జ‌న‌సేనానికి ఎన్టీఆర్ సెంటిమెంట్‌!

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌పడుతున్న వేళ ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర మ‌లుపులు, వివాదాలు చోటు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. తాజాగా టీడీపీ, వైసీపీ మ‌ధ్య డేటా వివాదం ముదురుతున్న వేళ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ స‌మ‌ర‌శంఖం పూరించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. అది కూడా స్వ‌ర్గీయ నంద‌మూరి తారక రామారావు శంఖారావం పూరించిన గ‌డ్డ నుంచి కావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. 2014 మార్చి 14న పార్టీని స్థాపించారు. ఈ నెల 14న జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని రాజ‌మండ్రిలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో అట్ట‌హాసంగా నిర్వ‌మించ‌బోతున్నారు. ఇదే వేదిక నుంచి ఎన్నిక‌ల శంఖారావాన్ని ప‌వ‌న్ పూరించ‌బోతున్నారు.

1994లో ఇదే గ్రౌండ్ నుంచి స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించి ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించారు. అఖండ విజ‌యాన్ని సాధించి దేశ రాజ‌కీయాల్లోనే పెను సంచ‌ల‌నం సృష్టించారు. ఆ సెంటిమెంట్ ని జ‌న‌సేనాని రిపీట్ చేయ‌బోతున్నార‌ని, అదే స్థాయిలో భారీ మెజారిటీని సొంతం చేసుకుని ఏపీలో ప్ర‌భుత్వాన్ని జ‌న‌సేనా ఏర్పాటు చేస్తుంద‌న్న ఆశాభావాన్ని జ‌న‌సేన పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే రాజ‌కీయ విశ్లేష‌కులు మాత్రం జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌మ‌యంలో వున్న క్రేజ్ ఇప్పుడు లేద‌ని, ఒక్క సీనియ‌ర్ నేత కూడా జ‌న‌సేన వంక తొంగి చూడ‌టం లేద‌ని, ఇలాగైతే రానున్న ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపించ‌డం క‌ష్టం అని చెబుతున్నారు. అయితే ఎన్నిక‌ల ముందు ఎలాంటి స‌న్నివేశం నెల‌కొనేందుకు అయినా ఆస్కారం ఉంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇప్పటికి జ‌న‌సేనానికి ఎంద‌రు సీనియ‌ర్లు ట‌చ్ లో ఉన్నారు? అన్న‌ది చెప్ప‌లేమ‌ని ఓ గుస‌గుస ప్రముఖంగా ఏపీ కారిడార్‌లో వినిపిస్తోంది.