పైరసీపై త‌మిళ్ ఇండ‌స్ట్రీ యుద్ధం.. 

ఏడాది మొత్తం క‌ష్ట‌ప‌డిన పంట చేతికొచ్చే టైమ్ కు వ‌ర‌ద‌ల్లో మునిగిపోతే ఆ రైతు ప‌రిస్థితి ఎలా ఉంటుంది..? ఇప్పుడు ఇండ‌స్ట్రీలో పైర‌సీ సినిమాల బారిన ప‌డి నిర్మాత‌ల ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది. పైర‌సీ.. ఇండ‌స్ట్రీ ఏదైనా నిర్మాత‌ల‌ను నిద్ర పోనీకుండా చేస్తున్న ప‌దం ఇది. కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు చేసి చేసిన సినిమాల‌ను విడుద‌లైన రోజే నెట్ లో పెట్టేస్తున్నారు కొంద‌రు. మిగిలిన ఇండ‌స్ట్రీలతో పోలిస్తే త‌మిళ‌నాట ఈ పైర‌సీ ర‌చ్చ ఎక్కువ‌గానే ఉంది. అక్క‌డ విడుద‌లైన రోజే నిర్మాత‌ల‌కు చెప్పి మ‌రీ కొన్ని సైట్లు సినిమాల‌ను అప్ లోడ్ చేస్తున్నాయి. ఈ మ‌ధ్యే విడుద‌లైన 16, సూర్య సింగం 3 సినిమాల‌ను విడుద‌ల రోజే నెట్ లో పెట్టేసి సంచ‌ల‌నం సృష్టించారు పైర‌సీ దారులు. చెప్పి మ‌రి వీటిని అప్ లోడ్ చేస్తున్నారు పైర‌సీ దారులు. దీనిపై నిర్మాత‌ల మండ‌లి కూడా ఎలాంటి యాక్ష‌న్ తీసుకోలేదు ఇన్నాళ్లు.
కానీ ఇప్పుడు విశాల్ వ‌చ్చాడు క‌దా..! అందుకే వ‌చ్చీ రాగానే త‌మిళ్ రాక‌ర్స్ అనే పైర‌సీ సైట్ పై సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు ఇచ్చి మూయించేసాడు  ఇక ఇప్పుడు వాళ్లు విశాల్ కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. విజ‌య్ న‌టిస్తోన్న మెర్స‌ల్ సినిమా అక్టోబ‌ర్ 18న విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని విడుద లైన రోజే నెట్ లో పైర‌సీ ప్రింట్ పెట్టేస్తాం.. ఏం చేస్తారో చేసుకోండి అంటూ ఓపెన్ చాలెంజ్ విసిరింది త‌మిళ్ రాక‌ర్స్ సైట్. ప్ర‌స్తుతానికి త‌మ సైట్ కు కొన్ని స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని.. త్వ‌ర‌లోనే రీ మాడిఫికేష‌న్ తో వ‌స్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు వాళ్లు. పైర‌సీ దారులు అంత ఓపెన్ గా ఛాలెంజ్ విస‌ర డానికి మ‌రో కార‌ణం కూడా ఉందంటున్నాడు త‌మిళ‌నాడు సీనియ‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్ తిరంపూర్ సుబ్ర‌మ‌ణ్యం. నిర్మాత‌లే పైరసీకి స‌గం కార‌ణం అవుతున్నారంటూ చెప్పుకొచ్చారాయ‌న‌.
ఓవ‌ర్సీస్ హ‌క్కుల‌కు ఆశ‌ప‌డి త‌మ‌కు తెలియ‌ని దేశాల‌కు కూడా సినిమాల‌ను అమ్మేస్తున్నారని.. వాళ్ల నుంచి కంటెంట్ ను కొంద‌రు పైర‌సీ సైట్లు న‌డిపించే వాళ్లు భారీ మొత్తం కొంటున్నార‌ని.. అలా విడుద‌లైన రోజు సాయంత్ర‌మే సినిమాల‌ను నెట్ లో పెట్టేస్తున్నార‌ని చెబుతున్నాడు తిరంపూర్ సుబ్ర‌మ‌ణ్యం. ఆలోచిస్తుంటే ఈయ‌న చెప్పిన దాంట్లో కూడా నిజం లేక‌పోలేదు. నిర్మాత‌ల‌కు మ‌రీ అంత డ‌బ్బు ఆశ‌ కూడా ప‌నికిరాదు క‌దా..! అస‌లు ఆ దేశంలో త‌మ సినిమా చూస్తారో లేదో కూడా తెలియ‌కుండా రైట్స్ కోసం సినిమాను అమ్మేస్తే ఇలాంటి ప‌రిస్థితులే వ‌స్తాయి మ‌రి..!