బ్యాంకుల‌కు ల‌క్ష కోట్ల టోకరా

ద‌ర్జా దొర‌లు అనాలో ద‌ర్జా దొంగ‌లు అనాలో కానీ.. ఈ బాబులు ఆడుతున్న ఆట‌లో ప్ర‌భుత్వ బ్యాంకుల‌న్నీ పావులుగా మారాయి. బ్యాంక్ అధికారులే దొంగ‌లుగా మారి మాల్యా లాంటి వాళ్ల‌కు దోచి పెడుతుండ‌డంతో తండోప‌తండాలుగా ఇలాంటి బాప‌తు మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. సంస్క‌రిస్తాం! అంటూనే ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కుదేల‌య్యేలా చేస్తున్న ఈ మోసాల విలువ ల‌క్ష‌ల కోట్లుగా ఉంద‌న్న‌ది ఓ అంచ‌నా.

బ్యాంక్ రికార్డుల తారుమారు నుంచి బ్యాంకుల‌ కుంభకోణాలు షాకిస్తున్నాయి. ముఖ్యంగా ప్ర‌స్తుత‌ ఆర్ధిక మాంద్యం సమయంలో పెరుగుతున్న సంఘటనలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా ప‌రిణ‌మించింది. ఎన్‌పిఎలుగా రూ .50 కోట్లకు పైగా ఉన్న అన్ని రుణాల మోసపూరిత వ్యవహారాన్ని పరిశీలించాలని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను కోర‌డ‌మేగాక ఈ కేసులను గుర్తించడానికి కేంద్ర ఒక రిజిస్ట్రీని కూడా ఏర్పాటు చేసింది. 2019 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో రూ.95,760 కోట్ల మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకు మోసాలు జరిగాయని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రి తాజాగా ప్ర‌క‌టించారు.

2018-19 లో 64,509 కోట్లు మేర ప్ర‌భుత్వ బ్యాంకులు నష్టపోయాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ .25,417 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ రూ .10,822 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ .8,273 కోట్లు నష్టపోయాయి. పంజాబ్ – మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ (పిఎంసి) లో ఇటీవల జరిగిన బ్యాంకు మోసం ఫలితంగా తొమ్మిది మంది పెట్టుబడిదారులు ప్రాణాలు కోల్పోయారు. దశాబ్ద కాలంగా పెరిగిన ఇటువంటి బ్యాంక్ మోసాల కారణంగా ఆర్‌బిఐ తీవ్ర ఆందోళనలో ఉంది.