మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన `సైరా: నరసింహారెడ్డి` చిత్రానికి ట్యాక్స్ మినహాయింపు లేదా? మెగాస్టార్ పై కక్ష్యతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయా? అంటే అవుననే ఓ వర్గం బలంగా వాదిస్తోంది. నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్పట్లో ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన రుద్రమదేవి సినిమాకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. చరిత్ర నేపథ్యంలో ఏ సినిమా తెరకెక్కినా కొంతమేర మినహాయింపు ఉంటోంది. పైగా భారీగా బడ్జెట్లు వెచ్చించాల్సి ఉంటుంది కాబట్టి ప్రోత్సాహకం ప్రభుత్వం తరపున ఉండాలి.
కానీ తెలుగు వీరుడైన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవితానికి మాత్రం ట్యాక్స్ మినహాయింపు లేదు. ట్యాక్స్ కట్టాల్సిందేనన్న వైఖరిని ఇరు ప్రభుత్వాలు వ్యక్తం చేస్తున్నాయిట. గౌతమిపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి చరిత్ర కారులు కావడంతో అప్పట్లో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా రిలీజ్ కు ముందే ట్యాక్స్ మనిహాయింపును ఇచ్చాయి. ఇలాంటి చిత్రాలపై పన్ను వసూలు చేయడం ఏమిటి? అంటూ అప్పట్లో ప్రగల్భాలు పలికాయి. కానీ ఉయ్యాల వాడ కథకు మాత్రం అలాంటి మినహాయింపులు లేవని ప్రభుత్వాలు చెబుతున్నాయిట. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ ప్రభుత్వాలను ట్యాక్స్ మినహాయింపు కోరగా విముఖతను వ్యక్తం చేసాయని తెలిసింది.
భారీ బడ్జెట్ తో సాహసం చేసిన నిర్మాత రామ్ చరణ్ విన్నపాన్ని ఎవరూ పట్టించుకోలేదని చెబుతున్నారు. నేడు దేశ ప్రజలంతా స్వతంత్రంగా జీవించగలుగుతున్నారు అంటే.. ఎందరో చరిత్రకారుల త్యాగఫలమే అది. అందులోనూ ఆంగ్లేయులపై తొలిసారి ఉక్కు పాదం మోపింది ఉయ్యాల వాడ నరసింహారెడ్డి అని చరిత్ర స్పష్టంగా చెబుతోంది. ఆ విషయం ఇన్నాళ్లు కనుమరుగైనా సైరా నరసింహారెడ్డి సినిమాతో మెగాస్టార్ ప్రపంచానికి ఆ విషయాన్ని చాటి చెప్పారు. అలాంటప్పుడు పన్ను మినహాయింపు ఇచ్చేందుకు ప్రభుత్వాలకు ఎందుకు అంత నామోషీ అని ప్రశ్నిస్తున్నారు.