తొమ్మిదిలో ఒక్క‌టైనా నిల‌బ‌డిందా..?

న‌వంబ‌ర్ 17.. ఈ మ‌ధ్య కాలంలో బాగా ఆస‌క్తి రేకెత్తించిన తేదీ ఇది. ఎందుకంటే ఈ ఒక్క‌రోజు 9 సినిమాలు విడుద‌ల‌య్యాయి క‌దా మ‌రి. అందులో అన్నీ చిన్న సినిమాలే.. ఒక్క‌టి త‌ప్ప‌. చిన్న‌వో పెద్ద‌వో.. ముందు ఒకేరోజు 9 సినిమాలు రావ‌డం అనేది అరుదైన విష‌యం. 7 స్ట్రెయిట్ సినిమాలు.. రెండు డ‌బ్బింగ్ సినిమాలు ఈ వారం విడుద‌ల‌య్యాయి. ఇప్పుడు అన్ని సినిమాలు వ‌చ్చేసాయి.. వాటి జాత‌కాలు కూడా బ‌య‌ట ప‌డ్డాయి. మ‌రి వీటిలో ఏది హిట్.. ఏది ఫ‌ట్.. ఏది క‌నీసం ఈ వారాంతం వ‌ర‌కైనే నిల‌బ‌డ‌తాయి అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ విష‌యం ఒక్క‌సారి ప‌రిశీలిస్తే.. ఈ వారం వ‌చ్చిన సినిమాల్లో 7 సినిమాలు క‌నీసం వ‌చ్చిన‌ట్లు కూడా చాలా మందికి తెలియ‌దు. క‌ల‌ర్స్ స్వాతి కీల‌క‌పాత్ర‌లో మారుతి నిర్మించిన లండ‌న్ బాబులు వ‌చ్చింది.. కానీ వెళ్లిపోడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం రొటీన్ క‌థ అని ప్రేక్ష‌కులు కూడా తీర్పు ఇచ్చేసారు. ఇక ఇదే వారం వ‌చ్చిన ప్రేమ‌తో మీ కార్తిక్ కూడా పెద్ద‌గా ఇంపాక్ట్ క్రియేట్ చేయ‌లేదు. దిల్ రాజు విడుద‌ల చేసినా.. ఆయ‌న విడుద‌ల చేసాడ‌నే ప్ర‌చారం కూడా ఎక్కువ‌గా జ‌ర‌గలేదు. ఇక ల‌వ‌ర్స్ క్ల‌బ్.. డేర్.. ప్రేమఎంత మ‌ధురం.. ప్రియురాలు అంత క‌ఠినం.. స్నేహ‌మేరా జీవితం.. ఎగిసే తారాజువ్వ‌లు.. ఇలా చాలా సినిమాలు న‌వంబ‌ర్ 17న వ‌చ్చాయి. కానీ వ‌చ్చిన‌ట్లు కూడా తెలియ‌దు.

ఇక డబ్బింగ్ సినిమాలు గృహం, ఖాకీ రెండు రిలీజ్ అయ్యాయి. వీటిలో సిద్ధార్థ్ నటించిన గృహం చాలా మందికి రిలీజ్ అయినట్టు కూడా తెలియదు. ఎందుకంటే తెలుగులో సిద్ధార్థ్ ప్రమోషన్ మీద దృష్టిపెట్టక పోవడమే దీనికి కారణం. గృహం సినిమా పూర్తి హారర్ జోనర్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇక కార్తీ నటించిన ఖాకీ సినిమా బాగుంది. ఎందుకంటే ఖాకీకి క‌మ‌ర్షియ‌ల్ హంగులు ఎక్కువ‌గా ఉన్నాయి. కార్తీ తెలుగులో బాగానే ప్రమోషన్ చేసుకొన్నాడు. మొత్తానికి ఈ తొమ్మిదిలో రెండు మాత్ర‌మే ఓకే అనిపించాయి.