నువ్వు తోపురా మూవీ రివ్యూ

నటీనటులు : సుధాక‌ర్ కోమాకులు, నిత్యా శెట్టి, నిరోష‌, వ‌రుణ్ సందేశ్‌ త‌దిత‌రులు
బ్యానర్: యునైటెడ్ ఫిలింస్
నిర్మాత: డి.శ్రీకాంత్- జేమ్స్‌ వాట్‌
సంగీతం: ప‌ల్లికొండ‌- దీప‌క్
ర‌చ‌న‌: అజ్జు మ‌హకాళి
దర్శకత్వం: హరినాథ్ బాబు

ముందు మాట:
శేఖ‌ర్ క‌మ్ముల `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్` సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు వైజాగ్ కుర్రాడు సుధాక‌ర్ కోమాకుల‌. నాగ‌రాజుగా అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. విశాఖ వాసి అయినా నైజాం భాష‌- యాస‌తో మెప్పించాడు. సుధాక‌ర్ గా కంటే నాగ‌రాజుగానే అత‌డికి ప్ర‌త్యేక‌ ఐడెంటిటీ ద‌క్కింది. ఆ త‌ర్వాత `ఉందిలే మంచి కాలం`, `కుందనపు బొమ్మ` సినిమాల్లో నటించాడు. జ‌యాప‌జ‌యాల‌తో ప‌ని లేకుండా సుధాక‌ర్ లోని న‌టుడికి మంచి మార్కులే ప‌డ్డాయి. ఈ శుక్రవారం అత‌డు న‌టించిన నాలుగో సినిమా థియేట‌ర్ల‌లోకి రిలీజైంది. సుధాకర్‌ కోమాకుల- నిత్యాశెట్టి జంటగా హరినాథ్‌ బాబు.బి దర్శకత్వంలో యునైటెడ్ ఫిలింస్ అధినేత‌ డి. శ్రీకాంత్ నిర్మించిన `నువ్వు తోపురా` నేడు విడుదలైంది. ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. అమెరికాలో ఊహించ‌ని ట్ర‌బుల్స్ లో ప‌డే తెలుగు కుర్రాడి క‌థ ఇద‌ని సుధాక‌ర్ ఇంట‌ర్వ్యూల్లో వెల్ల‌డించారు. అయితే అమెరికా వెళ్లినా మాస్ అవ‌తారాన్ని వ‌ద‌ల‌ని ఆ కుర్రాడి వ్య‌వ‌హారం థియేట‌ర్ల‌లో ఆడియెన్ కి ఎంత‌వ‌ర‌కూ క‌నెక్ట‌య్యింది? సినిమాలో మ్యాట‌ర్ ఎంత‌? అన్న‌ది తెలియాలంటే ఈ రివ్యూ చ‌ద‌వాల్సిందే..

కథనం అనాలిసిస్:
లైఫ్ ప్ర‌తి ఒక్క‌రి స‌ర‌దా ఏదో రూపంలో తీర్చేస్తుంది అనేది స్టార్ డైరెక్ట‌ర్ పూరి అనుభ‌వంతో చెప్పే మాట‌. ఆయ‌న అన్న‌ట్టే నైజాం (స‌రూర్ న‌గ‌ర్) కుర్రాడు సూర్య (సుధాక‌ర్ కోమాకుల‌)కు అమెరికా లైఫ్ ఎలా.. డీ తీర్చేసింది? అన్న‌దే ఈ సినిమా. స‌ర‌దాగా ఆడుతూ పాడుతూ తిరిగేసే కుర్రాడికి ల‌వ్ లైఫ్ లో ఉద్యోగం స‌ద్యోగం లేక‌పోతే వ‌చ్చే క‌ష్టం.. త‌న‌కు జ‌న్మ‌నిచ్చిన త‌ల్లితో ఘర్ష‌ణ ప‌డి దూరంగా ఉంటే.. ఆ త‌ర్వాత అమ్మ ఆరోగ్యం కోస‌మే ఉద్యోగాలు వెతుక్కుంటూ అమెరికాలో వేద‌న అనుభ‌విస్తే.. ఇదంతా సినిమా క‌థాగ‌మ‌నం. అయితే డ‌బ్బు సంపాదించ‌డం కోసం అత‌డు ఎంచుకున్న ఓ త‌ప్పు దారి అత‌డి లైఫ్ ని ఎలాంటి రిస్క్ లో పెట్టింది? చివ‌రికి సూరిగాడు అన్ని చిక్కుల్లోంచి బ‌య‌ట‌ప‌డి `నువ్వు తోపురా` అని అంద‌రూ అనేలా ప్రూవ్ చేసుకున్నాడా లేదా? అన్న‌దే సినిమా.

చాలా సింపుల్ లైన్ ని ఎంచుకున్న ద‌ర్శ‌కుడు ఈ సినిమాని ఆద్యంతం ఎగ్జ‌యిటింగ్ గా చూపించ‌డంలో మాత్రం విఫ‌ల‌మ‌య్యార‌నే చెప్పాలి. ముఖ్యంగా ఫ‌స్టాఫ్‌ స‌రైన క‌థ‌ను.. కాన్ ఫ్లిక్ట్ ని చూపిండంలో పూర్తిగా ఫెయిల‌య్యారు. దాంతో ఇంత సాగ‌తీత ఎందుకో అనిపిస్తుంది. ముఖ్యంగా క‌థ గురించి పాజిటివ్ గా చెప్పుకోవ‌డానికి అస‌లేమీ లేదు. అమెరికా నేప‌థ్యం అని చెప్పారు కాబ‌ట్టి ఈ సినిమాని అమెరికాలోనే ఆరంభించి.. ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో హీరో ట్ర‌బులేంటి? అన్న‌ది చూపించారు. ఇక అత‌డి క‌థ‌లో నిరుద్యోగం.. మ‌ద‌ర్ అనారోగ్యం.. ప్రియురాలిలో ఇత‌ర కోణం అన్నవి ప్ర‌ధాన‌ కాన్‌ఫ్లిక్ట్. అయితే దేనినీ అంత గ్రిప్పింగ్ నేరేష‌న్ తో చూపించ‌లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్.

నటీనటులు:
సుధాక‌ర్ కోమాకుల నైజాం యాక్సెంట్ .. హావ‌భావాలు సినిమాకి ప్ర‌ధాన బ‌లం. అత‌డి న‌ట‌నలో ఈజ్ ఆక‌ట్టుకుంది. రెండు నందులు అందుకుని బాల‌న‌టిగా అనుభ‌వం ఉన్న నిత్యా శెట్టి న‌ట‌న మెప్పిస్తుంది. త‌ల్లి పాత్ర‌లో నిరోషా ఓకే. వ‌రుణ్ సందేశ్ చాలా కాలానికి ఓ చిన్న పాత్ర‌లో త‌న ప‌రిధి మేర‌కు న‌టించాడు. ఇక మిగ‌తా పాత్ర‌లు సోసోనే.

టెక్నికాలిటీస్:
సినిమాటోగ్రఫీ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. రీరికార్డింగ్ ఫ‌ర్వాలేదు. గ్రిప్పింగ్ నెరేష‌న్ తో చూపించ‌డంలో ద‌ర్శ‌కుడి వైఫ‌ల్యం మైన‌స్. ఎడిటింగ్ మ‌రింత షార్ప్ గా ఉంటే గ్రిప్ పెరిగి ఉండేదే.

ప్లస్ పాయింట్స్:
*ఎంచుకున్న క‌థాంశం.. అమెరికా లొకేష‌న్లు..
* సుధాక‌ర్ – నిత్యా జంట న‌ట‌న‌

మైనస్ పాయింట్స్:
* స్లో నెరేష‌న్
* స‌న్నివేశాల సాగ‌తీత‌

ముగింపు:
తోపు అని చెప్పుకోవ‌డానికేం లేదు.. బోరింగ్ డ్రామా..

రేటింగ్:
1.75/5