ప్ర‌చారం లేని టిక్ టిక్ టిక్‌

Last Updated on by

సినిమాకి మంచి రిలీజ్ ఎంత ముఖ్య‌మో, మంచి ప్ర‌చారం అంతే ముఖ్యం. ఆ రెండిటిలో ఏది లేక‌పోయినా ఫ‌లితం శంక‌ర‌మాన్యాలు ప‌ట్టేస్తున్న వైనం చూస్తూనే ఉన్నాం. మా సినిమా రిలీజైంది అని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్రేక్ష‌కుల‌కు తెలియ‌జెప్పాలి. దానికోసం కొంత ఖ‌ర్చు చేయాలి. ఏదో తీశాంలే, కొన్నాంలే, రిలీజ్ చేశాంలే అంటే కుద‌ర‌దిక్క‌డ‌. బ‌డ్జెట్ స‌హ‌క‌రించ‌లేదు అంటే అంత‌కుముందు పెట్టింది కూడా లాస‌వ్వాల్సిందే. అయితే `టిక్ టిక్ టిక్‌` తెలుగు నిర్మాత‌లు ఏమ‌నుకున్నారో అస‌లు క‌నీసం రిలీజ్ ముందు ఇదిగో రిలీజ్ చేస్తున్నాం అన్న ప్ర‌చార‌మైనా చేసిన‌ట్టు లేదు. దీంతో ఈ సినిమా వ‌స్తోంది అన్న సంగ‌తి ఇటు తెలుగు మీడియాకి కూడా పూర్తిగా తెలియ‌లేదు. ఇక‌పోతే ఇటీవ‌లి కాలంలో పూర్తిగా సోష‌ల్ మీడియా ప్ర‌చారంపై డిపెండ్ అయ్యి, కొన్ని సినిమాల‌కు అస‌లు ప్ర‌చార‌మే వ‌ద్దనుకుంటున్న బాప‌తు క‌నిపించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

జ‌యం ర‌వి లాంటి స్టార్ హీరో ఎన్నో రిస్కులు చేసి శ్ర‌మించి న‌టించిన `టిక్ టిక్ టిక్‌` తెలుగులో రిలీజై మంచి సినిమానే అన్న టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కోసం ద‌ర్శ‌కుడు శ‌క్తి సౌంద‌ర‌రాజ‌న్ ఎంత‌గా శ్ర‌మించి ఉంటారో తెర‌పై చూస్తేనే అర్థ‌మైంది. మ‌రోవైపు జ‌బ‌క్ బ్ర‌ద‌ర్స్ ఈ సినిమాని ప్రాణంగా ప్రేమించి ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు ఓర్చి, ఫైనాన్సులు తెచ్చి, అవ‌మానాలు భ‌రించి తీసిన ఈ సినిమాని త‌మిళంలో బాగానే ప్ర‌మోట్ చేస్తున్నా, ఎందుక‌నో తెలుగు వెర్ష‌న్ వ‌ర‌కూ లైట్ తీస్కున్నార‌నే అనిపించింది అంద‌రికీ. ఇక్క‌డ బిచ్చ‌గాడు చిత్రాన్ని రిలీజ్ చేసిన నిర్మాత‌ల చేతిలో పెట్టామ‌ని భావించి ఉండొచ్చు. అయితే స‌ద‌రు నిర్మాత‌లు ఈ సినిమాలో కంటెంట్ లేద‌ని భావించారో, లేక అస‌లు ఎందుకులే అన‌వ‌స‌ర ఖ‌ర్చు అని భావించారో కానీ అస్స‌లు న‌యా పైసా ప్ర‌చారంపై పెట్టిన‌ట్టే క‌నిపించ‌లేదు. జ‌యం ర‌వి లాంటి స్టార్ హీరో తెలుగులో అంద‌రికీ ప‌రిచ‌యం కావ‌డానికి ఈ సినిమా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డేదే. కానీ ఆ ఛాన్స్‌ని గొప్ప‌గా మిస్స‌య్యాడ‌ని ఈ ప్ర‌య‌త్న లేమితో తేలిపోయింది. ధ‌నుష్‌, విజ‌య్ , విజ‌య్ ఆంటోనీ లాంటి హీరోలు తాము న‌టించిన చెత్త సినిమాల్ని కూడా తెలుగులో అద్భుత‌మైన ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీతో ఆడించాల‌ని పాకులాడుతుంటే ఎందుక‌నో జ‌యం ర‌వి వ‌చ్చిన మంచి స‌ద‌వ‌కాశాన్ని మిస్ చేసుకున్నాడ‌ని టాలీవుడ్ మీడియాలో ప్ర‌ముఖంగా మాట్లాడుకుంటున్నారు. లాజిక్ అన్న కోణంలో చూడ‌క‌పోతే టిక్ టిక్ టిక్ ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఒక గొప్ప సినిమా. అయితే దానిని తెలుగు ఆడియెన్ గుర్తించ‌క‌పోవ‌డమే అస‌లు బ్యాడ్‌! అందుకు ఎవ‌రు కార‌ణ‌మో విశ్లేషించుకోవాలి.

User Comments