పందెంకోడి ఎమ‌ర్జెన్సీ ఏంటో?

`పందెంకోడి 2` చిత్రంతో ఈ ద‌స‌రాని క్లీన్ స్వీప్ చేసే యోచ‌న‌తో ఉన్నాడు హీరో విశాల్. అభిమ‌న్యుడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత తెలుగు, త‌మిళ్‌లో త‌న కెరీర్‌ని మ‌రో లెవ‌ల్‌కి తీసుకెళ్లాల‌న్న క‌సితో ఉన్నాడు విశాల్. ఆ క్ర‌మంలోనే లింగుస్వామి, ఠాగూర్ మ‌ధు వంటి స్టార్ ప్రొడ్యూర్ల‌తో క‌లిసి విశాల్ పిలింఫ్యాక్ట‌రీ సంస్థ‌లో `పందెంకోడి` సీక్వెల్‌ని తెర‌కెక్కించి రిలీజ్ చేస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 18న ఈ చిత్రం రిలీజ‌వుతోంది. ఆ క్ర‌మంలోనే ఓవైపు త‌మిళ వెర్ష‌న్ బిజినెస్ వ్య‌వ‌హారాలు, తెలుగు వెర్ష‌న్‌ బిజినెస్ వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెడుతూనే, మ‌రోవైపు ఇరు రాష్ట్రాల్లోనూ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ల‌తోనూ బిజీబిజీగా ఉన్నాడు.

అప్ప‌టిక‌ప్పుడే చెన్న‌య్ వెళుతున్నాడు. అప్ప‌టికప్పుడే హైద‌రాబాద్‌లో ల్యాండ్ అవుతున్నాడు. ఇక్క‌డా, అక్క‌డా మీడియాలో క‌నిపిస్తున్నాడు. ఇదివ‌ర‌కూ ద‌స‌పల్లాలో ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం విచ్చేసిన విశాల్ నేడు మ‌రోసారి తెలుగు మీడియాకి ఇంట‌ర్వ్యూలు ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్నాడు. అయితే అనూహ్యంగా అత‌డు చెన్న‌య్ వెళ్లాల్సి రావ‌డంతో, ఇంట‌ర్వ్యూ క్యాన్సిల్ అయ్యింది. దీంతో నిర్మాత ఠాగూర్ మ‌ధు రంగంలోకి దిగి మీడియాకి ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. అయితే విశాల్ అంత ఎమ‌ర్జెన్సీతో చెన్న‌య్ వెళ్ల‌డానికి కార‌ణ‌మేంటి? అంటే .. విశాల్ బిజీమ్యాన్. ఓవైపు హీరోగా, నిర్మాత‌గా బిజీ. మ‌రోవైపు త‌మిళ నిర్మాతల మండ‌లి వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెడుతున్నాడు. అక్క‌డ ఏదో అత్యవ‌స‌ర మీటింగ్ షురూ అయ్యి రావాల్సిందిగా పిలుపు వ‌చ్చింది. దీంతో అక్క‌డికి వెళ్లాల్సొచ్చింద‌ని తెలిపారు. విశాల్ అంద‌రివాడు.. అందుకే అత‌డికి నిరంత‌రం ఎమ‌ర్జెన్సీ త‌ప్ప‌ద‌ని అన్నారు. పందెంకోడి 2 ఈ ద‌స‌రా పండ‌క్కి అద్భుత‌మైన విజ‌యం సాధిస్తుంద‌ని మ‌ధు అన్నారు. సీక్వెల్ సినిమాల‌పై ఉన్న ఆస‌క్తితో ఈ చిత్రానికి జ‌నాద‌రణ అద్భుతంగా ఉంటుంద‌ని ఆశిస్తున్నాన‌ని అన్నారు. మంచి హిట్టు కొట్టే సినిమాల‌కు సీక్వెల్స్ తీయ‌డం, ఫ్రాంఛైజీలు న‌డిపించ‌డం పెద్ద‌గా క‌లిసొస్తుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.