స్టోరీ ఒక్కటే.. సినిమాలే రెండు

ఒక్క‌క్ష‌ణం.. టైటిల్ నుంచే కొత్త‌ద‌నం అనిపించిన సినిమా ఇది. మొన్న విడుద‌లైన టీజ‌ర్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. అస‌లు ఈ టీజ‌ర్ చూసిన త‌ర్వాత ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ కు మంచి అప్లాజ్ కూడా వ‌చ్చింది. మ‌నోడి బుర్రే బుర్ర అంటూ ప్ర‌శంస‌లు కూడా వ‌చ్చాయి. కానీ ఇప్పుడు దిమ్మ‌తిరిగే నిజం ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది. ఒక్క‌క్ష‌ణం విఐ ఆనంద్ సొంత క‌థ కాద‌ని.. దీన్ని కొరియ‌న్ సినిమా నుంచి లేపేసాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కొరియ‌న్ లో వ‌చ్చిన ప్యార‌ల‌ల్ లైఫ్ అనే సినిమా ఆధారంగా ఆనంద్ ఈ చిత్రం తెర‌కెక్కించాడ‌ని తెలుస్తుంది. అయితే ఇక్క‌డే మ‌రో ట్విస్ట్ కూడా ఉంది. ఈ చిత్ర రీమేక్ రైట్స్ ఇప్ప‌టికే తెలుగు నిర్మాత అనిల్ సుంక‌ర తీసుకున్నారు. అఫీషియ‌ల్ గా తీసుకుని 2 మేమిద్ద‌రం అనే సినిమా కూడా తెర‌కెక్కించారు అనిల్ సుంక‌ర టీం

అయితే ఒక్క‌క్ష‌ణం కూడా ఇదే క‌థ‌తో వ‌స్తుంద‌ని తెలుసుకుని.. స‌ద‌రు నిర్మాత చ‌క్రి చిగురుపాటి ద‌గ్గ‌రికి వెళ్లి అస‌లు విష‌యం చెప్పాడు అనిల్. విడుద‌ల‌కు ముందే ఈ విష‌యాన్ని సెటిల్ చేస్తామ‌ని అప్పుడు చెప్పిన ఒక్క‌క్ష‌ణం టీం ఇప్పుడు మాత్రం ఏం మాట్లాడ‌టం లేద‌ని చెబుతున్నాడు ఈ నిర్మాత‌. దాంతో త‌న‌కు చాలా న‌ష్టం వ‌స్తుంద‌ని.. క‌నీసం ఓ సినిమాను రీమేక్ చేసేట‌ప్పుడు రైట్స్ తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదా అని ప్ర‌శ్నిస్తున్నాడు అనిల్ సుంక‌ర‌. డిసెంబ‌ర్ 28న ఒక్క‌క్ష‌ణం విడుద‌ల కానుంది. ఆలోపు త‌మ సినిమాను కూడా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడు అనిల్. అందుకే త్వ‌ర‌త్వ‌ర‌గా మేమిద్దరం ట్ర‌ల‌ర్ విడుద‌ల చేసాడు. రేపు విడుద‌లైన త‌ర్వాత కూడా త‌న సినిమా న‌ష్ట‌పోతే దానికి కార‌ణం ఒక్క‌క్ష‌ణం టీం అని చెబుతున్నాడీయ‌న‌. మ‌రి ఓ రీమేక్ చేసిన‌పుడు రైట్స్ తీసుకోకుండా చేస్తున్న విఐ ఆనంద్ అండ్ టీంపై నిర్మాత‌ల మండ‌లి ఎలాంటి చర్య తీసుకుంటారో చూడాలి.