మొత్తానికి ప‌ద్మావ‌తిని తొక్కేసారు..

భావ స్వాతంత్ర్య హ‌క్కు ఉందంటారు.. ఎక్క‌డుంది అది.. భూతద్దం వేసి వెతికినా అది క‌నిపించేలా క‌న‌బ‌డ‌ట్లేదు. లేక‌పోతే మ‌రేంటి..? ఓ ద‌ర్శ‌కుడు ఏళ్ల‌కేళ్లు క‌ష్ట‌ప‌డి చేసిన సినిమాను అడ్డంగా ఆపేసారు. సెన్సార్ పూర్తి కావాల్సిన సినిమాను ప్ర‌భుత్వం కూడా దగ్గ‌రుండి పీక మీద క‌త్తి పెట్టి మ‌రీ విడుద‌ల ఆపేసారు. ఆ బాధితుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ.. బ‌లైపోయిన సినిమా ప‌ద్మావ‌తి. డిసెంబ‌ర్ 1 నుంచి సినిమా వాయిదా ప‌డిపోయింది. కొత్త విడుద‌ల తేదీని త్వ‌ర‌లోనే అనౌన్స్ చేస్తామంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ పాపం ఎవ‌రితో తెలియ‌దు కానీ అన్యాయం అయిపోయింది మాత్రం భ‌న్సాలీ అండ్ టీం.

రాణి పద్మిని దేవి జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రంపై రాజ్ పుత్ కర్ణి సేన నుంచి బెదిరింపులు కూడా వస్తున్న సంగతి తెలిసిందే.
ఆ సినిమా విడుదలైతే ఉత్తర ప్రదేశ్ లో శాంతి భద్రతల విఘాతం కలుగుతుందని సాక్షాత్తూ ఆ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి.. కేంద్రానికి లేఖ రాశారు. ఆ చిత్రంలో రాణి పద్మిని దేవిని కించపరిచేలా ఉన్న సన్నివేశాలు తొలగించేవరకు విడుదలను ఆపాలని రాజస్థాన్ సీఎం వసుంధర రాజే.. కేంద్ర‌ సమాచార ప్రసారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. విడుద‌ల‌కు ముందే ఈ చిత్రాన్ని చూసేలా ప్రముఖ చ‌రిత్ర‌కారులు, ప‌లువురు సినీ ప్రముఖులు, రాజ్ పుత్ వర్గ ప్రముఖులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాదు సినిమా చూసిన త‌ర్వాత వాళ్ల‌తో చ‌ర్చించి అవ‌స‌ర‌మైన మార్పులు చేయాల్సిందిగా ఆ లేఖ‌లో కోరారు. సెన్సార్ బోర్డు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని విడుదల తర్వాతి పర్యవసానాల్ని దృష్టిలో ఉంచుకుని పద్మావతిని రీసెన్సార్ చేయాలని రాజస్థాన్ సర్కార్ కోరుకుంటోంది.

ప‌ద్మావ‌తి ర‌చ్చ గురించి తెలిసి.. ఆ చిత్ర నిర్మాణంలో భాగ‌స్వామి అయిన వయకామ్18 ప్రతినిధి ఒకరు విడుద‌ల‌ను అధికారికంగా ఆపిన‌ట్లు ప్ర‌క‌టించారు. రాజ్ పుత్ ల రాజసం, గౌరవం ఇంకా పెరిగేలా.. ప‌ద్మావ‌తి దేవీ ప్ర‌తిష్ట పెంచేలా ఈ చిత్రాన్ని భ‌న్సాలీ తెర‌కెక్కించార‌ని.. ఏ వ‌ర్గాన్ని కించ‌ప‌రిచే ఉద్దేశం త‌మ‌కు లేద‌ని చెప్పారు నిర్మాత‌లు. త్వరలోనే ఆ చిత్ర విడుదలకు అవసరమైన అన్ని అనుమతులు లభిస్తాయనే న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌న్నారు. అడ్డంకులు తొలగిపోయాక త్వరలోనే ఆ చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు. మొత్తానికి పాము ప‌గ కంటే మ‌నిషి ప‌గ బ‌డితే చాలా డేంజ‌ర్ అని ఇప్పుడు ప‌ద్మావ‌తి సినిమాతో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డుతుంది.

Follow US