ఉస్మానియా విద్యార్థి నాయకుడి కథతో సినిమా..!

Osmania Student Leader George Reddy Biopic

టాలీవుడ్ కూడా ఇప్పుడు బాలీవుడ్ ను ఫాలో అయిపోతూ బయోపిక్ ల పేరు చెప్పి, ప్రముఖుల జీవిత చరిత్రలను సినిమాలుగా తెరకెక్కించడానికి రెడీ అవుతుంది. అయితే, మన నేటివిటీ దగ్గరకు వచ్చేసరికి చాలావరకు చరిత్రలో పోరాటాల మధ్య నలిగిపోయిన రియలిస్టిక్ కథలే తెరపైకి వస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇప్పటికే ఈ తరహాలో వర్మ రక్తచరిత్ర, వంగవీటి అంటూ కొన్ని సంచలన సినిమాలు తీయగా.. ఇప్పుడు మరీ ఆ రేంజ్ లో అటువంటి స్టోరీ కాకపోయినా, కొంతలో కొంత గుండెలను తడిమే కథ ఒకటి తెరపైకి రానుండటం గమనార్హం.
అది కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో ఓ గొప్ప అధ్యాయంగా కూడా చెప్పుకునే ఓ యువ నాయకుడి జీవిత కథ కావడం విశేషం. అసలు విషయంలోకి వెళితే, ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కడానికి రంగం సిద్ధం అవుతుంది. అందులోనూ ఈ సినిమా.. వంగవీటి మూవీలో వంగవీటి రంగా, రాధా అనే రెండు పాత్రల్లోనూ నటించి ఆకట్టుకున్న సాండీ హీరోగా తెరకెక్కనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించనున్న ఈ చిత్రానికి ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకుడు అని తాజాగా ప్రకటించారు.
అంతేకాకుండా జార్జ్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా 1962 నుంచి 1972 లలో విద్యార్థి రాజకీయాలు, ఆనాటి సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు, ఓయూ పరిణామాలను ఈ చిత్రంలో చూపించబోతున్నామని తెలిపారు. అలాగే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా, భారీ బడ్జెట్ తో తెలుగు సినిమాల్లోనే ఒక డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో తెలుగు నటులతో పాటు హిందీ, తమిళ, మలయాళ నటులు కూడా ప్రధాన పాత్రలు పోషిస్తారని పేర్కొనడం విశేషం. అదే విధంగా తెలుగు, హిందీ భాషల్లో రానున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను త్వరలో రిలీజ్ చేస్తామని చెబుతూ.. మరాఠీ బ్లాక్ బాస్టర్ మూవీ ‘సైరత్’ కెమెరామెన్ సుధాకర్ ఎక్కంటి ఈ చిత్రానికి పని చేయనున్నారని ప్రకటించడం ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది.