జీవో: తిండి ఛాయిస్ మీదే ఇక‌

Last Updated on by

మ‌ల్టీప్లెక్స్, సింగిల్ థియేట‌ర్ మెయింటెనెన్స్ స్కామ్స్‌పై ప్ర‌భుత్వాలు సీరియ‌స్‌గా దృష్టి సారిస్తున్నాయా? అంటే అవున‌నే అర్థ‌మ‌వుతోంది. మెయింటెనెన్స్ ఫీజు, జీఎస్టీ, లోక‌ల్ ట్యాక్స్ అంటూ టిక్కెట్టుపైనా, పార్కింగ్, తినుబండారాల‌పైనా తెగ బాదేస్తున్న వైనంపై స‌ర్వ‌త్రా వ్య‌తిరేక‌త నెల‌కొంది. జ‌నాల సొమ్ములు కేవ‌లం కొద్దిమంది బూర్జువాల ఖాతాల్లోకి మ‌ళ్లిపోవ‌డంపై ప్ర‌భుత్వాలు, అధికారులు దృష్టి సారించారు. ఆ క్ర‌మంలోనే అవ‌స‌రం మేర చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇది గిట్ట‌ని థియేట‌ర్ య‌జ‌మానులు, మ‌ల్టీప్లెక్స్ య‌జ‌మానులు గుంట న‌క్క తెలివితేట‌లు ప్ర‌ద‌ర్శిస్తూ పేద అరుపులు అర‌వ‌డం ఇదివ‌ర‌కూ చ‌ర్చ‌కొచ్చింది. కొంద‌రు థియేట‌ర్ య‌జ‌మానులు తెలివిగా రింగై కేటీఆర్‌కి ఫిర్యాదు చేసేందుకు, త‌మ‌ను ర‌క్షించ‌మ‌ని కోరుతూ మీడియాకెక్కిన సంగ‌తి తెలిసిందే.

ఇక‌పోతే ఇలాంటి రింగ్ బాబులు దొంగ నాట‌కాల‌కు ముగింపు ప‌లికేందుకు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆ రాష్ట్రంలో ఇక‌మీద‌ట థియేట‌ర్ల‌లో ఎవ‌రి తిండి వాళ్లు ప‌ట్టుకెళ్లి మ‌రీ తినొచ్చు. పొద్దున్నే టిఫిన్ బాక్స్‌, మ‌ధ్యాహ్నం లంచ్ కూడా థియేట‌ర్ల‌కు తీసుకెళ్లి లోన కూచుని మ‌రీ తినొచ్చు. అందుకు అవ‌స‌ర‌మైన కొత్త జీవోని ప్ర‌భుత్వం పాస్ చేసింది. దీనిపై ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో హ‌ర్షం వ్య‌క్త‌మైంది. వినోదం పేరుతో ప్ర‌జ‌ల నిలువుదోపిడీని నివారించేందుకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం చూపించిన తెగువ మ‌న తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు చూపిస్తాయా? అంటూ నెటిజ‌నుల్లో హాట్ హాట్‌గా చ‌ర్చ సాగుతోంది. ఇక్క‌డా అలాంటి జీవో ఒక‌టి తేవాల‌ని, నిబంధ‌న‌లు మార్చాల‌ని కోరుతున్నారు జ‌నం. ఇక‌పోతే ఇప్ప‌టికే థియేట‌ర్లు, మ‌ల్టీప్లెక్సులు, మాల్స్‌లో పార్కింగ్ ఫీజు దోపిడీకి మంత్రి కేటీఆర్ చెక్ పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఏపీలో ఇది లేక‌పోయినా, తెలంగాణ రాష్ట్రంలో ఇది అమ‌ల్లో ఉంది. పార్కింగ్ ఫీజు పెట్టాలి దేవుడో అంటూ ఇదివ‌ర‌కూ మాల్స్, మ‌ల్టీప్లెక్సుల య‌జ‌మానులు గ‌గ్గోలు పెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే థియేట‌ర్ల‌లో తిండి దోపిడీ ఏ రేంజులో ఉంది? అంటే.. 3 స‌మోసాలు రూ.120, కోక్ – పాప్‌కార్న్ ప్యాకేజీ రూ.450- 500 వ‌సూలు చేస్తూ జేబు గుల్ల చేసేస్తున్నారు. ఈ దోపిడీకి అంతూ ద‌రీ లేనేలేదన్న తీవ్ర విమ‌ర్శ‌లు ఉన్నాయి. వీట‌న్నిటికీ చెక్ పెడుతూ ఎవ‌రి తినుబండారాలు వాళ్లు థియేట‌ర్ల‌కు తీసుకెళ్లేలా ఓ కొత్త జీవోని ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాలు తేవాల‌ని ప్రేక్ష‌కుల‌కు కోరుతున్నారు.

User Comments