కాబోయే భార్య ఆరోప్రాణం అన్న నితిన్‌

Nithin opened up about his happening wife

కాబోయే భార్య షాలినికి త‌న హృద‌యంలో ఎలాంటి స్థానాన్నిచ్చాడో బ‌య‌టికి చెప్పుకొచ్చాడు నితిన్‌. త‌ను నా ఆరోప్రాణం అన్నాడు. త‌న పంచ ప్రాణాల గురించి కూడా చెప్పుకొచ్చాడు. అమ్మా, నాన్న‌, అక్క ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ నాకు పంచ ప్రాణాల్లాంటివాళ్ల‌ని అన్నాడు. భీష్మ వేడుక‌లో ఆయ‌న త‌న స‌న్నిహితుల గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశాడు. ర‌ష్మిక బెస్ట్ ఫ్రెండ్ అని చెప్ప‌క‌నే చెప్పాడు. `నువ్వు న‌న్ను భ‌రించాలి, నేను నిన్ను భ‌రించాలి. మ‌నిద్ద‌రినీ నాకు కాబోయే భార్య భ‌రించాలి` అంటూ త‌నకీ ర‌ష్మిక‌కీ మ‌ధ్య‌నున్న క్లోజ్‌నెస్ గురించి బ‌హిరంగంగా చెప్పుకొచ్చాడు నితిన్‌. నితిన్‌కి వాళ్ల అన్న‌య్య ప‌వ‌న్ క‌ళ్యాణ్ అండ‌దండ‌లు ఎప్పుడూ ఉంటాయ‌ని త్రివిక్ర‌మ్ ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చారు. భీష్మ సినిమా స్వ‌త‌హాగా నాకు చాలా బాగా న‌చ్చింద‌ని, అంద‌రికీ న‌చ్చుతుంద‌ని సర్టిఫికెట్ ఇచ్చాడు త్రివిక్ర‌మ్. దిల్‌రాజు కూడా అదే విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇద్ద‌రు అగ్ర ద‌ర్శకనిర్మాత‌లు సినిమాని అంత‌గా స‌ర్టిఫై చేశాక ఇక నితిన్ అభిమానుల‌కి సందేహం ఏముంటుంది? అందుకే హిట్టు గ్యారెంటీ అని ప‌క్కాగా ఫిక్స్ అయిపోతున్నారు. మ‌రి రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే 21 వ‌ర‌కు ఆగాల్సిందే.