ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేష్ 15 ఏళ్ల త‌ర్వాత‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, మ‌హేష్ మ‌ధ్య స్నేహం గురించి తెలిసిందే. ఆ ఇద్ద‌రూ ఒక‌రి సినిమా ప్ర‌చారానికి ఒక‌రు సాయం చేసుకున్నారు. ఒకరి ఫ్యామిలీ ఫంక్ష‌న్ కి ఇంకొక‌రు ఎటెండ్ అవుతుంటారు. ఆ స్నేహం వ‌ల్ల‌ మ‌హేష్ – ప‌వ‌న్ అభిమానుల మ‌ధ్య వివాదాలు కొంత‌వ‌ర‌కూ ప‌రిష్కారం అయ్యాయి. సామాజిక మాధ్య‌మాల వెల్లువ‌లో ఫ్యాన్స్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం ఎప్పుడూ ఉండేదే అయినా హీరోల చొర‌వ‌తో అది చాలా వ‌ర‌కూ త‌గ్గింద‌నే చెప్పొచ్చు.

ఇక‌పోతే ప‌వ‌న్, మ‌హేష్ క‌లిసి న‌టించే మ‌ల్టీస్టార‌ర్ కోసం ఇరువురి అభిమానులు ఆస‌క్తిగానే వేచి చూశారు. అయితే అనూహ్యంగా ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డంతో ఆ అవ‌కాశం సంద‌ర్భం రానేలేదు. అయితే ఇంత గ్యాప్ త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్, మ‌హేష్ ఇద్ద‌రూ ఒకే వేదిక‌పై క‌లుసుకునేందుకు రెడీ అవుతున్నార‌న్న‌ది అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. ఆ సంద‌ర్భం ఎప్పుడు.. అన్న‌ది చూస్తే .. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ (టీసీపీఈయూ) ప్రారంభించి ఈ ఏడాదితో 25ఏళ్లు పూర్త‌యిన‌ సందర్భంగా సంస్థ రజతోత్సవ వేడుకలను నిర్వ‌హిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 8న హైద‌రాబాద్ గచ్చిబౌలి ఇన్‌డోర్‌ స్టేడియంలో ఈ కార్యక్రమానికి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, సూప‌ర్ స్టార్ మ‌హేష్ ల‌ను ముఖ్య అతిధులుగా ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మానికి అటెండ్ అయ్యేందుకు ఆ ఇద్ద‌రి నుంచి అంగీకారం ల‌భించింద‌ని తెలుస్తోంది. నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్‌, నిర్మాతలు కె.ఎస్‌ రామరావు, దిల్‌రాజు, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్‌.శంకర్‌, మా అధ్యక్షుడు నరేశ్‌, జీవితా రాజశేఖర్‌, రాజీవ్‌ కనకాల త‌దిత‌రులు హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన ఓ స‌మావేశంలో ర‌జ‌తోత్స‌వ వివ‌రాల్ని వెల్ల‌డించారు. దాదాపు 15ఏళ్ల క్రితం పైర‌సీని నిరోధించేందుకు ప‌వ‌న్ – మ‌హేష్ ఒకే వేదిక‌పైకి వ‌చ్చి ప్ర‌చారం చేశారు. త‌ర్వాత మ‌ళ్లీ ఇప్ప‌టికి కానీ ఆ ఇద్ద‌రి క‌ల‌యిక సాధ్య‌ప‌డ‌లేదు.