రైతులతో ఉగాది సంబరాలు – పవన్ కళ్యాణ్

Last Updated on by

గుంటూరు జిల్లా, తూళ్లూరు మండ‌లం, ఉద్దండ‌రాయునిపాలెం గ్రామంలో ఎస్సీ రైతులు, గ్రామ‌స్తుల స‌మ‌క్షంలో జ‌న‌సేన అధినేత శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అత్యంత నిరాఢంబ‌రంగా ఉగాది వేడుక‌లు జ‌రుపుకున్నారు.. రాజ‌ధాని భూసేక‌ర‌ణ‌లో భూములు కోల్పోయిన ఎస్సీ రైతుల ఆహ్వానం మేర‌కు ఆదివారం ఉద‌యం గం 11.10 నిమిషాల‌కి ఉద్దండ‌రాయునిపాలెం చేరుకున్న శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., వేద‌పండితుల ఆశీర్వ‌చ‌నాలు తీసుకున్నారు.. అనంత‌రం ఆ గ్రామ ఆడ‌ప‌డుచులు ష‌డ్రుచుల ఉగాది ప‌చ్చ‌డిని ఆయ‌న‌కి రుచి చూపించారు. ఉద‌యం గం 11.14 నిమిషాల‌కి శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌మ‌క్షంలో వేద‌పండితులు పంచాంగ శ్ర‌వ‌ణం గావించారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌ర‌స్ప‌రం ఎత్తులు పైఎత్తుల‌తో పాల‌న సాగించాల్సి వ‌స్తుంద‌ని., పాల‌కులు తీసుకునే కొన్ని నిర్ణ‌యాల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ప‌డుతుంద‌ని పండితులు తెలిపారు.. అన్ని రాష్ట్రాల్లో స‌గ‌టు వ‌ర్ష‌పాత సూచ‌న‌, అన్ని ర‌కాల ధ‌న్యాలకు గిట్టుబాటుతో రైతుల‌కి లాభం చేకూరుతుంద‌ని చెప్పారు. చివ‌ర్లో రాశిఫ‌లాలు చెప్ప‌బోగా., శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అన్ని రాసులు త‌న‌వేనంటూ సున్నితంగా నిలువ‌రించారు. అనంత‌రం బేత‌పూడి రైతులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారిని గ‌జ‌మాల‌తో. స‌త్క‌రించారు.. లంక భూముల రైతుల‌ని శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కూడా స్వీట్లు, పండ్ల‌తో స‌త్క‌రించారు..
అనంత‌రం లంక భూముల రైతులు మ‌రోసారి త‌మ గోడు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎదుట వెళ్ల‌బోసుకున్నారు.. స‌రైన ప‌రిహారం అందించ‌కుండా త‌మ భూములు ప్ర‌భుత్వం లాక్కున్న స‌మ‌యంలో  పేద‌వారి మొర ఆల‌కించే నాయుకుడు లేక నానా ఇబ్బందులు ప‌డ్డామ‌ని తెలిపారు. దిక్కుతోచ‌ని స్థితిలో మాకు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దిక్క‌య్యారని  చెప్పారు.. ఆయ‌న మాకు అండ‌గా నిల‌బ‌డ‌తాన‌న్నార‌ని రైతులు స్ప‌ష్టం చేశారు. ఇచ్చిన మాట మేర‌కు జ‌న‌సేన అధినేత త‌మ గ్రామానికి రావ‌డం ప‌ట్ల లంక భూముల రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌మ‌కు సాయం చేస్తార‌ని, త‌మ క‌ష్టాలు తీరుస్తార‌ని న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.
అసైన్డ్ భూముల ప‌రిహారం వ్య‌వ‌హారంలో జ్యుడిష‌య‌ల్ ఎంక్వ‌యిరీ జ‌రిపించాల‌ని జ‌న‌సేన అధినేత శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ డిమాండ్ చేశారు. లంక భూముల రైతుల‌కి ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపిన ఆయ‌న‌, తెలుగు ప్ర‌జ‌ల‌కి, ఆ గ‌ట్టుకి ఒక న్యాయం., ఈ గ‌ట్టుకి ఒక న్యాయం కుద‌ర‌ద‌న్నారు.  విశ్వ‌న‌గ‌రం కావాలంటే మ‌న‌సులు విశాలంగా ఉండాల‌న్న ఆయ‌న‌., స‌మ‌స్య‌ని వీల‌యినంత ఎక్కువ మంది దృష్టికి తీసుకెళ్ల‌డం ద్వారా  ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం మాత్ర‌మే చేస్తాన‌ని పున‌రుద్ఘాటించారు.. అసైన్డ్ భూముల రైతుల‌కి న్యాయం జ‌రిగే వ‌ర‌కు జ‌న‌సేన పార్టీ అండ‌గా ఉంటుంద‌న్న శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, ఎన్నిక‌ల్లోపు న్యాయం చేయ‌క‌పోతే 2019లో జ‌న‌సేన ఈ స‌మ‌స్య‌ను దృష్టిలో పెట్టుకుంటుంద‌ని హామీ ఇచ్చారు.

 

User Comments