దారుణం.. ప‌ద్మావ‌తి ట్రైల‌ర్ కే ఇలా..?

ప‌ద్మావ‌తి.. ఇప్పుడు దేశంలో ఈ సినిమా కంటే ట్రెండింగ్ మ‌రోటి లేదేమో..? ఫ‌్రీ ప‌బ్లిసిటీ అంటారు క‌దా.. దానికి అమ్మ‌మ్మ‌లా మారింది ప‌ద్మావ‌తి ఇప్పుడు. వేరే ప‌నేది పెట్టుకోకుండా కేవ‌లం ఈ చిత్రాన్ని నాశ‌నం చేయ‌డానికే కొంద‌రు కంక‌ణం క‌ట్టుకున్నారు. విడుద‌ల కానీయ‌కుండా అడ్డుప‌డుతున్నారు. వీళ్ల‌కు ప్ర‌భుత్వాలు కూడా స‌పోర్ట్ చేస్తుండ‌టమే ఇక్క‌డ అస‌లు దారుణం. ఇప్ప‌టికే రాజ‌స్థాన్ సిఎం వ‌సుంధ‌రా రాజే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్.. పంజాబ్ సిఎం అమ‌రీంద‌ర్ సింగ్.. జ‌మ్మూకాశ్మీర్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లాంటి చోట్ల ప‌ద్మావ‌తిని విడుద‌ల చేయ‌కూడ‌దంటూ అల్టిమేటం జారీచేసారు. ఈ చిత్రంలో చ‌రిత్రను వక్రీక‌రించే స‌న్నివేశాలు ఉన్నాయంటూ గోల చేస్తున్నారు క‌ర్ణిసేన‌.. క్ష‌త్రియ‌సంఘాలు.

వీళ్ల కోపం ఏ స్థాయిలో ఉందో చెప్ప‌డానికి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో జ‌రిగిన చిన్న సంఘ‌ట‌నే నిద‌ర్శ‌నం.
అక్క‌డ ఓ థియేట‌ర్ లో అనుకోకుండా సినిమా మ‌ధ్య‌లో పద్మావతి ట్రైలర్ ప్రదర్శించారు. దాంతో ఆ సమాచారం అందుకున్న కర్ణిసేన కార్యకర్తలు ఆ థియేటర్ దగ్గరికి వచ్చి.. స్క్రీన్ ను చింపి వేయ‌డ‌మే కాకుండా.. అక్క‌డ ఉన్న ప్ర‌తీ వ‌స్తువును ధ్వంసం చేసారు. థియేట‌ర్ యాజ‌మాన్యం చేయ‌ని త‌ప్పుకు బ‌లైపోయింది. ఏదో అనుకోకుండా సినిమా మ‌ధ్య‌లో ఓ ట్రైల‌ర్ ప్ర‌ద‌ర్శిస్తేనే రియాక్ష‌న్ ఇలా ఉంటే.. ఇక సినిమా విడుదలైతే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో క‌నీసం ఊహ‌కు కూడా అంద‌డం లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబ‌ట్టే త‌మ రాష్ట్రాల్లో సినిమాను ఆపేయాలంటూ కోరుతున్నారు ముఖ్య‌మంత్రులు. మ‌రి అంతా ఇలాగే చేస్తే సంజ‌య్ లీలా భ‌న్సాలీ ఏమైపోవాలి.. ఆయ‌న తీసిన సినిమా ఎలా ఉందో చూడ‌కుండా ఇలా అడ్డుకోవడం ఎంత‌వర‌కు స‌మంజ‌సం..?