రాజ‌మౌళి క్లారిటీ ఇచ్చిన‌ట్లేనా..?

క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అని అప్ప‌ట్లో జ‌రిగిన చ‌ర్చ కంటే.. రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా ఏంటి..? ఎవ‌రితో..? ఎలా ఉండ‌బోతుంది అని ఇప్పుడు జ‌రిగే చ‌ర్చే ఎక్కువ‌గా ఉంది. దీనికి స‌మాధానం రాజ‌మౌళి నుంచే రావాలి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. ఎవ‌రేం అన్నా ఆయ‌న మాత్రం హాయిగా త‌న ప‌ని తాను చూసుకుంటున్నాడు. అన్నింటికీ మౌన‌మే స‌మాధానం అంటున్నాడు. ఇలాంటి టైమ్ లో స‌డ‌న్ గా ట్వీట్ తో ట్విస్టిచ్చాడు రాజ‌మౌళి. ఒకేసారి మెగా నంద‌మూరి వార‌సుల‌తో ఫోటోలు దిగి లేనిపోని చ‌ర్చ‌కు తావిచ్చాడు.

ఇండ‌స్ట్రీలో ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం మ‌గ‌ధీర కాంబినేష‌న్ మ‌ళ్లీ రిపీట్ కానుంద‌ని తెలుస్తోంది. అంద‌రూ అనుకున్న‌ట్లు నెక్ట్స్ సినిమాలో హీరో అల్లుఅర్జున్.. మ‌హేశ్ బాబు మాత్రం కాదు. త‌న‌కు ఇష్ట‌మైన హీరో ఎన్టీఆర్ అని.. త్వ‌ర‌లో ఆయ‌న‌తో సినిమా చేస్తాన‌న్నాడు రాజ‌మౌళి. ఇక ప్రాక్టిక‌ల్ గా ఆలోచిస్తే రాజ‌మౌళి త‌ర్వాతి సినిమా రామ్ చ‌ర‌ణ్ తో ఉండ‌బోతుంద‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతుంది. రాజ‌మౌళి అడిగితే కాద‌న‌రు అని కాదు కానీ రాజ‌మౌళి కోసం ఇత‌ర నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల‌ను ఇబ్బంది పెట్ట‌డం స‌రికాదు. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ల‌తో ఎవ‌రో ఒక‌రితో సినిమా చేస్తాడు అనుకున్నారు కానీ ఇద్ద‌ర్నీ క‌లిపి మ‌ల్టీస్టార‌ర్ చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడ‌నే విష‌యంలో ఊహించ‌లేదు. ఇప్పుడు అదే జ‌ర‌గ‌బోతుంద‌నే తెలుస్తోంది. అప్ప‌ట్లో అజిత్, అల్లు అర్జున్ కాంబినేష‌న్ లో రాజ‌మౌళి ఓ సినిమా చేయాల‌నుకుంటున్న‌ట్లు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ తెలిపారు. ఇప్పుడు ఇదే క‌థ‌ను తెలుగులో చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల‌తో జ‌క్క‌న్న చేస్తాడేమో అనుకుంటున్నారు.

మ‌రోవైపు ఇప్ప‌టికే విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఓ క‌థ కూడా రాజ‌మౌళికి చెప్పాడ‌ని తెలుస్తోంది. ఇది కంప్లీట్ గా మాస్ సినిమా అని.. విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో ప‌నిలేని సినిమా అని వార్త‌లు వినిపిస్తున్నాయి. రాజ‌మౌళి త‌ర్వాతి సినిమా డివివి దాన‌య్య‌కు చెయ్యాలి.. ఆయ‌న ద‌గ్గ‌ర రామ్ చ‌ర‌ణ్ బ‌ల్క్ డేట్స్ ఉన్నాయి. జ‌న‌వ‌రి నాటికి ఫ్రీ అయ్యే టాప్ హీరో ఒక్క రామ్ చ‌ర‌ణ్ మాత్ర‌మే. పైగా రాజ‌మౌళి ఆ క‌థ‌కు తుదిమెరుగులు దిద్దాల‌న్నా క‌నీసం ఏడాది టైమ్ ప‌డుతుంది. ఈ లెక్క‌న సినిమా వ‌చ్చే ఏడాది ద్వితీయార్థానికి కానీ ప‌ట్టాలెక్క‌దు. ఆ లోపు త్రివిక్ర‌మ్ సినిమాను ఎన్టీఆర్ పూర్తి చేస్తాడేమో ఎవ‌రికి ఎరుక‌..? దీన్నిబ‌ట్టి చూస్తుంటే మెగా నంద‌మూరి మ‌ల్టీస్టార‌ర్ లైన్ లో ఉందేమో అనిపిస్తుంది. మొత్తానికి ఇప్పుడు ఈ స‌స్పెన్స్ కు రాజ‌మౌళే తెర‌దించాలి.