బిగ్ బాస్ షో లో ప్రేమ.. హీరోయిన్ కు సమన్లు

 

హిందీలో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షో ను ఇంచుమించుగా ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తెలుగులో ఈ షో ను ఎన్టీఆర్ బాగానే నడిపిస్తుండగా.. తమిళంలో కమల్ హాసన్ కొంచెం కష్టంగానే నడిపిస్తున్నారు. అందులోనూ తెలుగులో చిన్నా చితకా వివాదాలే తలెత్తుతుంటే.. తమిళంలో మాత్రం పెద్ద వివాదాలే ఎదురవుతుండటం, షో పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో కొంచెం కష్టంగా మారింది. ఇలాంటి టైమ్ లో మామూలు హీరోయిన్ గా షో లో అడుగుపెట్టిన నటి ఓవియా తర్వాత బిగ్ బాస్ హౌస్ లో తన బిహేవియర్ తో సూపర్ పాపులర్ అవడంతో షో ఒక్కసారిగా ఊపందుకుంది. ముఖ్యంగా తమిళనాట సోషల్ మీడియాలో ఓవియా పేరు మార్మోగిపోయింది.
అయితే, ఊహించని విధంగా ఓవియా బిగ్ బాస్ హౌస్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, అది కాస్తా ప్రసారం కావడంతో ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ముందుగా షో లో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న ఓవియా అక్కడ కొన్నిరోజులకే మిగిలిన వారితో తలెత్తిన విభేదాలతో ఒంటరైన విషయం తెలిసే ఉంటుంది. అదే సమయంలో ఒంటరిగా ఉన్న ఓవియాను స్నేహితుడిగా నటుడు ఆరవ్ ఆదరించడంతో.. ఓవియా అతడిపై క్రమంగా ప్రేమను పెంచుకుంది. అనంతరం తన మనస్సులోని మాటను ఆరవ్ కు చెబితే.. ఆమె ప్రేమను ఆరవ్ నిరాకరించడం, దాంతో మనస్థాపానికి  గురైన ఓవియా బిగ్ బాస్ హౌస్ లోని ఈతకొలనులోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనమే అయింది. ఇక ఆ తర్వాత షో నుంచి తప్పుకున్న ఓవియా బయటకొచ్చి చికిత్స తీసుకోవడం బాగానే ఉన్నా.. చేసిన పనికి ఊహించని విధంగా చిక్కులో పడటం మాత్రం కొత్తగా ఉంది.
ఇంతకూ మేటర్ ఏంటంటే, ఓవియా ఘటనపై తాజాగా ఓ సమాజ సేవకుడు పూందమల్లి నజరత్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడని సమాచారం. ఈ సందర్బంగా సదరు వ్యక్తి.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కొన్ని రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలని ప్రసారం అవుతున్న కార్యక్రమాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టీఆర్ఫీ రేటింగ్స్ పెంచుకునేందుకు ప్రజల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలను ప్రసారం చేస్తోన్న సదరు సంస్థలపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఓవియా ఆత్మహత్యాయత్నంపై కూడా విచారణ చేపట్టాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెబుతున్నారు. దీంతో విచారణకు సంబంధించి నేరుగా పోలీస్ స్టేషన్ కు హాజరవ్వాలని ఓవియాకు పోలీసులు సమన్లు జారీ చేశారని కోలీవుడ్ మీడియా చెప్పుకొచ్చింది. మరి ఈ కేసు ఈ లెక్కన ఓవియాను ఇంకెన్ని ఇబ్బందుల్లో పడేస్తుందో.. దీనికి ఓవియా ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.