పార్కింగ్ ఫీ దోపిడీ వంద‌ల కోట్లు!

Last Updated on by

థియేట‌ర్‌కి వెళితే టిక్కెట్టు మోత మాటేమో కానీ, అద‌న‌పు మోత గురించే సామాన్యుడు త‌ల్ల‌డిల్లిపోయే స‌న్నివేశం ఉందిప్పుడు. ఇంటిల్లిపాదీ సినిమా చూడాలంటే మినిమం రూ.3000-5000 పెట్టాల్సిన స‌న్నివేశం ఉంది. ఇలాంటి క‌ష్టానికి మ‌ల్టీప్లెక్సులు, థియేట‌ర్ల‌లో పార్కింగ్ ఫీజు అద‌నం. అయితే దానికంటూ ఒక హ‌ద్దు ఉంటే బావుండేది. హైదరాబాద్ లాంటి మెట్రో న‌గ‌రాల్లో దోచుకున్న‌వాడికి దోచుకున్నంత‌. గంట గంట‌కు లెక్క క‌ట్టి య‌థేచ్ఛ‌గా దోపిడీ దందా సాగించేస్తున్నారు. ఈ తీరుగా హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌ల్టీప్లెక్సులు సాగించిన దోపిడీ కొన్ని వంద‌ల‌ కోట్లు.

ఈ దందాను కాస్త లేటుగా గ్ర‌హించిన తెలంగాణ ప్ర‌భుత్వం ఒక్క ఉదుటున పార్కింగ్ ఫీజును ర‌ద్దు చేసింది. ప‌బ్లిక్ నిరంత‌ర ప్ర‌యాణాల్లో మ‌ల్టీప్లెక్సులు స‌హా థియేట‌ర్ల‌లో పార్కింగులు త‌ప్ప‌నిస‌రి. ఇదే అద‌నుగా దానిని ప‌లువురు థియేట‌ర్ల య‌జ‌మానులు వ్యాపారం చేసేశారు. ఇష్టానుసారం టిక్కెట్టు ధ‌ర పెట్టి పార్కింగ్ పేరుతో ముక్కు పిండేశారు. అయితే ఈ జుర్రుడుకు ఉన్న‌ట్టుండి బ్రేక్ వేయ‌డంతో అస‌లు థియేట‌ర్ యాజ‌మాన్యాలు త‌ట్టుకోలేక‌పోతున్నాయి. పాపం పార్కింగ్ ఫీజును తిరిగి పున‌రుద్ధ‌రించాల్సిందిగా థియేట‌ర్ య‌జ‌మానులంతా మూకుమ్మ‌డిగా ప్రెస్‌మీట్ పెట్టి చెప్ప‌డం చూసేవాళ్ల‌కే కామెడీ అనిపించింది. పైగా న‌క్క‌కు నాగలోకానికి లంకె వేస్తూ వీళ్లు ఇచ్చిన వివ‌ర‌ణ అంతే షాకింగ్‌గానూ ఉంది. తెలంగాణ‌లో 852 థియేట‌ర్లు ఉంటే అందులో స‌గం మూత ప‌డిపోయాయి. అంటే 400కు చేరుకుంది సంఖ్య‌. 30 మ‌ల్టీప్లెక్సుల్లో 130 స్క్రీన్లు ఉన్నాయి. ఇవ‌న్నీ క‌లిపి మొత్తం 530 స్క్రీన్లు అన్న‌మాట‌! ఇన్ని థియేట‌ర్ల నుంచి పార్కింగ్ ఫీ లేక‌పోవ‌డంతో ఆదాయానికి బొక్క ప‌డిపోయింద‌ని ల‌బ‌ల‌బ కొట్టుకున్నారు. ఇన్నాళ్లు సాగించిన నిలువుదోపిడీలో కోట్ల‌కు కోట్లు క‌ళ్ల జూడ‌డంతోనే వీళ్ల‌కు పాపం అలా బాధ క‌లిగేస్తోంద‌న్న‌మాట‌! మ‌ల్టీప్లెక్సుల పేరుతో గంట గంట‌కు బిల్లు బాదుతూ వీళ్లు సాగించిన ఆట ఓ రేంజులోనే వ‌ర్క‌వుట‌వ్వ‌డంతో ఇప్పుడు ఒక్క‌సారిగా అంత పెద్ద మొత్తానికి చిల్లు ప‌డిపోవ‌డం గుండె పిండేస్తోంది. ఇంత‌కీ పార్కింగ్ ఫీ తీసేయ‌డం వ‌ల్ల న‌ష్ట‌పోతున్న పేద‌లెవ‌రో తెలిస్తే షాక్ తిని కుడితిలో ప‌డిన ఎల‌క‌లా గిల‌గిలా కొట్టుకుంటారు. ఈ ప్ర‌ముఖుల్లో ఏషియ‌న్ సునీల్ నారంగ్ (తెలంగాణ ఛాంబ‌ర్ కార్య‌ద‌ర్శి), గోకుల్ థియేట‌ర్ అశోక్ యాద‌వ్‌, తెలంగాణ ఛాంబర్ అధ్య‌క్షుడు ముర‌ళీమోహ‌న్ వంటి పేద‌లు ఉన్నారు. వీళ్లంతా ప్రెస్‌మీట్ పెట్టి కార్చిన క‌న్నీళ్ల‌తో రెండు క‌డ‌వ‌లే నిండిపోయాయంటే న‌మ్మండి!! ఇక‌పోతే ఈ పేద‌ల‌తో క‌లిసి డి.సురేష్‌బాబు, దిల్‌రాజు లాంటి అగ్ర‌నిర్మాతలు కం థియేట‌ర్ ఓన‌ర్లు క‌నిపించ‌క‌పోవ‌డం కొస‌మెరుపు.

User Comments