దీపిక చంపేంత పాపం ఏం చేసింది..?

ఓ సినిమాలో న‌టిస్తే చంపేస్తారా..? ఇండ‌స్ట్రీలో క‌ళాకారుల‌కు ఉండే గౌర‌వం ఇంతేనా..? అందులోనూ ఆడ‌పిల్లపై ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడేస్తారా..? ఆ సినిమాలో నటించినంత మాత్రానా చంపేసి.. త‌ల తీసుకొస్తే 5 కోట్లు ఇస్తాం అంటూ ప్ర‌క‌టించ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజసం..? ఇప్పుడు ప‌ద్మావ‌తిపై జ‌రుగుతున్న ర‌చ్చ‌పై వినిపిస్తున్న క‌మెంట్స్ ఇవే. అరే.. ఇంకా సినిమా విడుద‌ల కానేలేదు.. అందులో ఏముందో ఎవ‌రికి మాత్రం ఏం తెలుసు..? ఓ వైపు ద‌ర్శ‌కుడు.. హీరోయిన్ నెత్తినోరు మొత్తుకుంటున్నారు.. త‌మ సినిమాలో అభ్యంత‌రక‌ర స‌న్నివేశాలేవీ లేవు అని. కానీ వినేవాళ్లే లేర‌క్క‌డ‌. ఎంత‌సేపూ వాళ్ల ర‌చ్చ వాళ్లదే కానీ ప‌క్కోడు ఏం చెప్తున్నాడ‌ని వినే అవ‌కాశం కూడా ఇవ్వ‌ట్లేదు.

ఆ మ‌ధ్య కర్ణిసేన సమితి సభ్యులు ఏకంగా ప‌ద్మావ‌తి సెట్ కు వ‌చ్చి త‌గ‌ల‌బెట్టి వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు వాళ్లే దీపికా ముక్కు కోసేస్తామంటూ ఓ వార్నింగ్ ఇచ్చేసారు. ఇక ఇప్పుడు క‌నీసం ఊహ‌కు కూడా అంద‌ని రీతిలో వాళ్లు ఏకంగా మీడియా ముందే వాళ్ల క్ష‌త్రియ నాయ‌కుడు ఠాకూర్ లీడర్ అభిషేక్ సోమ్ వార్నింగ్ ఇచ్చాడు. ఏ క్షత్రియ కులపు యువకుడైనా దీపికా పదుకొనేని చంపేస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పాడు. దాంతో ఈ వార్త బాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Padmavati Controversy Censor Board
పద్మావతి సినిమాను ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ కానివ్వమని చెబుతున్నారు. దీపిక‌తో పాటు భ‌న్సాలీ త‌ల కూడా తీసుకుర‌మ్మ‌ని చెబుతున్నారు వాళ్లు. ఇక ఇప్పుడు సెన్సార్ స‌భ్యులు కూడా ప‌ద్మావ‌తికి షాక్ ఇచ్చారు. ఈ చిత్ర సెన్సార్ స‌ర్టిఫికేట్ అప్లికేష‌న్ అసంపూర్తిగా ఉంద‌ని.. దాన్ని పూర్తి చేసి తీసుకురావాల‌ని సెన్సార్ కు వ‌చ్చిన సినిమాను తిరిగి వెన‌క్కి పంపేసారు. మ‌రోవైపు విడుద‌ల తేదీ డిసెంబ‌ర్ 1 ద‌గ్గ‌రికి వ‌చ్చేస్తుంది. ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే ఈ చిత్రం అనుకున్న స‌మ‌యానికి వ‌చ్చేలా క‌నిపించ‌ట్లేదు. మొత్తానికి ఒక్కోసారి సినిమా తీయ‌డ‌మే కాదు.. దాన్ని రిలీజ్ చేసుకోడానికి కూడా చుక్క‌లు క‌నిపిస్తుంటాయి. ఈ చుక్క‌లు భ‌న్సాలీ ఇంటికి రెగ్యుల‌ర్ చుట్టాలు.