నువ్వు తోపురా అని పిల‌వాలంతే!!

శేఖ‌ర్ క‌మ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నాగ‌రాజుగా అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు సుధాక‌ర్ కోమాకుల‌. ఇప్ప‌టికీ అత‌డిని నాగ‌రాజుగానే గుర్తిస్తారు అభిమానులు. ఆ త‌ర్వాత ఓ రెండు సినిమాల్లో న‌టించిన సుధాక‌ర్ తాజాగా మ‌రో ఛాలెంజింగ్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. సుధాకర్‌ కోమాకుల- నిత్యాశెట్టి జంటగా హరినాథ్‌ బాబు.బి దర్శకత్వంలో యునైటెడ్ ఫిలింస్ అధినేత‌ డి. శ్రీకాంత్ నిర్మించిన నువ్వు తోపురా ఈనెల‌ 3న సినిమా విడుదలవుతోంది. ఈ సంద‌ర్భ ంగా హైదరాబాద్ లో హీరో సుధాక‌ర్ కోమాకుల‌ పాత్రికేయుల‌తో ముచ్చ‌టించారు.

*నువ్వు తోపురా క‌థాంశం ఆసక్తిక‌రం. తెలంగాణ మాండ‌లీకంలో మాట్లాడే సూరిగాడు (స‌రూర్ న‌గ‌ర్ వాసి) అమెరికా వెళితే అక్క‌డ అత‌డి జీవన విధానం ఎలా సాగింది? అన్న‌దే మా సినిమా క‌థ‌. అమ్మ‌.. చెల్లి మాత్ర‌మే ఉంటారు త‌న‌కు. అమెరికాలో ఎదురైన ఓ స‌మ‌స్య‌ను అత‌డు ఎలా ప‌రిష్క‌రించుకున్నాడు? అన్నది ఆద్య ంతం ఉత్క ంఠ క‌లిగిస్తుంది. అమెరికా వెళ్లాక విలువ‌లు ఎలా మారాయి.. అన్న‌ది ఆస‌క్తిక‌రంగా చూపిస్తున్నాం. సూరిగాడు లొంగ‌డు.. అయితే ఎలాంటి వారిని అయినా అమెరికా వంచేస్తుంది.. అన్న చ‌క్క‌ని ఎలిమెంట్ ఆక‌ట్టుకునేలా తెర‌పై చూడొచ్చు.

*ఈ సినిమా టైటిల్ కి త‌గ్గ‌ట్టే థియేట‌ర్లలో ఆడియెన్ నువ్వు తోపురా అని అనేలా ఉంటుంది ఈ సినిమా. అయితే సినిమాలోనూ ఓ పాత్ర హీరోని నువ్వు తోపురా అంటుంది. ఆ పాత్ర ఏంటి అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్. ఈ సినిమాలో అమెరికాని చూపించాం అంటే కేవ‌లం భ‌వంతులు.. భారీ నిర్మాణాలే అనుకుంటే త‌ప్పు. అక్క‌డ ఉన్న ర‌క‌ర‌కాల అంద‌మైన ల్యాండ్ స్కేప్స్ ఇందులో క‌నిపిస్తాయి. అంద‌మైన కొండ‌లు.. లోయ‌లు.. స‌ర‌స్సులు ప్ర‌తిదీ తెర‌పై క‌నిపిస్తాయి. ఊటా అనే ఏరియా.. సాల్ట్ లేక్ ఏరియా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలుస్తాయి. ఓవరాల్ గా 55 రోజుల్లో చిత్రీక‌ర‌ణ పూర్తి చేశాం.

* శేఖ‌ర్ క‌మ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో ప‌రిచ‌యం అయ్యాను. ఆ త‌ర్వాత రెండు సినిమాలు చేశాను. కొంత గ్యాప్ వ‌చ్చినా నువ్వు తోపురా చిత్రాన్ని ఎంతో క్వాలిటీతో తెర‌కెక్కించాం. ఇండియా.. అమెరికాలో మెజారిటీ పార్ట్ చిత్రీక‌ర‌ణ సాగింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నాగ‌రాజు పాత్ర‌ను ఇప్ప‌టికీ నా అభిమానులు గుర్తు పెట్టుకున్నారు. వారి కోసం ఆ పాత్ర‌కు ఎక్స్ టెన్ష‌న్ ఉంటే ఎలా ఉంటుంది? అని భావించి చేసిన చిత్ర‌మిది. ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు క‌థ‌ను రాసుకుని చేశాం. సినిమా బాగా వ‌చ్చింది. గీతా ఆర్ట్స్ లాంటి ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు మా చిత్రాన్ని రిలీజ్ చేస్తూ అండ‌గా నిలిచాయంటే మా ద‌ర్శ‌క‌నిర్మాత‌లకు ఉన్న స్నేహ‌బంధాలు అలాంటివి.

* నా హెయిర్ చూస్తే మాస్.. అమెరికాలో క‌థ అంటే క్లాస్ క‌దా.. అయితే అదే మా సినిమా ప్ర‌త్యేక‌త‌. అమెరిక వెళ్లినా మార‌ని మాస్ కుర్రాడి క‌థ ఇది. అక్క‌డా ఇక్క‌డ ఎలా ఉన్నాడో అలానే ప్ర‌వ‌ర్తించే పాత్ర సూరిగాడు.. నేను ఏపీ వైజాగ్ వాసిని. అయినా తెలంగాణ యాస‌తో నాగ‌రాజు పాత్ర చేశాను. ఆ త‌ర్వాత ఇక్క‌డ భాష లోన ఉండిపోయింది. గ‌జ్వేల్ వెళితే కేసీఆర్ భాష‌నే నాకు వ‌చ్చేస్తుంటుంది. అమెరికా వెళ్లినా అదే యాస‌.. భాష తో ఉంటాడు సూరిగాడు. ఇక ఇందులో న‌టించిన నిత్యా శెట్టి రెండు నందులు అందుకున్న క‌థానాయిక‌. నాతో పోటీప‌డే పాత్ర‌లో న‌టించింది. ద‌ర్శ‌కుడు హ‌రినాథ్ అద్భుతంగా తెర‌కెక్కించారు. నిర్మాత‌లు రాజీ అన్న‌దే లేకుండా పెట్టుబ‌డులు స‌మ‌కూర్చారు.

* నా త‌దుప‌రి సినిమా ఏది అన్న‌ది ఈ సినిమా రిలీజ్ త‌ర్వాతే ప్లాన్ చేస్తాను. ప్ర‌స్తుతానికి క‌థ‌లు రెడీగానే ఉన్నాయి. నా స్నేహితులే సినిమాలు తీసేవాళ్లు ఉన్నారు. ఇక ఇదే బ్యాన‌ర్ లోనూ మ‌రో సినిమా చేస్తాను..

*ఇటీవ‌లే మంగ‌ళగిరి ప‌రిస‌రాల్లో యాక్సిడెంట్ జ‌రిగింది. అందులో మ‌ర‌ణించిన ల‌క్ష్మీ అనే కార్మికురాలి కుటుంబానికి రూ.5ల‌క్ష‌లు ప‌రిహారం ఇస్తున్నాం. ఏం ఇచ్చినా ఆమె తిరిగి రాద‌న్న బాధ న‌న్ను ఎంతో క‌ల‌చివేస్తోంది. ఆ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారికి ఏదైనా చేస్తాం. డ్రైవ‌ర్ ఇప్ప‌టికి కోలుకుంటున్నాడు. ఇక ఆ యాక్సిడెంట్ స‌మ‌యంలో నాపై కొన్ని మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం చేశాయి. డ్రైవింగ్ చేసింది నేనేన‌ని రాశాయి. అయితే చాలా మీడియాలు నాకు అండ‌గా నిలిచాయి..