Pawan Agnyathavaasi Telugu movie Review - Agnyathavaasi rating

అజ్ఞాత‌వాసి రివ్యూ

Pawan Agnyathavaasi Telugu movie Review

రివ్యూ: అజ్ఞాత‌వాసి 
న‌టీన‌టులు: ప‌వ‌న్ క‌ళ్యాణ్, కీర్తిసురేష్, అను ఎమ్మాన్యువల్, ముర‌ళి శ‌ర్మ‌, బోమ‌న్ ఇరానీ.. 
సంగీతం: అనిరుధ్ ర‌విచంద్ర‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌ణికంద‌న్
నిర్మాత‌: రాధాకృష్ణ 
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: త‌్రివిక్ర‌మ్ 
అజ్ఞాత‌వాసి.. అజ్ఞాత‌వాసి.. ఈ ఫీవ‌ర్ తోనే ఊగిపోతున్నారు ప‌వ‌న్ ఫ్యాన్స్. ఎక్క‌డ విన్నా ఇప్పుడు ఇదే పేరు వినిపిస్తుంది. పైగా ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాసిన కాంబినేష‌న్ కావ‌డంతో ఈ చిత్రంపై ఎక్క‌డ‌లేని అంచ‌నాలు వ‌చ్చేసాయి. మ‌రి నిజంగానే అజ్ఞాత‌వాసి అంద‌రి తాట తీసాడా.. సినిమా ఎలా ఉంది..?

క‌థ‌:
గోవింద భార్గ‌వ ఎకా విందా (బోమ‌న్ ఇరానీ) వేల కోట్ల‌కు అధిప‌తి. ఒక్క‌డే స్టార్ట్ కొన్ని వేల కోట్ల సంపాదిస్తాడు. అలాంటి ఆయ‌న ఆస్తుల‌పై క‌న్నేస్తారు అత‌డి స్నేహితులు. ఆస్తి కోసం ఆయ‌న్ని చంపేస్తారు. దాంతో ఆయ‌న్ని చంపిన వాళ్ల‌ను చంప‌డానికి అజ్ఞాతంలో ఉన్న ఆయ‌న వార‌సుడు అభిషిక్త్ భార్గవ్(ప‌వ‌న్ క‌ళ్యాణ్) రంగంలోకి దింపుతుంది వింధా రెండో భార్య ఇంద్రాణి (ఖుష్బూ). వ‌చ్చీ రాగానే త‌న కంపెనీలో తాను ఎంప్లాయ్ గా చేర‌తాడు. అప్ప‌ట్నుంచీ వ‌ర్మ‌, శ‌ర్మ‌(ముర‌ళీ శ‌ర్మ‌, రావుర‌మేష్) ల‌తో ఆడుకుంటాడు. ఆ త‌ర్వాత తండ్రిని చంపింది వాళ్లు కాద‌ని తెలుసుకుంటాడు. అస‌లు మ‌నిషి మ‌రొక‌రు అని తెలుస్తుంది. అత‌డే సీతారాం(ఆది పినిశెట్టి). అస‌లు ఎందుకు చంపారు..? అభి వ‌చ్చి ఎలా ప‌గ తీర్చుకున్నాడు అనేది అస‌లు క‌థ‌.

క‌థ‌నం: 
అజ్ఞాత‌వాసి.. ఇప్పుడు ఇది త‌ప్ప మ‌రే సినిమా ప‌వ‌న్ అభిమానులకు కానీ.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కానీ క‌నిపించ‌ట్లేదు. రికార్డ్ ఓపెనింగ్స్ వైపుగా ఈ చిత్రం అడుగేస్తుంది. కానీ సినిమా ప‌రంగా మాత్రం అభిమానుల‌కే కాదు.. ప్రేక్ష‌కుల‌కు కూడా అజ్ఞాత‌వాసి అనుకున్నంత‌గా మెప్పించ‌లేక‌పోయాడేమో అనిపించింది. త్రివిక్ర‌మ్ గ‌త సినిమాల‌తో పోలిస్తే ఇందులో ఆ మ్యాజిక్ మిస్ అయిపోవ‌డం ఖాయం. ఎందుకంటే ఎక్క‌డా ఆ మార్క్ క‌నిపించ‌దు.. పంచ్ డైలాగులు లేవు.. ఏదో స‌ర‌దా కోసం తీసిన‌ట్లుగా అనిపించింది కానీ సీరియ‌స్ గా ప‌వ‌న్ చేసిన సినిమా 25వ సినిమాలా అనిపించ‌లేదు. ఓ యాక్సిడెంట్.. మ‌ర్డ‌ర్ తో సినిమాను మొద‌లుపెట్టి ఆస‌క్తి రేకెత్తించాడు త్రివిక్ర‌మ్. త‌ర్వాత ఆ టెంపో కొన‌సాగించ‌లేకపోయాడు. క‌థ‌ను ముందుకు తీసుకెళ్ల‌డానికి కామెడీ సీన్స్ అల్లుకున్నాడు త్రివిక్రమ్. హీరోయిన్ల‌తో ఈయ‌న రాసుకున్న సీన్స్ అన్నీ అనుకున్నంత‌గా మెప్పించ‌లేదు. ఆఫీస్ లో వ‌చ్చే ఫ‌న్నీ సీన్స్ కొన్ని ప‌ర్లేద‌నిపిస్తాయి. అక్క‌డ ప‌వ‌న్ త‌న కామెడి టైమింగ్ తో న‌వ్వించాడు. ఇక ఫ‌స్టాఫ్ మొత్తం ముర‌ళి శ‌ర్మ‌, రావు ర‌మేష్ కామెడీతో న‌వ్వించారు. సినిమాకు వాళ్లు చాలా ప్ల‌స్ అయ్యారు. రిలీఫ్ ఇచ్చారు కూడా. ఇంట‌ర్వెల్ బ్యాంగ్ కు ముందు క‌థ‌లో సీరియ‌స్ నెస్ వ‌స్తుంది. ఊహించిన ట్విస్ట్ తోనే సినిమాకు ఇంట‌ర్వెల్ కార్డ్ వేసాడు ద‌ర్శ‌కుడు.

సెకండాఫ్ లో కూడా క‌థ నెమ్మ‌దిగానే సాగుతుంది. క‌థ ఎటు వైపు వెళ్తుందో తెలుసుకోడానికి అప్పుడ‌ప్పుడూ ఖుష్బూను చూపించాడు ద‌ర్శ‌కుడు. ఆఫీస్ సీన్ లో సైకిల్ ఎక్కించి ప‌వ‌న్ చేసిన రౌడీఅల్లుడు స్పూఫ్ సీన్ ఆక‌ట్టుకోలేదు. అత్తారింటికి దారేది లాంటి సింపుల్ క‌థ‌ను అంత అందంగా చూపించిన త్రివిక్ర‌మ్.. ఈసారి మాత్రం అదే మ్యాజిక్ చేయ‌లేక‌పోయాడు. అస‌లు ఈ చిత్రం తెర‌కెక్కించింది త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాసా అనే అనుమానం రాక మాన‌దు. అది ప‌వ‌న్ లోప‌మా.. లేదంటే త్రివిక్ర‌మ్ మెప్పించ‌లేక‌పోయాడా అనేది వాళ్లిద్ద‌రికే తెలియాలి. కానీ కాంబినేష‌న్ పై అంచ‌నాలు పెట్టుకుని వెళ్లిన అభిమానుల‌కు మాత్రం అజ్ఞాత‌వాసి కోలుకోలేని షాక్ ఇచ్చాడు.
నటీన‌టులు:
పాతిక సినిమాల అనుభ‌వం ఉన్న న‌టుడు బాగా చేసాడు.. న‌టించాడు అని చెప్ప‌డం అవివేకం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎప్ప‌ట్లాగే త‌న యాక్టింగ్ చేసాడు. నిజానికి చాలా సీన్స్ ఈయ‌నే నిల‌బెట్టాడు కూడా. కానీ క‌థ స‌హ‌క‌రించ‌లేదు. అయితే చిన్న పిల్లాడిలా మాట్లాడ‌టం మాత్రం కొన్ని సీన్ల‌కు ప‌రిమితం చేసి ఉంటే బాగుండేది.. అది కాస్త ఎక్కువ అనిపించింది. హీరోయిన్ల గురించి చెప్ప‌డానికి ఏం లేదు. అను ఎమ్మాన్యువ‌ల్ అయితే కేవ‌లం అందాల ఆర‌బోత‌కే ప‌రిమిత‌మైంది. ఇక కీర్తిసురేష్ తొలిసారి క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్ అని నిరూపించుకుంది. ముర‌ళిశ‌ర్మ‌, రావుర‌మేష్ న‌వ్వించారు. వాళ్లే ఈ సినిమాకు పెద్ద రిలీఫ్. బోమ‌న్ ఇరాని చిన్న పాత్రైనా త‌న వంతు పోషించాడు. ఖుష్బూ, ఆది బాగా చేసారు. వాళ్ల పాత్రల నిడివి చాలా చిన్న‌ది. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నిక‌ల్ టీం: 
అత్తారింటికి దారేది సినిమాకు క‌థ‌తో పాటు సంగీతం ప్రాణం. కానీ ఈ చిత్రానికి అదే మైన‌స్. దేవీ లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపించింది. పాట‌లు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. అనిరుధ్ మంచి సంగీత ద‌ర్శ‌కుడే కానీ ఈ చిత్రానికి మాత్రం అనుకున్న స్థాయిలో మ్యూజిక్ ఇవ్వ‌లేదు. ఆర్ఆర్ ఓకే. మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ఎడిటింగ్ చాలా వీక్ అనిపించింది. చాలా సీన్లు బోర్ కొట్టించాయి. అతుకుల బొంత‌లా అనిపించింది సినిమా. ఎక్క‌డో క‌ట్ అయిన సీన్ మ‌రెక్క‌డో క‌నెక్ట్ అయిన‌ట్లు.. స‌డ‌న్ గా జంప్ క‌ట్లు క‌నిపించాయి. ఒకే సీన్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు ర‌కాలుగా క‌నిపిస్తాడు. అంత వీక్ ఎడిటింగ్ అనిపించింది. ఇక త్రివిక్ర‌మ్ గురించి చెప్పుకోవాలి.. ఈ చిత్రం ఎందుకో పూర్తిగా మిస్ ఫైర్ అయిపోయింది. మ‌న‌కు త్రివిక్ర‌మ్ అంటే వెంట‌నే గుర్తొచ్చేది డైలాగ్స్.. అలాంటివి చాలా లిమిటెడ్ గా ఈ చిత్రంలో ఉన్నాయి. ర‌చ‌యిత‌గా అక్క‌డ‌క్క‌డ మెప్పించిన ఈయ‌న‌.. ఎందుకో కానీ ఈ సారి ద‌ర్శ‌కుడిగా మాత్రం పూర్తిగా విఫ‌లం అయ్యాడు.

చివ‌ర‌గా: 

విచ‌క్ష‌ణ‌తో తీస్తే అత్తారింటికి దారేది..
విచ్చ‌ల‌విడిగా తీస్తే అజ్ఞాత‌వాసి..
రేటింగ్: 2.5/5 

అజ్ఞాత‌వాసి రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)