చిన్నవో.. పెద్దవో.. ఒక్క రోజు 10 సినిమాలు రావడం మాత్రం అరుదైన విషయమే. ఈ వారం ఆ విచిత్రం జరగబోతుంది. ఒకేరోజు ఏకంగా పది సినిమాలు రానున్నాయి. అందులో కనీసం ఒక్కటి కూడా స్టార్ హీరో సినిమా అయితే లేదు. అయితే డబ్బింగ్ సినిమాల్లో మాత్రం పెద్ద హీరోలు నటిస్తున్నవే వస్తున్నాయి. నవంబర్ 17న చిన్న సినిమాలకు ఊపిరిగా నిలవనుంది. ఆ రోజే ఏకంగా 7 స్ట్రెయిట్ సినిమాలు.. మూడు డబ్బింగ్ లు రానున్నాయి. ఎంతోకాలంగా విడుదలకు నోచుకోని సినిమాలను కూడా నవంబర్ 17నే విడుదల చేస్తున్నారు. ఇందులో కొన్ని సినిమాల వెనక పెద్ద నిర్మాతల హస్తం కూడా ఉంది.
స్ట్రెయిట్ సినిమాల సంగతికి వస్తే.. వచ్చే వారం కలర్స్ స్వాతి కీలకపాత్రలో మారుతి నిర్మించిన లండన్ బాబులు విడుదల కానుంది. ఇక దిల్ రాజు విడుదల చేస్తోన్న ప్రేమతో మీ కార్తిక్ కూడా వచ్చే వారమే వస్తుంది. లవర్స్ క్లబ్.. డేర్ అనే చిన్న సినిమాలకు కూడా నవంబర్ 17నే రానున్నాయి. ప్రేమఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం.. శివబాలాజీ, రాజీవ్ కనకాల స్నేహమేరా జీవితం.. ఎగిసే తారాజువ్వలు.. సురేష్ బాబు విడుదల చేస్తోన్న మెంటల్ మదిలో ఇలా చాలా సినిమాలు నవంబర్ 17న రానున్నాయి. వీటికితోడు హాలీవుడ్ డబ్బింగ్ జస్టిస్ లీగ్ తో పాటు కార్తి నటించిన ఖాకీ.. సిద్ధార్థ్ గృహం సినిమాలు కూడా నవంబర్ 17నే వస్తున్నాయి. వీటిలో ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర విన్నర్ గా నిలుస్తుందో తెలియదు కానీ ఒకేరోజు 10 సినిమాలు వస్తుండటం మాత్రం నిజంగా అరుదైన విషయమే.