ఎన్టీఆర్‌: దీపావళికి రెండు టీజ‌ర్‌లు

ర‌క్త‌చ‌రిత్ర‌, బాహుబ‌లి చిత్రాల్ని రెండు భాగాలుగా తెర‌కెక్కించి తెలివైన స్కీమ్‌లో రిలీజ్ చేసి క్యాష్ చేస్కున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అదే స్కీములో బాల‌య్య‌- క్రిష్ బృందం తెలివిగానే ప్లాన్ చేసిన‌ట్టే క‌నిపిస్తోంది. ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్ – మ‌హానాయ‌కుడు అంటూ క‌థ‌ను రెండుగా విభ‌జించి సెట్స్‌కెళ్ల‌డంతోనే న‌వ‌ర‌స‌న‌ట‌సార్వ‌భౌముని ఫ్యాన్స్‌లో వేడి పెంచారు. ఇప్పుడు ఆ వేడి, ఎన్‌బికే ఫిలింస్ అధినేత‌ నంద‌మూరి బాల‌కృష్ణ‌కు బిజినెస్ ప‌రంగా బాగానే క‌లిసొస్తుంద‌నే అంచ‌నా వేస్తున్నారు.

జ‌వ‌న‌రి 9న – క‌థానాయ‌కుడు, జ‌న‌వ‌రి 24న – మ‌హానాయకుడు చిత్రాల్ని రిలీజ్ చేస్తామ‌ని టీమ్ ఇదివ‌ర‌కూ ప్ర‌క‌టించింది. సంక్రాంతికి పార్ట్ -1, రిప‌బ్లిక్ డేకి పార్ట్ 2 అంటూ స్కీమ్ వేశారు. మొత్తానికి ఇది మార్కెటింగ్ స్ట్రాట‌జీ ప‌రంగా ఆలోచిస్తే చాలా తెలివైన‌ ఎత్తుగ‌డ‌గా భావించాల్సి ఉంటుంది. అయితే రెండు సినిమాలు కాబ‌ట్టి ప్ర‌చారం కూడా రెండుగా చేయాలా? లేక రెండిటినీ క‌లిపి గంప‌గుత్త‌గా చేయాలా? అంటే ఏమాత్రం క‌న్ఫ్యూజ్ అవ్వ‌కుండా ఒకేసారి రెండు సినిమాల‌కు ప్ర‌చారం సాగిస్తున్నారు. ఈ దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ తొలివారంలో రెండు సినిమాల‌ టీజ‌ర్ల‌ను రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు. దీపావ‌ళి రోజున‌ టీజ‌ర్ రిలీజ్ అని ప్ర‌క‌టించారు. ఆరోజు టైమ్ ఎపుడో త‌ర్వాత చెబుతార‌ట‌. ఇక బాల‌య్య కెరీర్ కి `గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి` త‌ర్వాత మ‌ళ్లీ ఆ రేంజు హిట్లు ఇచ్చే దిశ‌గా క్రిష్ చ‌క్క‌ని ప్ర‌ణాళిక‌తో సాగుతున్నాడు. ఎన్‌బికే ఫిలింస్ సంస్థ‌కు భారీగానే లాభాల్ని తెచ్చిపెట్టే ప్లాన్‌తో దూసుకుపోతున్నాడు. ప్ర‌యోగాలు చేస్తేనే ఫ‌లితం కొత్త‌గా ఉంటుంది. మ‌రి ఆమేర‌కు పాజిటివ్ ఫ‌లితాన్ని ఎన్‌బీకే అండ్ టీమ్ ఏమేర‌కు అందుకుంటారో చూడాలి.