రివ్యూ: ప‌లాస 1978

Review & Rating : Palasa 1978 Movie Review

న‌టీన‌టులు: రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ త‌దితరులు
సాంకేతిక‌వ‌ర్గం:

పాటలు: భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల,

కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు,

ఛాయాగ్ర‌హ‌ణం: అరుల్ విన్సెంట్,

సంగీతం : రఘు కుంచె,

స‌మ‌ర్ప‌ణ‌: త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌,

నిర్మాత : ధ్యాన్ అట్లూరి, రచన-

దర్శకత్వం : కరుణ కుమార్.

సంస్థ‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌

విడుద‌ల తేదీ: 6 మార్చి 2020

ముందుమాట‌

`రా`గా… రియ‌లిస్టిక్‌గా సాగే సినిమాల‌కి పెట్టింది పేరు త‌మిళ చిత్ర‌సీమ‌. పా.రంజిత్‌, వెట్రిమార‌న్‌లాంటి ద‌ర్శ‌కులు ఈమ‌ధ్య ఆ త‌ర‌హా క‌థ‌ల్ని అగ్ర క‌థానాయ‌కులతో క‌లిసి తెర‌కెక్కిస్తూ విజ‌యాల్ని అందుకుంటున్నారు. తెలుగులో అలాంటి సినిమాల ఉధృతి ఈమ‌ధ్యే క‌నిపిస్తోంది. అందులో భాగంగా వ‌చ్చిన మ‌రో ప్ర‌య‌త్న‌మే `ప‌లాస 1978`. విడుద‌ల‌కి ముందే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఈ సినిమాని చూసి మెచ్చుకున్నారు. మంచి ప్ర‌చారం పొందిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.

క‌థ‌

ప‌లాస‌లో అన్న‌ద‌మ్ములైన పెద్ద‌షావుకారు (జ‌నార్ధ‌న్‌), చిన్న షావుకారు (ర‌ఘు కుంచె) ఆధిప‌త్యం కోసం ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటుంటారు. వీళ్ల రాజ‌కీయ చ‌ద‌రంగానికి అన్న‌ద‌మ్ములైన మోహ‌న్‌రావు (ర‌క్షిత్‌), రంగారావు (తిరువీర్‌) పావులుగా మారుతారు. క‌ళాకారుల కుటుంబానికి చెందిన ఈ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ఆధిప‌త్య పోరులోకి ఎలా ప్ర‌వేశించారు? ఆ త‌ర్వాత వాళ్ల జీవితాల్లో ఎలాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌

గ్రామాల్లో ఇప్ప‌టికీ క‌నిపించే కుల‌, వర్గాల మ‌ధ్య తార‌త‌మ్య‌త‌ని ఆవిష్క‌రించే క‌థ ఇది. నిజానికి ఇదొక డాక్యుమెంట‌రీ క‌థ‌. ద‌ర్శ‌కుడు తెలివిగా సినిమాకి త‌గ్గ వాణిజ్యాంశాల్ని జోడించి దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఆధిప‌త్య పోరుతో ఎన్నో క‌థ‌లొచ్చాయి. రాష్ట్రాలు, దేశాల్ని ప్ర‌భావితం చేసే నాయ‌కుల క‌థ‌ల్ని కూడా చూశాం. అలాంటిది గ్రామ‌స్థాయిలో నాయ‌కుల పోరులో ఎంత సంఘ‌ర్ష‌ణ ఉంటుంది? ద‌ర్శ‌కుడు మ‌న ఊళ్ల‌లోని కొన్ని జీవితాలు గుర్తుకొచ్చేంత సంఘ‌ర్ష‌ణ‌, మ‌న స‌మాజం క‌ళ్ల‌ముందు క‌నిపించేంత అనుభూతిని ఈ సినిమాలోకి తీసుకొచ్చాడు. అధికారం కోసం ఎవ‌రెన్ని కుయుక్తులు చేస్తుంటారు? ఎవ‌రి జీవితాలు ఎలా బ‌లి అవుతుంటాయో ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఒక పాఠంలాంటి సినిమా ఇది. ఒక గుణ‌పాఠంలాంటి క‌థ ఇది. అంబేడ్క‌రిజం భావాల్ని చాటి చెబుతుంది. స‌మాజానికో చ‌క్క‌టి సందేశం ఇస్తుంది. అలాగ‌ని ఎక్క‌డా సందేశం కోసం ప్ర‌సంగాలు వినిపించ‌వు. మ‌నిషి త‌నం ఉన్న ప్ర‌తి మనిషికీ న‌చ్చే సినిమా ఇది. క‌థ‌లో భాగంగానే హాస్యాన్ని జోడించారు. సందేశం కూడా క‌థ‌లో భాగమే. ఇంట‌ర్వెల్ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు, ప‌తాక స‌న్నివేశాలు చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. కాక‌పోతే ఇలాంటి క‌థ‌లు ఎంత‌మందికి న‌చ్చుతాయ‌నేది చూడాలి. కుటుంబ ప్రేక్ష‌కుల్ని మెప్పించే అంశాలు లేక‌పోవ‌డం ఈ సినిమాకి మైన‌స్‌గా మారింది. స‌హ‌జ‌త్వం పేరిట కొన్ని సంభాష‌ణ‌ల్ని `రా`గానే ప‌లికించాడు ద‌ర్శ‌కుడు. అది అంద‌రికీ మింగుడుప‌డ‌వు. పైగా నాలుగు ద‌శల్లో సాగే ఈ సినిమాలో కాలం మారుతుంటుంది కానీ… తెర‌పై క‌నిపించే పాత్ర‌ల్లో మాత్రం మార్పు కనిపించదు. కొంచెం కొంచెం గ‌డ్డాలు పెరుగుతుంటాయంతే. ర‌ఘు కుంచెపాత్ర‌లోనే కొంచెం మార్పు కనిపిస్తుంటుంది. సినిమాటిక్ లిబ‌ర్టీస్ మ‌రీ ఎక్కువ‌గా తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు. మోహ‌న్‌రావుని ఎన్‌కౌంట‌ర్ చేయాల్సిన పోలీసు అత‌న్ని త‌ప్పిస్తే, మ‌రి ఆ స్థానంలో ఎవ‌రి బాడీని చూపించిన‌ట్టు? పోలీసులు ఒక నేర‌స్థుడిని అంత సుల‌భంగా త‌ప్పిస్తారా? ఎన్‌కౌంట‌ర్ అయ్యాక శ‌వాన్ని స్వాధీనం చేసుకోవ‌డం, శ‌వ పంచ‌నామా ఇలాంటివేవీ ఉండ‌వా? ఇలా లాజిక్‌లేని స‌న్నివేశాలు చాలానే క‌నిపిస్తాయి.

నటీన‌టులు.. సాంకేతిక‌త

నాలుగు దశల్లో సాగే ఈ కథలో ప్రతి నటుడు కథలో ఒదిగిపోయారు. ఆ పాత్రల్లా ప్రవర్తించారు. ఆ క్రెడిట్ ఖచ్చితంగా దర్శకుడిదే. హీరోగా నటించిన రక్షిత్ ఆక‌ట్టుకున్నాడు. \జార్జిరెడ్డి ఫేమ్ తిరువీర్ పాత్ర, నటనా.. అనన్యసామాన్యం. విలన్ గా నటించిన పాత్రధారి.. గ్రామీణ అగ్రకుల నాయకుడుగా అచ్చంగా సరిపోయారు. రఘు కుంచె నటుడుగా ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాడు. ప్రొఫెషనల్ యాక్టర్ గా అదరగొట్టాడు. అయితే రఘు కుంచెలో ఎంత గొప్ప సంగీత దర్శకుడు ఉన్నాడో ఈ సినిమా తర్వాత మరోసారి ‘సినిమావాళ్లకు’ తెలుస్తుంది. ఆర్ఆర్ చాలా బాగుంది. విన్సెంట్ సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. కథ మూడ్ ను ఏ మాత్రం తగ్గించుకుండా పరిమిత లైటింగ్ తోనే ఆక‌ట్టుకునేలా స‌న్నివేశాల్ని తీర్చిదిద్దాడు. దర్శకుడు కరుణకుమార్ తెలుగు సినిమా స్థాయిని పెంచే సత్తా ఉన్నవాడని ఈ సినిమా చూశాక అర్థ‌మ‌వుతుంది.

Rating: 2.5/5

ఫైన‌ల్‌గా…

మ‌నిషి జీవితాల్లోంచి పుట్టిన క‌థ ఇది. మ‌న స‌మాజాన్ని ప్ర‌తిబింబించే క‌థ. క‌థ‌, క‌థ‌నం, మాట‌లతో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. కొన్ని స‌న్నివేశాలు మాత్రం ప్రేక్ష‌కుల ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా సాగ‌డం సినిమాకి మైన‌స్ అని చెప్పొచ్చు.కుటుంబ ప్రేక్ష‌కుల్ని ఆకర్షించే అంశాలు లేక‌పోవ‌డం, మ‌రోప‌క్క క‌రోనా ప్ర‌భావం.. వీటిమ‌ధ్య ఈ సినిమా నెట్టుకురావ‌డం క‌ష్టమైన విష‌య‌మే.