ఇటీవల అక్కినేని మల్టీస్టారర్ .. దగ్గుబాటి మల్టీస్టారర్.. మెగా మల్టీస్టారర్ అంటూ రకరకాలుగా ప్రచారం సాగుతోంది. ఫ్యామిలీ హీరోలతో మల్టీస్టారర్లు తెరకెక్కించేందుకు దర్శకులు కథలు రెడీ చేస్తుండడంతో అదో ట్రెండ్ గా మారుతోంది. గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి- పవన్ కల్యాణ్ మల్టీస్టారర్ గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. అయితే రకరకాల కారణాల వల్ల ఈ కాంబినేషన్ వెంటనే కుదరడం లేదు. అలాగే పవన్-చరణ్ కాంబినేషన్ మూవీ పైనా ఆసక్తికర వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. పవన్ రెడీగా ఉంటే సినిమా నిర్మించేందుకు సిద్ధమని రామ్ చరణ్ ఇంతకుముందు ప్రకటించారు. అలాగే చరణ్ రెడీగా ఉంటే నేను సినిమా నిర్మిస్తాను అంటూ పవన్ కూడా ప్రకటించడం ఆసక్తిని రేకెత్తించింది.
ఆ క్రమంలోనే ఈ ఇద్దరి కలయికలో సినిమా ఉంటుందని అభిమానులు భావించారు. అయితే ఆ సినిమా ఎప్పుడు..? అన్నదానికి పవన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. “రామ్ చరణ్ తో సినిమా త్వరలోనే ఉంటుంది. సరైన కథతో ఏ దర్శకుడైనా వస్తే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది“ అని పవన్ తెలిపారు. జనసేన పార్టీని స్థాపించి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో తలమునకలుగా ఉన్న పవర్ స్టార్ `పింక్` రీమేక్ తో తిరిగి రీఎంట్రీకి రెడీ అవుతున్నారు. అలాగే పవన్ కల్యాణ్ ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాలు తెరకెక్కించే సన్నాహకాల్లో ఉన్నారు. పవన్ వారసులు అఖీరా నందన్- ఆద్య టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర చర్చ సాగుతున్న నేపథ్యంలో తాజా ప్రణాళికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.