లడ్డు కావాలా నాయనా.. ఒక్క‌రోజులో 10 సినిమాలు..

మొన్న వార‌మే క‌దా.. ఒక్క రోజు 9 సినిమాలు విడుద‌లయ్యాయి. ఇలాంటి విచిత్రాలు అప్పుడ‌ప్పుడే జ‌రుగుతాయి క‌దా.. మ‌ళ్లీ అప్పుడే 10 సినిమాలేంటి అనుకుంటున్నారా..? మ‌న ఇండ‌స్ట్రీలో పెద్ద సినిమాల ధాటికి త‌ట్టుకోలేక ఎన్ని సినిమాలు బాక్సుల్లో మ‌గ్గిపోతున్నాయో చూపించేందుకు ఇదే నిద‌ర్శ‌నం. ఒక్క వారం దొరికితే చాలు.. త‌మ సినిమాల‌న్నింటినీ బ‌య‌టికి తీసుకొస్తున్నారు నిర్మాత‌లు. గ‌త‌వారం ఇదే జ‌రిగింది. ఇప్పుడు కూడా ఇదే జ‌ర‌గ‌బోతుంది. న‌వంబ‌ర్ 17 మాదిరే.. 24న కూడా 10 సినిమాలు విడుద‌ల కానున్నాయి. ఇందులో స్ట్రెయిట్ సినిమాలే ఎక్కువ‌. నారా రోహిత్, రెజీనా జంట‌గా ప‌వ‌న్ మ‌ల్లెల తెర‌కెక్కించిన బాల‌కృష్ణుడు సినిమాపైనే ఈ వారం అంద‌రి చూపు ఉంది. క‌మ‌ర్షియ‌ల్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ కోసం వేచిచూస్తున్న రోహిత్ కు బాల‌కృష్ణుడు కీల‌కం కానున్నాడు.

ఇక పెళ్లిచూపులు ఫేమ్ రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం మెంట‌ల్ మదిలో. వివేక్ ఆత్రేయ తెర‌కెక్కించిన ఈ చిత్రంపై ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో పాజిటివ్ బ‌జ్ ఉంది. ఈ చిత్రం న‌వంబ‌ర్ 24న విడుద‌ల కానుంది. శ్రీ‌విష్ణు ఇందులో హీరోగా న‌టించాడు. ప్రతినిధి సినిమాకు క‌థ‌, మాట‌లు రాసిన ఆనంద్ ర‌వి హీరోగా మారి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన సినిమా నెపోలియ‌న్. నీడ పోయింద‌నే చిత్ర‌మైన కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇది ఈ శుక్ర‌వార‌మే రానుంది. శ‌వంతో సెక్స్ అంటూ ట్రైల‌ర్ తోనే ఆస‌క్తి పెంచేసిన దేవి శ్రీ ప్రసాద్.. ఫిదా ఫేమ్ సాయిప‌ల్ల‌వి న‌టించిన అని ప‌బ్లిసిటీ చేసుకుంటున్న హేయ్ పిల్ల‌గాడ‌.. హీరో ఎవ‌రో కూడా తెలియ‌ని ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారు.. బేబీ.. లచ్చి.. జంధ్యాల రాసిన ప్రేమకథ.. జూన్ 143 ఇలా 10 సినిమాలు ఈ వారం ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాయి. కానీ అంద‌రి దృష్టి మాత్రం బాల‌కృష్ణుడుతో పాటు కొద్దోగొప్పో మెంట‌ల్ మ‌దిలో సినిమాపై ఉంది. మ‌రి వీటిలో ఏది విన్న‌ర్ గా నిలుస్తుందో?