‌క్సెస్ ఫుల్ ద‌ర్శ‌కులు అయి ఉండి కూడా నిఖిల్ కోసం త‌మ స్థాయి త‌గ్గించుకున్నారు. వీళ్లిద్ద‌రి నుంచి ఔట్ పుట్ తీసుకుని కిరాక్ పార్టీ తెర‌కెక్కించాడు శ‌ర‌ణ్. దీనిపై అంచ‌నాలు భారీ గానే ఉన్నాయి. బిజినెస్ కూడా 15 కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. పైగా ఇప్పుడు నిఖిల్ కూడా సూప‌ర్ ఫామ్ ఉన్నాడు. సంయుక్తా హెగ్డే, సిమ్రాన్ ప‌రీంజా ఇందులో హీరోయిన్లుగా న‌టించారు. ఈ చిత్రం ఖచ్చితంగా మ‌రో హ్యాపీడేస్ రేంజ్ లో హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాడు నిఖిల్. చూడాలిక‌.. కిరాక్ కుర్రాళ్లు ఎంత మాయ చేయ‌బోతున్నారో..?